కేసీఆర్ వ‌రుస భేటీలు.. నేడేం చెప్ప‌నున్నారో?

‘బీజేపీ ముక్త్‌ భారత్‌’ అంటూ పిలుపు ఇచ్చిన కేసీఆర్ ల‌క్ష్యసాధ‌న‌కు ప‌ట్టు బిగిస్తున్నారా, బీజేపీయేత‌ర ప‌క్షాల‌ను ఒకే తాటిపైకి తేవ‌డానికి కంక‌ణం క‌ట్టుకున్నారా, వ‌చ్చే లోక్ స‌భ ఎన్నిక‌ల నాటికి బీజేపీకి ప్ర‌త్యామ్నాయంగా రాజ‌కీయవేదిక‌ను సిద్ధం చేయ‌నున్నారా.. అంటే అవును అన్న‌ట్లుగా వ‌రుస స‌మీక‌ర‌ణాలు తెలియ‌జేస్తున్నాయి.

కేంద్రంపై కొద్ది కాలంగా కేసీఆర్ తీవ్ర‌మైన పోరే చేస్తున్నారు. రాష్ట్రానికి ప్ర‌ధాని వ‌చ్చిన‌ప్ప‌టికీ ముఖం చాటేశారు. దేశాన్ని సరైన దిశలో పాలించడంలేదని, అందుకే బీజేపీ ముక్త్‌ భారత్‌కు నడుం కట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రంపై నిరసన తెలుపుతున్న కేసీఆర్‌ను, తమిళనాడు సీఎం స్టాలిన్‌ను అభినందిస్తూ మమతా ట్వీట్‌ చేశారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే కూడా రాష్ట్రాల పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై నిరసన వెళ్లగక్కుతున్నారు.

ఉద్ధవ్‌ ఠాక్రే బుధవారం కేసీఆర్‌కు ఫోన్‌ చేసినట్లు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించుకునేందుకు రావాలని ఆహ్వానించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఈ మేర‌కు కేసీఆర్ నేడు ముంబైకి వెళ్ల‌నున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో సమావేశం కోసం సీఎం మహారాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు.

ఆదివారం ఒంటిగంట సమయంలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రేతో ఆయన నివాసంలో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌తో పాటు, అతని టీం ఉద్దవ్‌ ఠాక్రేతో భోజనం చేస్తారు. భోజనం అనంతరం ఎన్సీపీ శరద్‌ పవార్‌ నివాసానికి వెళ్లి, అక్కడ జాతీయ రాజకీయ అంశాలపై చర్చిస్తారు. అనంతరం తిరిగి సాయంత్రం హైదరాబాద్‌కు వస్తారు.

ఇదిలా ఉంటే సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి హరీష్‌ రావు కూడా ముంబయి వెళ్లనున్నారని తెలుస్తోంది. ఇక ముంబయి టూర్‌ ముగిసిన తర్వాత కేసీఆర్‌ కర్నాటక వెళ్లనున్నారని సమాచారం. అక్కడ మాజీ ప్రధాని దేవేగౌడతో భేటీ కానున్నారని తెలుస్తోంది.

అంతేకాకుండా ఢిల్లీలో మమతా బెనర్జీ నిర్వహించనున్న సమావేశానికి కూడా కేసీఆర్‌ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్ర‌మంలో వీరంద‌రితోనూ భేటీ అయిన త‌ర్వాత కేసీఆర్ మ‌రోసారి ప్రెస్ మీట్ పెట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న నుంచి ఎటువంటి ప్ర‌క‌ట‌న వెలువ‌డుతుందో అన్న ఆస‌క్తి ఏర్ప‌డుతోంది.

Also Read : చిన‌జీయ‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు.. శాంతి కల్యాణానికి కేసీఆర్‌ హాజరవుతారా?

Show comments