Oka Chinna Family Story : ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ రిపోర్ట్

ఈ ,మధ్యకాలంలో తెలుగు వెబ్ సిరీస్ లు కూడా వేగమందుకున్నాయి. ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లు మన దగ్గర స్ట్రెయిట్ గా నిర్మించేందుకు అంతగా ఆసక్తి చూపనప్పటికీ ఈ విషయంలో ప్రధాన పోటీ జీ5. ఆహాల మధ్య ఉంటోంది. పేరున్న క్యాస్టింగ్ వీటిలో నటించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉండటంతో దర్శక నిర్మాతలు కొత్త కొత్త క్రియేటివ్ ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే జీ5 స్ట్రీమింగ్ జరుపుకున్న షో ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ ప్రధాన జంట కాగా సీనియర్ నరేష్, తులసి, రాజీవ్ కనకాల లాంటి పేరున్న తారాగణం ఉండటంతో ఈ సెటప్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి ఇది మెప్పించేలా ఉందో రిపోర్ట్ లో చూద్దాం

బాధ్యత లేకుండా బలాదూర్ గా తిరిగే మహేష్(సంగీత్ శోభన్)కు కుటుంబ వ్యవహారాలు అంతగా పట్టవు. కానీ ఓ రోజు అనూహ్యంగా తండ్రి(నరేష్) మరణించడంతో ఫ్యామిలీ బాధ్యత నెత్తి మీద పడుతుంది. ఇదే భారమనుకుంటే తనకు చెప్పకుండా నాన్న తీసుకున్న 25 లక్షల అప్పు సంగతి బయట పడుతుంది. ఇక అక్కడినుంచి మొదలవుతుంది అసలు టార్చర్. అసలు ఆయన అంత డబ్బు ఏం చేశాడు, ఎందుకు తీసుకున్నాడు లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ. చాలా సహజమైన వాతావరణంలో సగటు మధ్య తరగతి వాతావరణాన్ని ప్రతిబింబించేలా దర్శకుడు మహేష్ ఉప్పల తీసుకున్న శ్రద్ధ బాగుంది.

ఆర్టిస్టులందరూ బాగా చేశారు. ఎప్పటిలాగే నరేష్, తులసిలు తమ అనుభవంతో నిలబెట్టేశారు. సంగీత్ శోభన్ పాత్రకు తగ్గట్టు బాగున్నాడు. టేకాఫ్ అండ్ లీడ్స్ చక్కగానే ఉన్నప్పటికీ మధ్యలో కొచ్చేటప్పటికీ ఈ స్టోరీ అనవసరమైన ల్యాగ్ కు గురయ్యింది. అన్ని ఎపిసోడ్లు కలిపి ఎలాగైనా మూడు గంటల నిడివిని దాటించాలనే టార్గెట్ పెట్టుకుని సన్నివేశాలను ఇరికించడం స్పష్టంగా కనిపిస్తుంది. దీని బదులు గంటన్నరలో సినిమాగా చేసినా మంచి ఫలితం దక్కేది. అప్పు విషయంలో హీరో చేసే పనులు సిల్లీగా అనిపిస్తాయి. ఫైనల్ గా ఓ మాదిరి ఎంటర్ టైన్మెంట్ చాలనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. మరీ దారుణంగా నిరాశ పరచదు

Also Read : Shyam Singha Roy : నాని డ్యూయల్ రోల్ – ఇదా కహాని

Show comments