లాక్ డౌన్ రివ్యూ 64 – అంధకారం

నెట్ ఫ్లిక్స్ లో ఈ రోజు విడుదలైన సినిమా అంధకారం. ట్రైలర్ వచ్చినప్పటి నుంచి హారర్ ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న ఈ మూవీ మీద అంచనాలు ఓ మాదిరిగానే ఉన్నాయి. తమిళంలో రూపొందే ఇలాంటివి మెల్లగా టాక్ ని బట్టి రెస్పాన్స్ తెచ్చుకుంటాయి కాబట్టి ఆ రకంగానే ఇది కూడా ప్రత్యేకంగా ఉండొచ్చనే అభిప్రాయం ఆడియన్స్ లో ఉంది. ఎలాంటి ప్రమోషన్ లేకుండా చాలా సైలెంట్ గా వచ్చిన ఈ అంధకారం ఎలా ఉందొ రివ్యూలో చూద్దాం

కథ

ఇది ముగ్గురి జీవితాలతో ముడిపడిన క్రైమ్ కం హారర్ థ్రిల్లర్. డాక్టర్ ఇంద్ర(కుమార్ నటరాజన్)సైకియాట్రిస్ట్. ఊహించని విధంగా ఓ పేషేంట్ చేతిలో కాల్చివేతకు గురై కోమాలో నుంచి బయటికి వచ్చి మళ్ళీ ప్రాక్టీస్ ప్రయత్నాలు మొదలుపెడతాడు. గవర్నమెంట్ ఆఫీసర్ లో క్లర్క్ గా పని చేసే సూర్యం(వినోద్ కిషన్)కు కళ్ళు కనిపించవు.

కిడ్నీ ఆపరేషన్ చేయించుకోవడం కోసం డబ్బు అవసరమై వెతుకుతూ ఉంటాడు. విచిత్రమైన మానసిక సమస్యతో బాధ పడుతున్న క్రికెటర్ వినోద్(అర్జున్ దాస్) దాన్నుంచి బయట పడే మార్గం తెలియక తీవ్ర క్షోభకు గురవతుంటాడు. వీళ్లకు బ్రెయిలీ లిపి టీచర్(పూజ రామచంద్రన్)కు లింక్ ఉంటుంది. వీళ్ళ జీవితాలలో అంతులేని ఓ భయంకర రహస్యం ఉంటుంది. అదేంటో తెలియాలంటే అంధగారం చూడాలి

నటీనటులు

బహుశా ఇంత తక్కువ క్యాస్టింగ్ తో రూపొందిన ఇంత పెద్ద క్రైమ్ కం హారర్ థ్రిల్లర్ ఈ మధ్యకాలంలో నిస్సందేహంగా ఇదే. మొదటగా గుర్తుండిపోయేది వినోద్ కిషన్. కార్తీ నా పేరు సూర్యలో విలన్ గ్యాంగ్ లో ఒకడిగా పేరు తెచ్చుకున్న ఇతను గుడ్డివాడిగా మంచి పెరఫార్మన్స్ ఇచ్చాడు. చాలా సన్నివేశాలను నిలబెట్టాడు. తర్వాత చెప్పుకోవాల్సింది అర్జున్ దాస్ గురించి. హిస్టీరియా వచ్చి ఊగిపోయే వాడిగా జీవించాడు. డాక్టర్ గా చేసిన కుమార్ నటరాజన్ కూడా కూల్ గా తన పాత్రకు సంబంధించి ఎలాంటి క్లూస్ ఇవ్వకుండా చాలా నీట్ గా చేశారు. పూజా రామచంద్రన్ కు గొప్ప సీన్లు పడలేదు ఉన్నంతలో చక్కగా ఉంది. వీళ్ళు తప్ప సినిమా అయ్యాక ఇంకెవరైనా గుర్తుకు వస్తే ఒట్టు

డైరెక్టర్ అండ్ టీమ్

అంధకారం నిడివి 2 గంటల 51 నిముషాలు. నిజానికి క్రైమ్ లేదా హారర్ థ్రిల్లర్స్ వేగంగా ఉంటేనే ప్రేక్షకులకు నచ్చుతాయి. కానీ సబ్జెక్టు అంత డిమాండ్ చేయకపోయినా దర్శకుడు విఘ్నరాజన్ ఎందుకు ఇంత లెన్తీ స్క్రీన్ ప్లే రాసుకున్నాడో అర్థం కాదు. మొదటి గంట సేపు కథ ముందుకు సాగదు. దానికి తోడు మూడు ట్రాక్స్ ని పారలల్ గా నడిపించడంతో పాటు కథనం నెమ్మదిగా సాగడంతో ఒకరకమైన కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. మెదడుకు మేత లేకుండా సింపుల్ గా సినిమా చూడాలనుకునే సగటు ప్రేక్షకులకు చాలా బోర్ కొట్టేస్తుంది. అసలు స్టోరీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూడటం మొదలుపెడతారు.

ఇందులో ఉన్న మరో ప్రధాన మైనస్ రిపీటెడ్ సీన్స్. మళ్ళీ మళ్ళీ వస్తున్నట్టు అనిపిస్తాయి. స్ట్రెయిట్ గా పాయింట్ కి కట్టుబడి ఉంటే ఈజీగా గంట నిడివికి కోత పడేది. ఇదేమి ఎమోషనల్ డ్రామా కాదు ఆడియన్స్ కనెక్ట్ అయ్యేందుకు టైం తీసుకోవడానికి. టైటిల్, ట్రైలర్ ని బట్టి ఇదో థ్రిల్లర్ అని ముందే క్లారిటీ ఇవ్వాలని డిసైడ్ అయినప్పుడు ఇంత సాగతీత అవసరం లేదు. ఈ కారణంగా విఘ్నరాజన్ లో మంచి టెక్నీషియన్ ఎక్కువ గుర్తింపు పొందకుండా ఆగిపోయాడు. ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్ చాలా మటుకు కాపాడింది కానీ లేదంటే ఇంటర్వెల్ లోపే మూవీని కట్టేసి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చేది.

ఇంకొంత లోతుగా విశ్లేషించాలంటే కొన్ని ట్విస్టులు చెప్పాల్సి వస్తోంది కాబట్టి ఎక్కువ రివీల్ చేయడం భావ్యం కాదు కనక వాటిని ప్రస్తావించడం లేదు. అంధకారం ఖచ్చితంగా ఒక విభిన్న ప్రయత్నం. ఇంతకు ముందు వచ్చిన భద్రం, మయూరి, డాక్టర్ సలీం తరహాలో టిపికల్ అనిపిస్తునే ఆసక్తి కలిగిస్తుంది. కాకపోతే డిటైలింగ్ ఎక్కువ కావడంతో ఇంపాక్ట్ బాగా తగ్గిపోయింది. మొత్తంగా ఓ గంట మాత్రమే ఎంగేజింగ్ గా అనిపిస్తుంది. సూర్యకు సంబంధించి అసలు మలుపు బయటపడిన తర్వాత ఓ గంట సేపు ఇంటరెస్టింగ్ గానే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ గ్రాఫ్ డౌన్ అవుతుంది. మొత్తంగా అంధకారం ఈ జానర్ ని విపరీతంగా ఇష్టపడే వాళ్ళు తప్ప మిగిలినవాళ్లు భరించడం కష్టమే

ప్రదీప్ కుమార్ సంగీతం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పరంగా బాగానే కుదిరింది. ఉన్న ఒక్క పాట ఫార్వార్డ్ కే పనికొచ్చింది. ఎడ్విన్ సాకే ఛాయాగ్రహణం మంచి స్టాండర్డ్ లో కనిపించింది. కొన్ని టిపికల్ ఫ్రేమ్స్ ని చక్కగా ప్రెజెంట్ చేశాడు. సత్యరాజ్ నటరాజన్ ఎడిటింగ్ మాత్రం ఫైనల్ కాపీకి ముందోసారి చెక్ చేసుకోవాల్సింది. ప్రముఖ దర్శకుడు అట్లీ నిర్మాణ భాగస్వామిగా ఉన్న అంధకారం ప్రొడక్షన్ పరంగా ఎలాంటి బడ్జెట్ డిమాండ్ చేసే విధంగా లేదు. సిజి ఎఫెక్ట్స్ కూడా తక్కువే.

ప్లస్ గా అనిపించేవి

తారాగణం
కీలక ట్విస్టులు
కెమెరా వర్క్
బిజిఎం

మైనస్ గా తోచేవి

చాలా ఎక్కువ నిడివి
సాగతీత
రిపీటెడ్ సీన్స్
కన్ఫ్యుజింగ్ స్క్రీన్ ప్లే

కంక్లూజన్

అంధకారం ఎలాంటి అంచనాలు లేకుండా మీ దగ్గర ఖాళీ సమయం విపరీతంగా ఉండి, మీరో థ్రిల్లర్ లవర్ అయితే తప్ప మెప్పించడం కష్టం. ఈజీగా ఊహకందే విధంగా కథనం లేకపోవడం ఒక్కటే ఇందులో ఉన్న ఒకే ఒక్క ప్లస్ పాయింట్. అదొక్కటే కదలకుండా చూసేందుకు సరిపోలేదు. అందుకే బెస్ట్ థ్రిల్లర్స్ లో నిలిచే ఛాన్స్ ని అంధగారం లెన్త్ వల్ల మిస్ చేసుకుంది. మాలో ఓపిక బోలెడంత ఉంది, కాసిన్ని థ్రిల్స్ దొరికినా చాలు సంతోషపడిపోతాం అనుకుంటే ట్రై చేయండి

అంధకారం – థ్రిల్స్ ని చంపేసిన నిడివి

Show comments