PUBG లవర్ సీమా కేసులో అన్నీ అనుమానాలే..

పాకిస్తాన్‌ నుంచి అక్రమంగా ఇండియాలోకి వచ్చిన పబ్‌జీ లవర్‌ సీమా హైదర్‌ కేసులో యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ దర్యాప్తును వేగవంతం చేసింది. మంగళవారం కూడా సీమాను విచారించింది. అయితే, ఆమె నుంచి అన్ని ప్రశ్నలకు అధికారులు సమాధానాలు రాబట్టలేకపోయారు. సీమాతో పాటు ఆమె ప్రియుడు సచిన్‌ను కూడా అధికారులు విచారించారు. ‘మీ మామ, తమ్ముడు పాకిస్తాన్‌ ఆర్మీలో ఉన్నారట కదా?’ అని అధికారులు ఆమెను ప్రశ్నించారు. అదంతా అబద్ధమని ఆమె చెప్పింది.

తన సోదరుడు పాకిస్తాన్‌ ఆర్మీలో చేరడానికి ప్రీపేర్‌ అవుతున్నాడని తెలిపింది. ఇక, అధికారులు సచిన్‌, సీమల ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పాత డేటాను వెనక్కు తెచ్చే పనిలో ఉన్నారు. ఆమె ఆన్‌లైన్‌ పనుల బట్టి ఆమె పాకిస్తాన్‌ నుంచి ఇండియాలోకి ఎలా వచ్చిందనే విషయాలను తెలుసుకునే పనిలో పడ్డారు. సీమా నలుగురు పిల్లలకు సంబంధించిన ఇతర వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నారు. ఇక, సోమవారం అధికారులు ఇద్దర్నీ దాదాపు 8 గంటల పాటు విచారించారు. తర్వాత గ్రేటర్‌ నోయిడాలోని సచిన్‌ ఇంటికి పంపేశారు.

తర్వాత మళ్లీ వారిని గౌతమ్‌ బుద్ద నగర్లోని ఓ యాంటీ టెర్రరిస్ట్‌ స్క్వాడ్‌కు చెందిన ఇంటికి తీసుకువచ్చారు.  విచారణ సందర్బంగా సీమా పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులకు ఆమెపై అనుమానాలు పెరిగినట్లు సమాచారం. సీమా పాకిస్తాన్‌ ఏజెంట్‌ ఏమోనన్న అనుమానం సైతం అధికారులు వెలిబుచ్చుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమెను మరికొన్ని రోజులు వరుసగా విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.  మరి, సీమా హైదర్‌ ప్రేమ కోసమే ఇండియాలోకి వచ్చిందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments