కెనడాలో మంచి ఉద్యోగాలు.. ప్రేమించుకుని పెళ్లిచేసుకున్నారు.. కానీ విధి వక్రించింది !

ఇద్దరికీ కెనడాలో మంచి ఉద్యోగం. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. అక్కడే ఇద్దరికీ పరిచయం అయింది. ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. చక్కనైన జంట.. కానీ దేవుడు మెచ్చలేదు. ఆర్టీసీ బస్సు రూపంలో వరుడిని మృత్యువు వెంటాడింది. ఈ విషాద ఘటన తెలంగాణలోని నకిరేకల్ లో జరిగింది. పెళ్లైన 15 రోజులకే నవ వరుడు రోడ్డుప్రమాదంలో మృతి చెందడం.. రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.

సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన ఆద పృథ్వీ(29)కి, విజయవాడకు చెందిన భార్గవితో గత నెల 26న వైభవంగా వివాహం జరిగింది. ఇద్దరూ కెనడాలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు. మరో వారంరోజుల్లో కెనడాకు వెళ్లాలని ఏర్పాట్లు చేసుకున్నారు. గురువారం (జూన్9) పృథ్వీ తన తండ్రి రాజేందర్ తో కలిసి కారులో నకిరేకల్ మీదుగా హాలియాకు బయల్దేరాడు. నకిరేకల్‌ మండలం గోరెంకలపల్లి శివారులోని మూలమలుపు వద్ద కరీంనగర్‌ డిపో–2కు చెందిన ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పృథ్వీ తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. కానీ.. అప్పటికే అతను చనిపోయాడని వైద్యులు తెలిపారు.

పృథ్వీ తండ్రి రాజేందర్ కు తృటిలో ప్రాణాపాయం తప్పింది. పెళ్లయిన 15రోజులకే పృథ్వీ మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడి తండ్రి రాజేందర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నకిరేకల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Show comments