Korangi City – కడలి గర్భంలో కలిసిపోయిన కోరంగి నగరం గురించి తెలుసా..?

కోరంగి అంటే మడ అడవులు గుర్తుకొస్తాయి… ఇదొక పర్యాటక ప్రాంతమని తెలుసు… కాని మనలో చాలా మందికి తెలియని ఒక నిజం. కోరంగి అంటే ఒక నౌకాశ్రయం అని.. 18వ శతాబ్ధంలో కాకినాడను మించి ఇక్కడ ఒక పట్టణం ఉండేదని. నాటి బ్రిటీష్‌ హయాంలో ఒక వెలుగు వెలిగిన ఈ పట్టణం… ఇక్కడ నౌకాశ్రయం పెను తుఫానుకు కడలిగర్భంలో కలిసిపోయింది. అప్పట్లో ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద తుఫానుగా పేరొందిన కోరంగి తుఫానుధాటికి ఈ నగరం కనీస ఆనవాళ్లు కూడా లేకుండా పోయింది. బ్రిటీష్‌ హాయాంలో చైన్నైతో సమానంగా సముద్రవర్తక కేంద్రంగా బాసిల్లిన కోరంగి నౌకాశ్రయం ఇప్పుడు చరిత్రలో చెప్పుకునేందుకే పరిమితమైంది.

18వ శతాబ్ధంలో తూర్పు తీరంలో ఓడల రాకపోకలు, ఓడల తయారీ,మరమ్మతులకు కోరంగి (నాడు కోరంగ) కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచింది. కాకినాడకు పది కిమీల దూరంలో ఉండే ఈ గ్రామం దట్టమైన మడ అడవులకు కేంద్రం. గోదావరి నదీ పాయల్లో ఒకటైన కోరంగి పాయ ఇక్కడ బంగాళాఖాతంలో కలుస్తోంది. ఇందువల్లే నాటి బ్రిటీష్‌ ప్రభుత్వం ఇక్కడ నౌకాశ్రయాన్ని నిర్మించింది. అనతికాలంలోనే ఇది తూర్పు తీరంలో ప్రముఖ ఓడరేవుల్లో ఒకటిగా పేరొందింది. ఇక్కడకు ఇతర దేశాల నుంచి ఓడల రాకపోకలు ఎక్కువగా జరిగేవి. ఇక్కడ నుంచి పలురకాల వస్తువులు ఆగ్నేయ ఆసియాకు ఎగుమతయ్యేవి. పైగా ఈ నౌకాశ్రయంలో కొత్త నౌకల తయారీ, పాత నౌకల మరమ్మతులు పెద్ద ఎత్తున జరిగేవి. బ్రిటన్‌ నౌకలతోపాటు ఫ్రాన్స్‌, నెదర్లాండ్‌, పోర్చుగల్‌ నౌకలకు ఇక్కడ మరమ్మతులు చేసేవారు. బ్రిటీష్‌ రాయల్‌ నేవీ ఓడలు ఇక్కడ లంగరు వేసి ఉంచేవారని చరిత్ర చెబుతుంది. నౌకాశ్రయం వల్ల కోరంగి గ్రామం కాస్తా నగరంగా అభివృద్ధి చెందింది. జనాభా పెరిగింది. నౌకాశ్రయం అనుంబంధ పరిశ్రమలు సమీప గ్రామంలో ఉండేవి. కోరంగి దగ్గరలో ఉన్న తాళ్లరేవులో భారీ తాళ్లు (పగ్గాలు), చిన్న ఓడల తయారీ పరిశ్రమలు విస్తరించాయి. ఇప్పటికీ తాళ్లరేవులో భారీ పగ్గాలను తయారు చేస్తున్నారు.

Also Read : P Gannavaram Aqueduct – రాజోలు దీవి చరిత్రను మార్చిన పి.గన్నవరం అక్విడెక్టు గురించి తెలుసా..?

తలక్రిందులు చేసిన తుఫాన్‌.. 

అంతా సాఫీగా జరిగి ఉంటే కోరంగి ఇప్పుడు చైన్నైతో సరిసమానమైన నగరానికి కేంద్ర బింధువుగా ఉండేది. కాని కోరంగి అదృష్టాన్ని 1839 నవంబరు 25న వచ్చిన పెను తుఫాను తలకిందులు చేసింది. దీనిని కోరంగ తుఫాను, ఇండియా సైక్లోన్‌ అని పిలిచేవారు. ఈ తుఫానుకు కోరంగి నామరూపాల్లేకుండా పోయింది. నౌకాశ్రయం ఆనవాళ్లకు కూడా దొరకలేదు. కుంభవృష్టిని తలపించిన వర్షం.. ఉప్పెనలా ముంచెత్తిన సముద్ర అలలు.. మరోవైపు పెనుగాలులు… గోదావరి వరదలతో కోరంగి తుడుచుపెట్టుకుపోయింది. సుమారు 3 లక్షల మంది మృత్యువాత పడ్డారు. 2 వేలకు పైగా ఓడలు సముద్రంలో కొట్టుకుపోయాయి. ఇళ్లు, వాకిళ్లు సముద్రంలో కలిసిపోయాయి. 1789లో వచ్చిన భోలా తుఫాను తరువాత రెండవ అతి పెద్ద తుఫానుగా కోరంగి తుఫాను చరిత్రలో నిలిచింది. ప్రాణాలు దక్కించుకున్న వారు ఇక తాము ఇక్కడ జీవించలేమని ఇతర ప్రాంతాలకు వలసపోయారు. ఇది ఎంత భయంకరమైన విధ్వంసం సృష్టించిందంటే కనీసం ఈ నగరాన్ని కాని, నౌకాశ్రయాన్ని కాని పునర్నిర్మించాలనే ఆలోచనే నాటి బ్రిటీష్‌ ప్రభుత్వానికి కలగలేదంటే విపత్తు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

1805లో నిర్మించిన లైట్‌ హౌస్‌ ఇప్పుడు శిథలమై కనిపిస్తూ గత వైభవానికి మూగ సాక్ష్యంగా మిగిలింది. ప్రస్తుతం ఈ ప్రాంతం పూర్తిగా మడ అడవులు విస్తరించాయి. జంతువులు, జలాచరాలు మాత్రమే ఇక్కడ కనిపిస్తాయి. పర్యాటకంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ నౌకాశ్రయం లేకపోవడంతో తరువాత కాలంలో కాకినాడలో పోర్టు వచ్చింది. కాకినాడ నగరంగా విస్తరిస్తోంది. నాడు కోరంగి నౌకాశ్రయం ఉన్న సమయంలో కాకినాడ కేవలం మత్స్యకారుల వేటకు మాత్రమే పరిమితమైందనే విషయం ఇక్కడ గమనార్హం.

Also Read : Antarvedi – సముద్రపు అలజడి… దేనికి సంకేతం?

Show comments