Idream media
Idream media
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి స్థానిక పోరు ప్రారంభానికి ముందే చేతులెత్తేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ వారు ఎవరూ పోటీ చేయబోరని జేసీ దివాకర్ రెడ్డి ప్రకటించారు. దీనికి ఆయన చెప్పిన కారణం… జగన్ సర్కార్ నూతనంగా తెచ్చిన మార్గదర్శకాలేనంట. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేస్తే గెలిచినా అనర్హులుగా ప్రకటిస్తారు. పైగా రేండేళ్లు జైలు శిక్ష కూడా విధిస్తారు. తాము డబ్బులు పంచకపోయినా పంచామని చెప్పి జైలుకు పంపుతారని జేసీ దివాకర్ రెడ్డి అంచనా వేస్తున్నారు. అందుకే ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడంలేదన్నారు.
స్థానిక ఎన్నికల్లో ఓటమి తప్పదనే జేసీ దివాకర్ రెడ్డి ముందుగానే కాడి వదిలేశారని పరిశీలకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన కుటుంబం నుంచి ఒక్కరూ విజయం సాధించలేదు. ఈ ఎన్నికల్లో కూడా సార్వత్రిక ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయని అంచనా వేస్తున్న జేసీ దివాకర్‌రెడ్డి పోటీ చేసి పరువు పోగొట్టుకోవడం కన్నా ఎన్నికలకు దూరంగా ఉండడమే మేలని భావిస్తున్నట్లుగా ఉన్నారు.
జేసీ నిర్ణయంతో అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ అభ్యర్థులు పోటీకి దూరంగా ఉంటారా…? అంటే సందేహమే. లోకల్ నాయకులు.. గెలిచినా, ఓడినా పోటీ చేసేందుకే మొగ్గు చూపుతారు. ఒక వేళ పోటీకి దూరంగా ఉంటే మాత్రం ఎంపీటీసీ, జడ్పీటీసీ, పంచాయతీ, కౌన్సిలర్ స్థానాలు మెజారిటీ ఏకగ్రీవం అయ్యే అవకాశం ఉంది. అయితే ఇరత పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు పోటీ చేస్తారు కాబట్టి పోలింగ్ తప్పదని చెప్పవచ్చు. జేసీ నిర్ణయం ఎంత మేరకు అమలవుతుందో వేచి చూడాలి.