కోటప్పకొండ తిరునాళ్ళ …

మహా శివరాత్రి పర్వదినం అంటేనే రాష్ట్రవ్యాప్తంగా గుర్తుకు వచ్చే పేరు కోటప్పకొండ తిరునాళ్ళ , తరలి వచ్చే భారీ ప్రభలు , ఇసుకేస్తే రాలని జనం . రాష్ట్రంలో అత్యధికంగా ప్రజలు హాజరయ్యే ప్రముఖ క్షేత్రాల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న కోటప్పకొండ ప్రభల చరిత్ర , తిరునాళ్ళ నిర్వహణ గురించి , ఆ కార్యక్రమాన్నివిజయవంతం చేస్తున్న వ్యక్తుల గురించి తెలుసుకుందాం

కోటప్పకొండ ప్రభల చరిత్ర :

కోటప్పకొండ పై పరమశివుడు తన భక్తురాలు ఆనందవల్లి ఇరువురూ ఏకకాలంలో శిలలుగా వెలిసాక యల్లమంద గ్రామానికి చెందిన సాలంకయ్య అనే భక్తునికి శివలింగం నుండి వినిపించింది అని చెప్పబడుతున్న పురాణం ప్రకారం ఎప్పుడైతే మహా శివరాత్రి పర్వదినాన కోటి ప్రభలు కోటప్పకొండ క్షేత్రానికి తరలివస్తాయో ఆ రోజు నేను కొండ దిగి వస్తానని శివుడు మాటిచ్చాడట . ఇదే విషయాన్ని తన గ్రామస్తులతో చెప్పిన సాలంకయ్య శివరాత్రి పర్వదినాన తన గ్రామస్తులతో కలిసి ప్రభ కట్టుకొని కోటప్పకొండ పైకి వెళ్లి శివుణ్ణి దర్శించుకొని రావడం ప్రారంభించాడట .

ఆ విధంగా ప్రారంభమైన కోటప్పకొండ ప్రభల చరిత్ర ఏటేటా కొండకి వచ్చే ప్రభల సంఖ్య పెరుగుతూ వస్తోంది . అంతేకాదు చుట్టుపక్కల గ్రామస్తులు ప్రభల ఎత్తు , విద్యుత్ అలంకరణల విషయంలో పోటీ పడి నూరు అడుగులకు మించి ప్రభలు కట్టేవారు . నరసరావుపేట చుట్టుపక్కల గ్రామాలు , పట్టణాల్లోని పదేళ్లు నిండిన పిల్లలు సైతం జట్లుగా ఏర్పడి బాల ప్రభల పేరిట చిన్న చిన్న ప్రభలు కట్టుకొని కొండకి నడిచి వెళ్లి మొక్కు సమర్పించుకొని వస్తుంటారు .

తిరునాళ్ళ నిర్వహణ :

ఏటికేడూ అంచనాలకు మించి పెరుగుతున్న భక్తులతో శివరాత్రి రోజూ ఆ తదుపరి రోజూ కిటకిటలాడే కోటప్పకొండ తిరునాళ్ళ నిర్వహణ కత్తి మీద సామే . గత రెండు దశాబ్దాలుగా ఎందరో మహానుభావుల కృషితో అభివృద్ధి చెందిన కోటప్పకొండ క్షేత్ర తిరునాళ్లకు రాష్ట్రవ్యాప్తంగా ఉండే భక్తులు వచ్చినా పెద్ద ఎత్తున మాత్రం చుట్టుపక్కల 100 కిలోమీటర్ల పరిధిలో గుంటూరు , ప్రకాశం , కృష్ణా జిల్లాల ప్రజలు పాల్గొంటారు . గత ఏడాది ఐదున్నర నుండి ఆరు లక్షల వరకూ భక్తులు పాల్గొనగా ఈ ఏడు ఎనిమిది నుండి తొమ్మిది లక్షల మంది వరకూ పాల్గొంటారు అన్న అంచనాలతో ముందస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది .

చేదుకో కోటయ్యా ఆదుకో కోటయ్యా అంటూ శివనామస్మరణతో తన్మయంగా కళ్ళు మూసుకొని సాగే భక్తుల వెనకాల వెయ్యి కళ్ళతో కాపు కాస్తూ , భక్తుల ప్రతి చిన్న అవసరాన్ని గమనిస్తూ తిరునాళ్ళ ఏ ఆటంకం లేకుండా జరగడానికి ఎన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కంటి మీద కునుకు లేకుండా పని చేస్తాయో తెలిస్తే విస్మయం కలగకమానదు . వీటన్నిటినీ సమన్వయం చేసుకొంటూ నిర్వహణా భారాన్ని మోసే వారి కృషి చూస్తే ఔరా అనిపించక మానదు .

ఈ మహా కార్యంలో డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ తో మొదలుకొని ఎండోమెంట్ , పోలీస్ , రెవిన్యూ , రూరల్ వాటర్ సప్లై , పంచాయితీ రాజ్ , ఎలెక్ట్రికల్ , అగ్నిమాపక , ఎక్సయిజ్ , sc కార్పొరేషన్ , బీసీ కార్పొరేషన్ , గిరిజన శాఖ , అటవీ శాఖ , ఇరిగేషన్ , ఆర్ అండ్ బీ , పబ్లిక్ హెల్త్ , స్కౌట్స్ అండ్ గైడ్స్ , ncc , ఆర్టీసీ మొదలైన ప్రభుత్వ రంగ సంస్థల సిబ్బంది విధుల్లో పాల్గొంటారు . ఇహ స్థానికంగా నరసరావుపేట మునిసిపాలిటీ , రెండు మండలాల ఎంపీడీఓ లు , ఎమ్మార్వోలు , RDO,VRO, విలేజ్ సెక్రటరీలు ఆయా శాఖల స్థానిక సిబ్బంది అందరూ నెల ముందు నుండి ఏర్పాట్లలో తల మునకలు అవుతారు . చివరి వారం రోజులూ వీరికి సరైన నిద్రాహారాలు ఉండవనేది సత్యం .

ఇదంతా ఒకెత్తు అయితే ఈ అన్ని రంగాల్ని , అందరు ఉద్యోగస్తులనీ సమన్వయ పరుస్తూ మొత్తం నిర్వహణా భారాన్ని నెత్తికెత్తుకొని కోటప్పకొండ ప్రతిష్టని మరింత పెంచే యత్నం చేస్తూ నిద్రాహారాలు లేకుండా తపిస్తున్న వ్యక్తులు స్థానిక నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారు , వారి సిబ్బంది .

ప్రతి ఏటా ప్రభలు కొండకొచ్చే దారుల్లో చెట్లు కొట్టే పని నుండీ , చివరి రోజు ప్రభలు వచ్చే దారిలో విద్యుత్ వైర్లు తొలగించి ప్రభలు క్షేమంగా వచ్చి దర్శనం చేసుకొని పోయే వరకూ చిన్న ఆటంకం కూడా లేకుండా నెల ముందు నుండీ ప్రతి రోజూ కోటప్పకొండ , చుట్టూ గ్రామాలు తిరుగుతూ అన్ని పనులూ దగ్గరుండి పర్యవేక్షించి , గత పది రోజులుగా దాదాపు కొండ వద్దే మకాం చేసిన ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి అవిరళ కృషి గురించి ఎంత చెప్పినా తక్కువే .

గతంలో ఎన్నడూ లేని విధంగా ఎనిమిది నుండి తొమ్మిది లక్షల మంది భక్తుల రాక అంచనాలతో ప్రారంభమైన శివరాత్రి ఉత్సవాలని విజయవంతం చేసే యత్నంలో మహిళలకు , భక్తులకు అసౌకర్యం కలగకుండా మూడు రోజులు నరసరావుపేట పరిసరాల్లో మద్యాన్ని సైతం నిషేధింపచేసి , అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఉన్న గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారికి , అన్ని వసతులూ కల్పిస్తూ భక్తుల శ్రేయస్సే లక్ష్యంగా కృషి చేస్తున్న ఆయా విభాగాల వారికీ శివుని దర్శనం చేసుకొని సంతృప్తిగా వెనుదిరుగుతున్న భక్తులు తెలియజేసుకొంటున్న కృతజ్ఞతలు నెలనుండీ పడుతున్న వారి కష్టాన్ని చేత్తో తీసేసినట్టు మాయం చేస్తుంది అనటంలో అతిశయోక్తి లేదు .

Show comments