“కొండలు దాటి బైటకు రావడం ఒక మార్మికలోకం నుంచి వెలుపలికి వచ్చినట్లుగా అనుభూతి కలుగుతూ ఉంది. ఒక నిశ్శబ్ధంలోంచి ఒక శబ్దమయ ప్రపంచంలోకి నడుస్తున్నట్లుగా ఉంది. ఒక భయావహమైన ఒంటరి జీవితంలోంచి సమూహంలోకి అడుగేస్తున్నట్టుగా ఉంది”… కొండపోలం నవల చదివినప్పుడు కలిగిన అనుభూతిని నిజం చేసుకోవటానికి రచయిత సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి గారి చొరవతో మిత్రుల బృందంతో కొండపాలం కథలోని అడవి మార్గంలో చేసిన యాత్ర అనుభవాల వ్యాసం.
సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి గారి చొరవతో మొగ్గలు తొడిగిన మా నల్లమల యాత్రని కవితాత్మకంగా వర్ణించడానికి అక్కడ గల గల పారే వాగులు, వంకలు, సెలయేళ్లు లేవు.. జల జల దూకే జలపాతాల తుంపర్లు లేవు.. చెంగు చెంగున గెంతే లేళ్లు, జింకలు లేవు.. ఉన్నదల్లా దట్టమైన నల్లమల అడవి తల్లి గుండెల మీద మా అడుగుల సవ్వడి చేశామనే చిరు సంతోషం, కాశినాయన ఒడిలో సేదతీరామనే తియ్యని అనుభూతి.
తొమ్మిదికల్లా అందరం వరికుంట్లకు చేరుకుని ఫారెస్టు చెక్ పోస్టు దగ్గర బండ్లు పెట్టి కాలినడకన జ్యోతి ఆశ్రమం, అక్కడ భోజనాలు చేసుకుని మళ్లీ నడక మొదలుపెట్టి గరుడాద్రి ఆశ్రమం చూసి సాయంత్రం కల్లా తిరిగిరావాలని ప్లాను కానీ పదమూడు మంది రెడీ అయ్యి అక్కడికి చేరుకునేసరికే పదిన్నర్రయింది. ఇక్కడ అన్నింటికంటే విచిత్రమేంటంటే ఎక్కడో పీలేరు నుంచి వచ్చిన కొండమర్రి కరుణాకర్ మేము నిద్ర లేచే సమయానికే పోరుమామిళ్ల బస్టాండులో ఉన్నానని మెసేజ్ చెయ్యడం.
ఇప్పుడే పదిన్నర్రయింది ఇక్కడ్నుండే నడక మొదలుపెడితే కష్టమని జ్యోతి వరకు వెళ్లి అక్కడ్నుండి నడిచి వెళ్దామని అందరం టీ తాగి బయల్దేరాం. పండుగ కాదు ఉత్సవం కాకపోవడంతో జనాల కంటే కోతులే ఎక్కువున్నాయి. బిడ్డలకు భారమైన తల్లిదండ్రులు, జీవితం మీద విరక్తి చెందిన వైరాగులు అందరికీ లేదు, కుదరదనకుండా ఇరవైనాలుగ్గంటలూ భోజనం పెట్టగలిగే చివరి మజిలీ ఈ పవిత్ర కాశినాయన క్షేత్రం. కొంచెం దూరం నడక తర్వాత అందరం ఎవరికి వారు సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుని ఆ అడవి దారులవెంట ఆనందం, అనుభవారు అనే నిధిని వెలికితీయడానికి బయల్దేరాం.
గ్రూపులో ఒక్కొక్కరు ఒక్కో రంగం వారైందాన జీవితానుభవాలన్నీ కలగాపులగమయి కొత్తగా అనిపించాయి. అడవిని మాకు పరిచయం చెయ్యడానికి మాతో పాటు వచ్చిన నాయనిపల్లె రైతు నారాయణ రెడ్డి ఒక్కో చెట్టును, బోడును పరిచయం చేసుకుంటూ సైన్యాధ్యాక్షుడై ముందుకు నడుస్తుంటే వెనకాలే మేము. ముందే ఊహించినట్టు మా గ్రూపు లీడర్ సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి గారు మరియు బత్తుల ప్రసాద రావు గార్ల సాహితీ సంభాషణ అత్యంత ఆసక్తిగా సాగింది. పల్లె బతుకులు ఒంటబట్టిన ఆయన, సినీ జర్నలిస్టుగా, రచయితగా అణువణువునా సరసాన్ని పుక్కిట పెట్టిన ఈయన మధ్యలో వారి చర్చను వింటూ మేము. అలుపనేది లేకుండా సాగింది.
జ్యోతి నుండి పడమటి దిక్కుగా బయల్దేరితే తొలుత వచ్చేది అనంతగిరి. అక్కడ మేము తెచ్చిన అరటిపండ్లు తలా ఒకటి తిని ఆ తొక్కల్ని అక్కడే ఉన్న బక్కచిక్కిన ఆవుకు తినిపిస్తిమి. మనుష్య సంచారం అంతగా ఉండని ఆ అడవిలో అడవి దగ్గరున్న పాడుబడ్డ పురాతన ఇంట్లో బాగా పెరిగిన గడ్డంతో ఒంటరిగా ఉన్న రవి అనే మధ్య వయసు యోగి ధోరణి కొంత ఆసక్తిగా తోచింది. అతనిది ప్రొద్దుటూరు టౌను అంట, ఒకటో తరగతి వరకే చదివాడంట. ఇక్కడికెందుకొచ్చావంటే నేను పెద్దగా మాట్లాడను అని వింత వింతగా సమాధానాలు చెప్పాడు. అక్కడ్నించి ఉత్తరంగా చూస్తే శిఖరం మీద పచ్చని ఈత చెట్లతో ఎత్తుగా కనిపిస్తున్న దేవరకొండ. ప్రశాంతంగా ఉన్న అక్కడి వాతావరణానికి గుర్తు తెలియని పక్షి టుక్కూక్కు.. టుక్కూక్కు.. అనే గుర్తు తెలియని పిట్ట అరుపులు మరింత రమ్యతని జోడించాయి.
కాలి దోవమ్మిటి నడవడానికి పెద్దోల్లు కొంచెం ఇబ్బంది పడుతుంటే బండి దోవ వెంటే నడక సాగించాం. చెట్ల గురించి చెప్పేటపుడు ఎవరైనా పొరబడితే ఇంకొకరు సరిచేస్తూ వాటి గురించి చెప్పడం, పెద్ద మాన్ల లాగా పెరిగిన మోడపాకు తీగల మీద కూర్చుని ఊగుతున్నట్టు ఫోటోలు దిగడం, బత్తుల ప్రసాదన్న సెతుర్లుతో నవ్వుకుంటూ ముందుగు సాగితిమి. వాగో వంకో కనపడ్నెప్పుడల్లా ఇద్దో ఇది నేను రాసిన ఆమె అడవి నేను కథలో ఈ సీనులో వస్తుందంటూ పోల్చి పోల్చి చెబుతూ వాటి అందాన్ని వివరిస్తున్నాడు. హైద్రాబాద్ వదిలేసొచ్చినా వివేకూ మన పోటోగ్రాఫర్ ప్రవీన్ తో కలిసి రాయలసీమను వెకిలిగా చూపించేవాళ్లందరి నోర్లు మూయిస్తూ సిసలైన సీమంటే ఇదేనని నిరూపించేలా షార్ట్ ఫిలిమ్స్ తీయాలనే తన సంకల్పాన్ని బయటపెట్టాడు.
గరుడాద్రి ఆశ్రమం దగ్గరికి వెళ్లే దారిలో కాకినాడ నుండి కాశినాయన దర్శనం కోసం వచ్చిన ఒక ఫామిలీ అదాటయ్యారు. వారిని చూస్తే ఆశ్చర్యమనిపించింది. ఎక్కడి కాకినాడ ఎక్కిడి పోరుమామిళ్ల దగ్గర కొండల్లో ఇరుక్కోనుండే కాశినాయన జ్యోతి క్షేత్రం.. ఈయనలో ఇంత మహిముంటే నాయన చుట్టుపక్కలున్న మనమే గుర్తించలేకున్నామా అనిపించింది. మా వెనకాల ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలూ సరదాగా చేతిలో చెయ్యేసుకుని నడుస్తూ వచ్చారు. ప్రకృతి ఒడిలో విహరించడానికొచ్చిన ప్రేమ పక్షులు కాబోలు.
రెండున్నర గంటల సంతోషకరమైన నడక తర్వాత మధ్యాన్నం ఒకటిన్నర అవుతుండగా గరుడాద్రి చేరుకుంటిమి. అక్కడి నుండి కిందికి చూస్తే అన్ని కొండల శిఖరాలు చూస్తూ మాకంటే చిన్నగా కనపడుతున్నాయి. అన్నింటికంటే ఆశ్చర్యం అనిపించింది అంతటి దుర్గమారణ్యంలో కూడా 4g+ సిగ్నల్ రావడం. అక్కడి వాతావరణం చూస్తుంటే ఇంతటి ప్రశాంత వాతావరణంలో కూర్చుని తపస్సు చేస్తే ఒక్క కాశినాయనకే కాదు ఇంకెవ్వరికైనా మోక్షం సిద్ధించగలదనిపించింది. హడావిడిగా క్యూలో నిలబడి దొబ్బుకుంటూ తోసుకుంటూ వెళ్లి దండం పెట్టుకోవడం కంటే గుడి అనే ఉత్తమమైన పదానికి ఈ ప్రదేశం ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తుంది.
రోలు రోకలి కనపడగానే మన బత్తుల ప్రసాదన్నలోని వంటగాడు ప్రత్యక్షమైన ఎర్రగడ్డ, టమోటా, పచ్చిమిరపకాయ నూరి ఆ వాసనతో ఆకలిని మరింత ఉధృతం చేశాడు. జనజీవన స్రవంతికి దూరంగా దట్టమైన అడవిలో ఉన్నప్పటికీ పప్పు, రసం, పులుసన్నం, సేమియా స్వీటు ఇన్ని రకాల వంటలతో తిన్నంతా పెడుతున్నారంటే ఆ కాశినాయన వైభవం మనం అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడూ ఒక్కవాయకు మించి తినలేని నేను మూడుసార్లు పెట్టించుకుని తిన్నా అంటూ వెంకట్రామిరెడ్డి మామ అడవి తల్లి ఒడిలోని చల్లదనాన్ని గుర్తుచేశాడు. మా పదమూడు మందిలో ఏ ఒక్కరూ మెతుకు విడవకుండా తినడం నేను గమనించకపోలేదు.
నడకతో అలసిపోయినోళ్లంతా గరుడాద్రి ఆశ్రమం దగ్గర చెట్టుకింద కూర్చోనుంటే మా ఫోటోగ్రాఫర్ ప్రవీణ్, నవీన్, కరుణాకర్, తరుణ్, నేను కాశినాయన తపస్సు చేసిన ప్రదేశానికి చేరుకుంటిమి. జ్యోతి నుంచి నడిచిన ఆరు కిలోమీటర్ల నడక కంటే ఈ రెండొందల మీటర్ల నిలుటెత్తు కొండెక్కడంలో ఎక్కువ వడి పడ్డాము. కింద కనిపించిన రెండు ప్రేమ జంటల ఏకాంతానికి పైన మేము భంగం కలిగించామేమో మేము రాగానే వాళ్లు దిగి వెళ్లిపొయ్యారు. అక్కడున్న చల్లగాలికి కిందికి రాబుద్ధికాలేదు గానీ బత్తుల ప్రసాదన్న కేకతో దిగి రావాల్సొచ్చింది.
వెళ్లడానికి రెండున్నర గంటల పైగా పట్టిన మా నడక దిగడానికి మాత్రం గంటన్నరకు మించి పట్టలేదు. కిందికొచ్చి కాశినాయన దర్శనం చేసుకుని వంటశాలను చూద్దామని వెళ్తే చుట్టుపక్కలున్న వాళ్లు తెచ్చి వేసిన బియ్యం బస్తాలు, వేలకొద్దీ ఉన్న పళ్లేలు, గ్లాసులు చూసి పదిమందికి కడుపునిండా కూడు పెట్టడానికి మించిన సేవ ఇంకొకటిలేదనే కాశినాయన తత్వం బోధపడింది. పిల్లెలెవరైనా బువ్వ పెట్టకుంటే మా పల్లె ప్రజలు అతి సాధారణంగా వాడే కాశినాయన కాడికి పోతామనే మాటల్లోని అంతరార్థం బోధపడింది.
కాశినాయన స్వామి దగ్గరికంటే వెళ్దామంటే నాకు గుర్తొచ్చేది చిన్నప్పటి నా డ్రాయరే. నేను నాలుగో తరగతిలో అనుకుంటా ఒకసారి వెళ్లింటిని. స్నానం చేసి డ్రాయర్ కుళ్లాయి మింద పెట్టి మర్చిపోయి మాయమ్మ అడిగితే వచ్చి చూస్తే అక్కడ లేదు. అప్పుడు భలే బాధపడ్డాను. అక్కడికి వెళ్లి నా జ్ఞాపకాలను మళ్లీ ఒకసారి గుర్తుచేసుకుని కాశినాయన చరిత్ర పుస్తకం కొనుక్కుని, వచ్చిన అందరికీ వెంకట్రామి రెడ్డి గారు బహుకరించిన బడి కవితా సంకలం బ్యాగులో పెట్టి కాశినాయనకు సెలవు చెప్పుకుని, తిరిగి వరికుంట్ల దగ్గర అందరం కలిసి కాఫీ తాగి జీవితంలో ఒక అపూర్వ ప్రయాణపు అనుభవాల దొంతరలను పదిల పరుచుకుంటూ ఇంటి మెఖం పడితిమి…