పాపాగ్ని- చూసొద్దాం రండి

కర్ణాటక రాష్ట్రంలోని చిక్ బల్లాపూర్ జిల్లా,సిడ్లఘట్ట గ్రామ సమీపంలోని నంది కొండల్లో పుట్టిన నది పాపాగ్ని(పాపములను కాల్చే అగ్ని). పెన్నానదిలో కలిసే 9 ఉపనదుల్లో ఇదొక ప్రధాన ఉపనది.దీన్ని కొందరు పాపఘ్ని(పాపములను లేకుండా చేసేది)అని కూడా అంటారు.అయితే మరికొందరు రాస్తున్నట్లు ‘పాపాఘ్ని’ రాయడం సరైనది కాదనీ, దానికి ఏ అర్థమూ లేదనీ భాషాపండితులంటారు. కర్ణాటకలోని చిక్బళ్ళాపూర్, ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు,అనంతపురం, వైయస్సార్ కడప జిల్లాల్లోని 30 మండలాల(కర్ణాటకలో 5, రాయలసీమ లో 25)గుండా ఈ నది ప్రవహిస్తుంది. అనేక పల్లెలను తడుముతూ దాదాపు 205 కిలోమీటర్లు సాగి వైయస్సార్ కడపజిల్లాలోని కమలాపురం దగ్గర పెన్నానదిలో కలుస్తుంది.

ఈ నదీ పరీవాహక ప్రాంతంలో సరాసరి వర్షపాతం 60 నుండి 80 సెంటిమీటర్లు.అకాలంలోనో సకాలంలోనో పడినవానలకు 20యేళ్ళ కిందటి దాకా ఈ నదికి నీళ్లు బాగానే వచ్చేవి.ఏడాదిలో 5-6 నెలలు నదిలో ఎంతో కొంత నీటి ప్రవాహం ఉండేది.అందుకే భూగర్భ జలం వుండి,నది ఒడ్డున ఉన్న గ్రామాల రైతులు నదిలో నీళ్ళులేని కాలంలో అక్కడక్కడ నదిలోని మిట్ట ప్రాంతాల్లో దోస, పుచ్చకాయ పంటలు వేసుకునే వారు.నదీపరివాహక గ్రామాల్లో కూడా 15 – 20 అడుగుల్లోనే నీళ్లు పడేవి. రైతులు పై ఫిల్టర్ వేసుకొని మోటర్లతో నీళ్ళు తోడి ఆరుతడి పంటలు పండించేవాళ్ళు.1998 నుండి నాలుగేళ్ళు వరుసగా వానలు లేక కరువొచ్చింది.అప్పటి నుండీ ఈ నదికీ నీళ్ళ కరువొచ్చింది. నడుమ ఒకటి రెండు యేడాదులు నీళ్ళొచ్చినా, నీళ్ళులేని కాలమే ఎక్కువ.

గడిచిన 20-25 యేళ్ళలో నది ఎగువప్రాంతంలో కర్ణాటక, రాయలసీమలలో చిన్నచిన్న ఆనకట్టలు 5-6 కట్టుకున్నారు.రాయచోటి నియోజకవర్గంలోని గాలివీడుమండలం,వెలిగల్లు గ్రామ పరిధిలో మధ్యతరహా ప్రాజెక్టు ‘వెలిగల్లు’ 2008లో పూర్తయింది. వీటివల్లా, వానలు లేకా నదిలో నీటి ప్రవాహం దిగువకు రావడం గగనమయింది.దిగువన భూగర్భజలాలు పూర్తిగా అడగంటిపోయాయి. దీనికి తోడు నీళ్ళులేని నదిలో ఇసుక అడుక్కు ఊడ్చుకుపోయే ‘ఇసుక మాఫియా’ ఒకటి. నది తన సహజస్వరూపం కోల్పోయి గాయాలతో కుష్టురోగిలా వుంటుందెప్పుడూ.

పాపాగ్ని ఇక్కడ గండేరు

పాపాగ్ని వైయస్సార్ జిల్లాలో శేషాచలం కొండల వరుసను చీల్చి ప్రవహించే తావుకు ‘గండి’ అనే పేరు స్థిరపడింది.చక్రాయపేట మండలం మారెళ్ళమడక గ్రామపరిధిలో ఈ గండి ఏర్పడింది. అడ్డంగా తెగిన శేషాచలం కొండకు ఒక ముఖాన అతుక్కుని ఆంజనేయస్వామి క్షేత్రం నిర్మించారు. మరో ముఖానికి ఒరుసుకుంటూ పాపాగ్ని ప్రవహిస్తుంది.
గండాంజనేయస్వామి క్షేత్రం జిల్లాలో ప్రసిద్ధ క్షేత్రాల్లో ఒకటి.

జనశ్రుతి(folk etymology):

గండిక్షేత్రానికి ఒక జనశ్రుతకథ వుంది. అరణ్యవాసంలో శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి సీతను వెతుక్కుంటూ ఈ గండికి చేరుకున్నాడు. ఇక్కడ తపస్సు చేసుకుంటున్న వాయుదేవుడు వారిని తన ఆతిథ్యం స్వీకరించమని కోరుతాడు.తాము పోతున్న పని చెప్పి, తిరుగు ప్రయాణంలో సీతాసమేతంగా వస్తామని చెప్పిపోతాడు. రావణున్ని చంపిన తరువాత, పుష్పకవిమానంలో అయోధ్యకు పోతూ, చెప్పిన ప్రకారం మార్గమధ్యంలో తిరిగి గండికి చేరుకుంటారు.

పాపాగ్ని చీల్చిన గండికి అటు,ఇటు వున్న కొండలకు బంగారుతోరణం కట్టి వాయువు వారికి స్వాగతం పలుకుతాడు.ఆ రమణీయప్రకృతిలో సేదతీరిన రాముడు, తనకు అన్నిరకాలుగా సహాయపడిన హనుమంతుని తలుచుకుంటూ,తన బాణం కొనతో కొండపైన ఆంజనేయుని రేఖాచిత్రం గీస్తాడు.ఎడమచేయి వుంగరంవేలు చిటికెనవేలును విడదీసే సమయంలో, ఇప్పటికే కాలాతీతమయిందనీ అయోధ్యలో అందరూ ఎదురు చూస్తున్నారని లక్ష్మణుడు తొందర పెట్టగా అలాగే అర్ధాంతరంగా విడిచి పోతాడు.

ఆ తరువాతి యుగంలో వసంతాచార్యులనే ఆంజనేయభక్తుడు రాముడు గీసిన రేఖాచిత్రానికి గుడి కట్టి పూజలు మొదలుపెట్టాడు. వ్యాసరాయలు అనే శిల్పి, కొండకున్న రేఖాచిత్రాన్ని విగ్రహంగా మలిచాడు.ఆయన ఎడమచేతి చిటికెనవేలును విడివడేలా మొలిచే సమయంలో ఉలి వేటు పడగానే విగ్రహం వేలినుండి రక్తం కారిందట. దీంతో ఆ వేలిని అలాగే విడిచిపెట్టాడు.

ఇక్కడున్న ఆంజనేయవిగ్రహానికి ఎడమచేతి వుంగరపువేలు చిటికెనవేలు కలిసి ఒకే వేలుగా కనిపిస్తాయి.
ఈ కథను ఇక్కడ స్థలపురాణంగా వినిపిస్తుంటారు.

బంగారుతోరణం చూసిన మన్రో!

త్రేతాయుగంలో వాయుదేవుడు కట్టిన బంగారుతోరణం మహాపురుషులకే కనిపిస్తుందనీ, దీనిని చూసిన వారు ఆరు నెలల్లో స్వర్గానికి చేరుకుంటారని ఇక్కడ మరో జనశ్రుతం.

దత్తమండలాల కలెక్టర్ సర్ థామస్ మన్రో గండికి చేరుకున్నప్పుడు ఆయనకు ఈ తోరణం కనిపించిందట.అక్కడ పశువులు మేపుకుంటున్న ఒక ముసలమ్మ మన్రోకు అక్కడి లోకనిరుక్తిని చెప్పి, ఆరు నెలల్లో స్వర్గానికి పోతావని చెప్పిందట.గండిని దర్శించుకున్న ఆరు నెలల్లోనే మన్రో చనిపోయాడు.

చారిత్రకాధారం లేని ఈ పురాణాన్ని(myth) కడపజిల్లా గెజిటీర్ లో ప్రచురించడం అర్థంకాని అంశం.

గండిలో ప్రతియేటా శ్రావణమాసంలో ఉత్సవాలు జరుగుతాయి.గుడిని,పరిసరాలను ఆకర్షణీయంగా అలంకరిస్తారు. ఈ మాసంలో ముఖ్యంగా ప్రతి శని,మంగళవారాల్లో భక్తులు పోటెత్తుతారు.

వైయస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా వున్న సమయంలో ఈ గుడికి మహర్దశ పట్టింది. గండిక్షేత్రాన్ని టిటిడి దత్తత తీసుకుని గెస్టహౌస్లను నిర్మించి,పరిసరాలను అభివృద్ది చేసింది. పాపాగ్నికి గుడికి నడుమ వున్న రోడ్డును(వేంపల్లి-రాయచోటిరోడ్డు) ప్రభుత్వం నాలుగు వరుసల రోడ్డుగా మార్చింది. హరిత టూరిజం గెస్ట్ హౌస్ ను నిర్మించింది.నిరుడు, ఈసారీ పక్కనే వున్న గండేరు(పాపాగ్ని) పారుతుండడంతో గండిక్షేత్రం మరింత ఆహ్లాదంగా వుంది.

చిక్బళ్ళాపూర్ లో మఠం:

23పాపాగ్ని పుట్టిన చిక్బళ్ళాపూర్ జిల్లాలో నందికొండలకు సమీపంలోనే ఈనది ఒడ్డున ఒక పురాతన మఠం వుంది. దీన్ని పాపాగ్ని మఠం అంటారు.ఇక్కడున్న కాశీవిశ్వేశ్వరస్వామి విగ్రహానికి పూజలు జరుగుతుంటాయి. పోతులూరి వీరబ్రహ్మేంద్రుల వారు చిన్నతనంలో ఇక్కడే పెరిగారు. వీరభోజయ్యాచారి, వీరపాపమాంబల పెంపకంలో ఆయనిక్కడ పెరిగారు. బ్రహ్మంగారు తన పెంపుడుతల్లికి 7 యేళ్ళ వయసులోనే పిండోత్పత్తిక్రమం చెప్పాడని అంటారు.

మఠం ప్రాంతంలో వీరభోజయ్యాచారి, వీరపాపమాంబల సమాధులు వున్నాయి.ఈ ప్రదేశం కొండల నడుమ, పచ్చని చెట్లతో వుండడంతో ఇది ఒక పర్యాటక కేంద్రంగా మారింది. చిక్బళ్ళాపూర్ జిల్లావాసులకు ఇదొక రమణీయ పర్యాటకకేంద్రంగా వుంది.

Show comments