Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశం జరుగుతున్న వేళ ప్రతిపక్ష నేత, మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి, సంక్షేమంపై అత్యంత ముఖ్యమైన బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సమయంలో చంద్రబాబు తన పార్టీ సభ్యులతో సభ నుంచి వెళ్లిపోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తోంది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ప్రారంభించిన వెంటనే చంద్రబాబు, టీడీపీ సభ్యులు సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. దేశంలోనే సీనియర్ రాజకీయ నాయకుడని తనకుతానే చెప్పుకునే చంద్రబాబు.. రాష్ట్రానికి సంబంధించి అత్యంత ముఖ్యమైన బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సమయంలో సభలో లేకుండా వెళ్లిపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఉదయం గవర్నర్ ప్రసంగం సమయంలో కూడా ఆయన ప్రసంగాన్ని వినకుండా.. నినాదాలు చేస్తూ సభలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చంద్రబాబు అండ్ టీం చేసింది. అయితే 175 సభ్యుల గల అసెంబ్లీలో టీడీపీకి కేవలం 23 మందే ఉన్నారు. ఇందులోనూ ముగ్గురు ఇప్పటికే పార్టీకి దూరం అవగా 20 మంది మిగిలారు. ఈ 20 మందిలో అచ్చెం నాయుడును ఏసీబీ అరెస్ట్ చేయడంతో 19 మందే మిగిలారు. ఉన్న అరకొర సంఖ్యాబలం మరింత తగ్గడంతో సభలో గందరగోళం సృష్టించాలనుకున్న టీడీపీ లక్ష్యం నెరవేరలేదు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలోనూ నిరసన తెలిపినా.. తమ లక్ష్యంగా నెరవేరదని భావించిన చంద్రబాబు..సభ నుంచి బయటకు వెళ్లిపోవడమే మంచిదనుకున్నట్లుగా ఆయన నిర్ణయాన్ని బట్టి తెలుస్తోంది.
రేపు, ఎల్లుండి చంద్రబాబు మొదలుకొని ఆయన పార్టీ నేతలందరూ మీడియా సమావేశాలు నిర్వహించి బడ్జెట్‌పై విమర్శలు చేస్తారనడంలో సందేహం లేదు. అయితే ప్రజలు ఓట్లు వేసి తమ తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అసెంబ్లీకి పంపిస్తే..అక్కడ మాట్లాకుండా బయటకు వచ్చేసి ప్రెస్‌మీట్లలో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు హర్షించరు. ఈ వ్యవహారం వల్ల టీడీపీకి లాభం చేకూరకపోగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది.
కరోనా వైరస్ నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు రెండు రోజులపాటు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం, ఆమోదం జరగనుండగా.. రేపు కొన్ని ముఖ్యమైన బిల్లులపై చర్చ ఆమోదం తర్వాత సభ నిరవధికంగా వాయిదా పడనుంది. బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సమయంలో సభ నుంచి వెళ్లిపోయిన చంద్రబాబు అండ్ టీం రేపు పలు బిల్లులు ప్రవేశపెట్టే సమయంలోనైనా హాజరవుతుందా..? లేదా..? చూడాలి.