దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి.. దసరా నాటికి అందుబాటులోకి: కేటీఆర్‌

మనిషికి అతి ముఖ్యమైనవి ఏంటి అంటే కూడు, గూడు, గుడ్డ అంటాం. కానీ వాటికన్న ముఖ్యమైనది నాణ్యమైన వైద్యం. మన దేశంలో మెరుగైన వైద్యం అందడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్తే.. ఆస్తులు అమ్ముకోవాలి.. ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే అక్కడ అరకొర పరిస్థితులు, సౌకర్యాల కొరత.. దాంతో అసలు ప్రాణాలతో బయటకు వస్తామో లేదో అన్న నమ్మకం లేని పరిస్థితి. నేటికిక కూడా మన దేశంలో సామాన్యులకు మెరుగైన వైద్యం అనేది అందని ద్రాక్షే అయ్యింది. ఈ పరిస్థితి మార్చడానికి తెలంగాణలోని బీఆర్‌ఎస్‌ సర్కార్‌ ముందడుగు వేసింది.

ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో అనేక మెరుగైన సౌకర్యాలు కల్పించి.. పేదలకు మంచి వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దానిలో భాగంగా రాష్ట్రంలో అన్ని వసతులతో కూడిన ఆస్పత్రలు నిర్మాణం చేపట్టింది. దీనిలో భాగంగా కేసీఆర్‌ ప్రభుత్వం రాష్ట్రంలో 6 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా వరంగల్‌లో దేశంలోనే అతి పెద్ద సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం ప్రారంభించింది. ఈ ఏడాది దసరా నాటికి ఆస్పత్రిని ప్రారంభించాలని లక్ష్యంగా కేసీఆర్‌ సర్కార్‌ పని చేస్తోంది.

ఈ క్రమంలో తాజాగా కేటీఆర్‌ ఈ ఆస్పత్రి గురించి చేసిన ట్వీట్‌ నెట్టింట వైరల్‌ అవుతోంది. ‘‘వరగంల్‌లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ దవాఖానను నిర్మిస్తోంది. 2 వేల పడకల సామర్థ్యంతో, అత్యంత అధునాతన వసతులతో ఈ ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది దసరా పండగ నుంచి ఈ ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు’’ అంటూ ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేశారు కేటీఆర్‌. ప్రస్తుతం అవి నెట్టింట వైరలవుతున్నాయి. వరంగల్‌లోని పాత సెంట్రల్‌ జైలు స్థలంలో నిర్మిస్తోన్న ఈ ఆసుపత్రి భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,116 కోట్లు ఖర్చు చేయనుంది. ఇది దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రిగా రికార్డు సృష్టించనుంది.

ఈ ఆస్పత్రి నిర్మాణం కోసం ప్రభుత్వం 56.39 ఎకరాలు కేటాయించింది. ఇందులో సుమారు 42.42 ఎకరాల విస్తీర్ణంలో మొదట రెండు వేల పడకల సామర్థ్యంతో 24 అంతస్థుల సూపర్‌ స్పెషాలిటీ నిర్మాణానికి రహదారులు, భవనాల (ఆర్‌అండ్‌బీ) శాఖ ఇంజినీర్లు డిజైన్‌ చేశారు. టెండర్ల ప్రక్రియలో నిర్మాణ పనులను ఈపీసీ మోడ్‌లో ఎల్‌అండ్‌టీ సంస్థ దక్కించుకున్నది. 18 నెలల కాల పరిమితితో నిర్మాణ పనులను పూర్తి చేయడానికి గత సంవత్సరం మే 8న ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నది.

ఎల్‌అండ్‌టీ సంస్థ గత మేలో ఈ హాస్పిటల్‌ నిర్మాణ పనులను ప్రారంభించింది. ఈ ఏడాది దసరాలోగా ఆస్పత్రి నిర్మాణం పూర్తి చేసే లక్ష్యంతో శరవేగంగా నిర్మాణ పనులు చేస్తోంది.  సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు నిర్మాణ పనులపై ఉన్నతస్థాయి సమీక్ష జరుపుతూ సూచనలు చేస్తున్నారు. మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డిలు ఎప్పటికప్పుడు దగ్గరుండి నిర్మాణ పనులను స్వయంగా పరిశీలిస్తున్నారు. వచ్చే దసరాలోగా నిర్మాణ పనులను పూర్తిచేయాలని మంత్రి హరీశ్‌రావు కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే.

మరోవైపు ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో.. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నిర్మాణం చేపట్టబోయే ఆరు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వరంగల్‌లో నిర్మించేదే అతి పెద్దది.. మిగతా ఐదు.. 1,000 పడకలతో కూడినవి కాగా, వరంగల్‌ ఆసుపత్రి మాత్రం 2 వేల పడకలతో నిర్మించనున్నారు.

Show comments