iDreamPost
iDreamPost
ఒకప్పుడు శత్రువు, పోలీస్ లాకప్, దేవి, ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, మనసంతా నువ్వే లాంటి ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ క్లాసిక్స్ నిర్మించిన ఎంఎస్ రాజు అంటే ఇండస్ట్రీతో పాటు ప్రేక్షకుల్లోనూ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ మధ్య వరుస ఫ్లాపులతో గ్యాప్ తీసుకుని మళ్ళీ డర్టీ హరీ లాంటి అడల్ట్ మూవీతో కంబ్యాక్ అయ్యారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేయకుండా కేవలం యూత్ నే లక్ష్యంగా చేసుకుని తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చేలా ప్లాన్ చేసుకున్నారు. దానికి మంచి స్పందనే వచ్చింది. ఇప్పుడదే కోవలో వచ్చిన మరో మూవీ 7 డేస్ 6 నైట్స్. స్వీయ దర్శకత్వంలో ఈసారి కూడా రొమాంటిక్ జానర్ కే వెళ్లారు. రిపోర్ట్ చూద్దాం.
సినిమా దర్శకుడు కావాలన్నది ఆనంద్(సుమంత్ అశ్విన్)లక్ష్యం. వ్యక్తిగత జీవితంలో లవ్ బ్రేకప్ అయినా ఆ అమ్మాయి జ్ఞాపకాల నుంచి ఇంకా బయటపడలేక ఇబ్బంది పడుతుంటాడు. ఇతని ప్రాణ స్నేహితుడు కుమార మంగళం(రోహన్). ఇద్దరూ కలిసి గోవా ట్రిప్ ప్లాన్ చేసుకుంటారు. అక్కడికి వెళ్ళాక ఆనంద్ కొత్తమ్మాయి రతిక(మెహర్ చావల్)ప్రేమలో, కుమార్ అమియా(కృతిక శెట్టి) లవ్ లో పడతారు. ఆ తర్వాత వీళ్ళ జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయి, టైటిల్ కి కథకి సంబంధం ఏంటనేది తెరమీద చూడాలి. సుమంత్ అశ్విన్ కాస్త ఒళ్ళు చేసినా ఎప్పటిలాగే హుషారుగా చలాకిగా చేసుకుంటూ పోయాడు. రోహన్ కూడా బాగున్నాడు.
దర్శకుడు ఎంఎస్ రాజు కేవలం ఒక పరిమిత ఏజ్ గ్రూప్ ని టార్గెట్ చేసుకుని తీసినప్పటికీ కథనం మరీ నెమ్మదిగా సాగడం, అవసరం లేని సన్నివేశాలను ఎక్కువగా జొప్పించడం వల్ల ఓవరాల్ గా తక్కువ నిడివి ఉన్నా ఈ సినిమా మెప్పించడంలో ఫెయిల్ అయ్యింది. కొన్ని సీన్లు బాగానే వచ్చినప్పటికీ కేవలం వాటిని చూసి థియేటర్ ఆడియన్స్ సంతృప్తి చెందటం అసాధ్యం. ఓటిటిలో అయితే ఈ అభిప్రాయాల్లో మార్పు ఉండేదేమో కానీ టికెట్ కొని చూపించే ఎంటర్ టైన్మెంట్ కాబట్టి ఆ యాంగిల్ లో చూసుకుంటే రాజుగారు దానికి పూర్తి న్యాయం చేయలేకపోయారు. జస్ట్ యావరేజ్ కంటెంట్ తో కఠినమైన బాక్సాఫీస్ పోటీలో ఇది నెగ్గడం చాలా కష్టం.