iDreamPost
iDreamPost
మాములుగా ఏ హీరోకైనా బ్లాక్ బస్టరో లేదా ఇండస్ట్రీ హిట్టో పడితే దానికి మించిన ఆనందం ఇంకోటి ఉండదు. దాని తాలూకు ప్రభావం రాబోయే సినిమాలతో పాటు మార్కెట్ మీద కూడా పడి బిజినెస్ పరంగానూ చాలా ఉపయోగపడుతుంది. ఇది అందరికి అనుభవమయ్యే విషయమే. కానీ వరం శాపంగా మారినట్టుగా ఇది రివర్స్ లో జరిగే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణకు ఇది బాగా అనుభవం. అదెలాగో చూద్దాం.
1974లో కృష్ణ కెరీర్ ని అమాంతం గొప్ప మలుపు తిప్పి చరిత్రలో చిరస్ధాయిగా నిలిచిపోయిన అల్లూరి సీతారామరాజు సినిమా విడుదలైంది. ఎంతటి ఘన విజయమో చెప్పాలంటే ఒక పుస్తకమే రాయొచ్చు. మొన్న వచ్చిన సరిలేరు నీకెవ్వరులో సైతం దీని రిఫరెన్స్ వాడారంటే ఇది ఎంత మాస్టర్ పీసో అర్థమవుతుంది. అల్లూరి సినిమా వచ్చాక కృష్ణ గారి పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. కలెక్షన్ల వర్షం కురిసింది. చాలా చోట్ల రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. జనం థియేటర్లకు పోటెత్తారు. ఇంకేముంది కృష్ణ కాల్ షీట్స్ కు అప్పటికే నిర్మాణంలో ఉన్న చిత్రాలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కానీ ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే
అల్లూరి సీతారామరాజుగా కృష్ణ గారు జనం గుండెల్లో అలా ముద్రించుకుపోయారు. ఇకపై కూడా అలాంటి ధీరోదాత్తమైన పాత్రల్లోనే చూడాలని ప్రేక్షకులు అంచనాలు పెంచుకోవడం మొదలుపెట్టారు. ఫలితంగా వరుసగా 17 ఫ్లాపులు వచ్చి పడ్డాయి. మనుషులు మట్టిబొమ్మలు, రాధమ్మ పెళ్లి, గౌరీ, ఆడంబరాలు అనుబంధాలు. దీర్ఘసుమంగళి, ధనవంతులు గుణవంతులు, ఇంటింటి కథ, సత్యానికి సంకెళ్లు, దేవదాసు, అభిమానవతి, కొత్తకాపురం, సౌభాగ్యవతి, చీకటివెలుగులు, రక్త సంబంధాలు, సంతానం సౌభాగ్యం, గాజుల కిష్టయ్య, దేవుడి లాంటి మనిషి ఇలా వరుసగా పదిహేడు సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు.
అన్ని కుటుంబ కథా చిత్రాలే కావడంతో అల్లూరి లాంటి పవర్ ఫుల్ పాత్రలో చూసిన కృష్ణని ఆడాళ్ళ మధ్య ఫ్యామిలీ మ్యాన్ గా చూసేందుకు జనం ఇష్టపడలేదు. 1976లో పాడి పంటలు హిట్టయ్యే దాకా ఇదే పరిస్థితి కొనసాగింది. అల్లూరి సీతారామరాజు ప్రీమియర్ చూసాక విజయ చక్రపాణి గారు కృష్ణతో మాట్లాడుతూ ఈ సినిమా అయ్యాక నిన్ను కొన్నాళ్ళు మామూలు పాత్రల్లో ప్రేక్షకులు చూడరని దానికి సిద్దపడమని జోస్యం చెప్పారట. ఆయన అన్నట్టు రెండేళ్లు కృష్ణకు విజయం దూరమైపోయింది. మళ్ళీ పాడి పంటలుతోనే ట్రాక్ లో పడ్డారు. ఇవే బాక్స్ ఆఫీస్ విచిత్రాలంటే