కుప్పంలో బాబుకు కొత్త ప్రత్యర్థి

ఈ సారి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాజీ సీఎం చంద్రబాబు నియోజకవర్గమైన కుప్పంలో సత్తా చాటడానికి  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సమాయత్తమవుతోంది. మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

కుప్పం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తగా ఉన్న మాజీ ఐఏఎస్‌ అధికారి చంద్రమౌళి అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ఎక్కువగా ఆస్పత్రిలోనే ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు భరత్‌ స్థానికంగా ఉంటూ పార్టీ కేడర్‌ను అన్నీ తానై నడిపిస్తున్నారు. త్వరలోనే భరత్‌కు నియోజవర్గ బాధ్యతలు పూర్తి స్థాయిలో అప్పగించాలని అధిష్టానం భావిస్తోంది. శనివారం కుప్పంలో జరిగిన సభలో ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చింది. భరత్‌కు పార్టీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సభా ముఖంగా స్పష్టం చేశారు. కుప్పం అభివృద్ధి కోసం భరత్‌ ఏమికోరినా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భరత్‌ తనకు కొడుకు లాంటివాడని చెప్పారు.

అధిష్టానం మెప్పు పొందిన భరత్‌..
2019 ఎన్నికల్లో చంద్రమౌళిని పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఆయన పూర్తిగా అనారోగ్యం పాలయ్యారు. ఈ సమయంలో భరత్‌ ప్రచార బాధ్యతలను నిర్వహించారు. వైఎస్‌ జగన్‌ నిర్వహించిన బహిరంగసభను విజయవంతం చేశారు. అలాగే ఇంటింటి ప్రచారంలో చురుగ్గా వ్యవహరించారు. ఇలా పార్టీ అధినేత జగన్‌ దృష్టిలో మంచి పేరు సాధించారు భరత్‌. మరోవైపు చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో మెజారిటీ భారీగా తగ్గించడంలో సఫలీకృతయ్యారు. 2014 ఎన్నికల్లో 47,121 మెజారీటీ చంద్రబాబు సాధించగా.. 2019 నాటికి 30,000 తగ్గించారు.


ఎన్నికల తర్వాత కూడా చంద్రబాబు ఒక్క సారికూడా నియోజకవర్గానికి రాకపోవడాన్ని ప్రశ్నిస్తూ భరత్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు జరిగాయి. ఇలాంటి సమయంలో పట్టు విడవకుండా ప్రయత్నించి.. మొదట స్థానిక ఎన్నికలను, తర్వాత నియోజవర్గాన్ని సొంతం చేసుకోవచ్చని అధిష్టానం భావిస్తోంది. అందుకే యువకుడైన భరత్‌ను పూర్తిస్థాయిలో రంగంలోకి దింపాలని నిర్ణయించింది.

పార్టీలో చేరడానికి సుబ్రహ్మణ్యంరెడ్డి ప్రయత్నాలు…
మొదట వైఎస్సార్‌సీపీలోనే ఉండి టీడీపీలో చేరిన సుబ్రహ్మణ్యం రెడ్డి తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలోని కీలక నేతల ద్వారా తన అభీష్టాన్ని తెలియజేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పదవులు ఆశించవద్దని, పార్టీ బలోపేతానికి చంద్రమౌళి కుటుంబంతో కలసి పనిచేయాలని పెద్దలు సూచించారు. అందుకు ఆయన ఓకే చెప్పడంతో త్వరలోనే పార్టీలో చేరడానికి క్లియరెన్స్‌ దొరికినట్లు నియోజకవర్గంలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరూ కలసి పనిచేస్తే కుప్పంను సొంతం చేసుకోవడం సులభమవుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.

Show comments