Real Star Srihari : రియల్ స్టార్ ని సృష్టించిన మాస్ డైరెక్టర్

కమర్షియల్ సినిమాలో తనదంటూ ఒక ముద్రవేసిన కె ఎస్ నాగేశ్వరరావు గారు ఇవాళ కన్ను మూశారు. నిన్న ఆయన స్వంత ఊరు నుంచి హైదరాబాద్ కు కారులో వస్తుండగా ఫిట్స్ రావడంతో కోదాడకు తరలించే లోపే తుది శ్వాస తీసుకున్నట్టు సమాచారం. నల్లజర్లలో కౌలూరు గ్రామంలో అంతిమ క్రియలు జరపనున్నారు. శ్రీహరిని పోలీస్ ద్వారా సోలో హీరోగా స్టార్ ని చేసింది ఈయనే. వీళ్ళ కాంబినేషన్ లో తర్వాత దేవా, సాంబయ్యలు కూడా సూపర్ హిట్ అయ్యి హ్యాట్రిక్ కాంబినేషన్ గా నిలిచాయి. కెఎస్ నాగేశ్వరరావు గారు కెరీర్ లో చేసింది 18 సినిమాలే అయినప్పటికీ మాస్ మూవీ మార్కెట్ లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

విజయవాడ వాస్తవ్యుడైన కెఎస్ నాగేశ్వరరావు తల్లి తండ్రులు అతని స్కూల్ చదువు పూర్తయ్యేక పాలకొల్లు వచ్చేశారు. అక్కడే ఉన్నత విద్యాభ్యాసం కొనసాగింది. తొలుత సినిమాల పట్ల పెద్దగా ఆసక్తి లేకపోయినా డిగ్రీ పూర్తి చేశాక ఆ రంగం వైపు వెళ్లాలన్న ఆసక్తి మొదలైంది. తెలిసిన బంధువు ద్వారా కోడి రామకృష్ణ బృందంలో చేరి ఎంఎస్ ఆర్ట్స్ సంస్థలో అడుగు పెట్టారు. శ్యామ్ ప్రసాద్ ప్రోత్సాహం చాలా ఉండేది. అసిస్టెంట్ డైరెక్టర్ గా మొదటి సినిమా తలంబ్రాలు(1987). దానికి కొన్ని సంభాషణలు కూడా అందించారు. అలా వీళ్ళ బంధం ఆహుతి, అంకుశంతో పాటు మరికొన్ని చిత్రాలకు కొనసాగింది. ఈ క్రమంలోనే పరిశ్రమలో పరిచయాలు పెరిగాయి.

దర్శకుడిగా మొదటి అవకాశం ఇచ్చింది చదలవాడ బ్రదర్స్. కృష్ణంరాజు హీరోగా జయసుధ ఆయనకు జోడిగా రూపొందించిన ‘రిక్షా రుద్రయ్య’ (1994) రెవిన్యూ పరంగా బిసి సెంటర్స్ లో బాగా ఆడింది. రెండో ఆఫర్ కూడా అదే సంస్థ ఇచ్చింది. జయప్రద ప్రధాన పాత్రలో రూపొందించిన ‘వార్నింగ్’ ఆశించిన విజయం అందుకోలేదు. అప్పుడు ‘పోలీస్’కి శ్రీకారం చుట్టారు కెఎస్ఎన్. శ్రీహరిని హీరో చేయడం ఏంటనే కామెంట్స్ ని పట్టించుకోకుండా పోలీస్ ని సూపర్ హిట్ చేశారు. శ్రీహరి స్నేహితుడు బెల్లంకొండ సురేష్ నిర్మాతగా తొలి అడుగు వేసింది ఈయన తీసిన సాంబయ్యతోనే. ఆ తర్వాత సాయికుమార్ తో శివన్న, విజయశాంతి శాంభవి ఐపిఎస్ లాంటి సినిమాలు చేశారు. 2019లో కెఎస్ నాగేశ్వరరావు తీసిన బిచ్చగాడా మజాకా సక్సెస్ కాలేదు. లవ్ ఈజ్ బ్లైండ్ అనే మరో ప్రాజెక్ట్ పూర్తి కాలేదు

Also Read : Daggubati Brothers : సురేష్ వెంకీలు రైట్ అని ఋజువు చేశారు

Show comments