Praveen Kumar Sobti : స్వర్గానికేగిన సకలకళా ఆజానుబాహుడు

కమల్ హాసన్ సినిమా ‘మైకేల్ మదన కామ రాజు’ చూసిన వాళ్లకు అందులో భీమ్ భాయ్ క్యారెక్టర్ బాగా గుర్తుండే ఉంటుంది. ఒకవేళ 90 దశకంలో వచ్చిన మహాభారత్ టీవీ సీరియల్ ని క్రమం తప్పకుండా ఫాలో అయ్యే వాళ్లకు భీముడిగా ఈయన బాగా సుపరిచితం. ఒక తరాన్ని ఊపేసిన ఆ అద్భుత గాధలో ప్రవీణ్ పేరు దేశమంతా మారుమ్రోగిపోయింది. అలాంటి గొప్ప ఖ్యాతి సంపాదించుకున్న ప్రవీణ్ నిన్న సాయంత్రం తన స్వగృహంలో గుండెపోటుతో కన్ను మూశారు. వయసు 75. ఈ విషయాన్ని కూతురు నిహారిక ధృవీకరించారు. చాలా కాలంగా ప్రవీణ్ నటనకు దూరంగా ఉన్నారు. ఆఫర్లు వస్తున్నప్పటికీ వయోభారం వల్ల పాత్రలు వదులుకున్నారు.

ప్రవీణ్ కుమార్ సోబ్తి మనకు నటుడిగానే పరిచయమైనప్పటికీ అసలు బ్యాక్ గ్రౌండ్ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఎందుకంటే క్రీడల్లో విశేష ప్రావిణ్యం చూపించిన ట్రాక్ రికార్డు ఆయన సొంతం. 1947 డిసెంబర్ 6న జన్మించిన ప్రవీణ్ స్వతహాగా హ్యామర్ తో పాటు డిస్క్ త్రోయర్ గా విశేష నైపుణ్యం కలిగినవారు. 20 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు తన అథ్లెట్ స్కిల్స్ తో బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ని మెప్పించిన అరుదైన ఘనత సొంతం చేసుకున్నారు. ఆసియన్ గేమ్స్ లో రెండు గోల్డ్ మెడల్స్ తో కలిపి మొత్తం నాలుగు పతకాలు సాధించారు. కామను వెల్త్ గేమ్స్ లో సిల్వర్ మెడల్ సాధించారు. ఆమ్ ఆద్మీ, బీజెపిలో పని చేశారు.

1988 బిఆర్ చోప్రా మహాభారత్ సీరియల్ తో ప్రవీణ్ గురించి ప్రపంచానికి తెలిసింది. అందులో భీముడిగా ఈయన్ను చూశాక అప్పట్లో ఆ మహాకాయుడు ఇలాగే ఉండేవాడన్న అభిప్రాయం జనం మనస్సులో బాగా ముద్రించుకుపోయింది. అంతకు ముందే 1981 నుంచి సినిమాల్లో నటించిన అనుభవం ప్రవీణ్ కు ఉంది. రాజ్ తిలక్, సింఘాసన్, ఖుద్ గర్జ్, షెహెన్షా, బీస్ సాల్ బాద్, ఘాయల్, ఆజ్ కా అర్జున్, జాన్ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్స్ లో నటించారు. 1994లో తెలుగులో వచ్చిన కిష్కిందకాండ ప్రవీణ్ ఏకైక టాలీవుడ్ మూవీ. 2013లో వచ్చిన మహాభారత్ ఔర్ బర్బరీక్ ఈయన చివరి సినిమా కావడం కాకతాళీయం, విధి లిఖితం

Also Read : RRR : చరణ్ తారక్ అభిమానులకు పండగే

Show comments