కేసీఆర్ మంత్రివర్గంలో ఉద్యమ వీరులెందరు..?

తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ ప్రకంపనలు సృష్టిస్తోంది. మొన్నటి దాకా ఈటల తన కుడిభుజం అని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు ఈటలకే వెన్నుపోటు పొడిచారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన ఈటల రాజేందర్ పై పగబట్టారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ వీరులను అవమానించడం, ఉద్యమ ద్రోహులను పెంచిపోషించడం కేసీఆర్ కు అలవాటేనని మండిపడుతున్నాయి.

ఉన్నది ముగ్గురే..

టీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్, మంత్రులుగా కేటీఆర్, హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, జగదీశ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి ఉన్నారు.

అయితే వీళ్లలో ఉద్యమంలో పాల్గొన్నది ఐదుగురు మాత్రమే. అందులో ఇద్దరు కేసీఆర్ కుటుంబ సభ్యులే ఉన్నారు. కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి మాత్రమే ప్రత్యేక తెలంగాణ పోరాటంలో కేసీఆర్ తో కలిసి పాల్గొన్నారు. నల్గొండ జిల్లా కోర్టులో లాయర్ గా ప్రాక్టీస్ చేసిన జగదీశ్ రెడ్డి.. నల్గొండ జిల్లా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా పని చేశారు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ తో కలిసి నడిచారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్ బీ చేసిన నిరంజన్ రెడ్డి.. టీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు. పార్టీ ప్రారంభం నుంచి కేసీఆర్ వెంట ఉన్నారు. ప్రశాంత్ రెడ్డి కూడా 2001 నుంచే టీఆర్ఎస్ లో ఉన్నారు. వీరి తర్వాతే కేటీఆర్ టీఆర్ఎస్ లోకి వచ్చారు. 2004లో అమెరికా నుంచి వచ్చి రాజకీయాల్లోకి దిగారు. కొప్పుల ఈశ్వర్ కూడా 2004 నుంచి టీఆర్ఎస్ తో కొనసాగుతున్నారు.

ఎవరు ఎక్కడ నుంచి.. ..

ప్రస్తుతం కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్న చాలా మంది ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు. ఉద్యమాన్ని వ్యతిరేకించిన వారు కూడా ఉన్నారు. కొందరు 2014 ఎన్నికలకు ముందు, ఎన్నికలయ్యాక వచ్చిన వాళ్లు ఉన్నారు. అంతకుముందు టీఆర్ఎస్ పై, కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన వాళ్లు ఉన్నారు. ప్రస్తుత మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్.. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి గులాబీ కండువా కప్పుకున్న వాళ్లే. ఎన్నోసార్లు కేసీఆర్ ను తిట్టిన వాళ్లే.

2009లో టీటీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన గంగుల కమలాకర్.. 2013లో టీఆర్ఎస్ లో చేరారు. 2014లో మల్కాజిగిరి ఎంపీగా టీడీపీ నుంచి గెలిచిన మల్లారెడ్డి… కొన్నాళ్లకే కారు ఎక్కారు. తర్వాతి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి మంత్రి అయ్యారు. ఇక మంత్రి సబితా ఇంద్రారెడ్డి ముందు నుంచీ కాంగ్రెస్ లోనే ఉన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచే గెలిచారు. మంత్రి పదవి ఇస్తామని చెప్పడంతో టీఆర్ఎస్ లో చేరారు.

సత్యవతి రాథోడ్ కూడా ఈ మధ్య టీఆర్ఎస్ లోకి వచ్చిన వారే. గతంలో టీడీపీలో ఉన్న ఆమె.. తెలంగాణ ఉద్యమంలో ఏనాడూ పాల్గొనలేదు. ఇక పువ్వాడ అజయ్.. 2013 దాకా వైసీపీలో ఉండి తర్వాత కాంగ్రెస్ లో చేరారు. 2014లో ఖమ్మం నుంచి గెలిచారు. తర్వాత రెండేళ్లకే కారు పార్టీలోకి చేరారు. ఇంద్రకరణ్ రెడ్డి 2014లో బీఎస్పీ నుంచి పోటీ చేసి గెలిచి.. టీఆర్ఎస్ లో చేరారు.

2014 దాకా తెలంగాణ ఉద్యోగ సంఘాల్లో కీలకంగా వ్యవహరించిన శ్రీనివాస్ గౌడ్.. తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. ప్రత్యక్షంగా ఆయన టీఆర్ఎస్ తో ఉన్నది 2014 తర్వాతే. తెలంగాణ కేబినెట్ లో మంత్రి పదవి చేపట్టక ముందు దాకా మహమూద్ అలీ పేరు చాలా మందికి తెలియదు.

Also Read : ఈటలకు తొలి విజయం

Show comments