టాలీవుడ్ లో ఒకానొక సమయంలో వరుసగా ఫ్యాక్షన్ చిత్రాల ట్రెండ్ నడిచింది. ప్రేక్షకులు కూడా ఆ సినిమాలకు మంచి ఆదరణ చూపడంతో వరుసపెట్టి సినిమాలు వచ్చాయి. అలా వచ్చిన దాదాపు అన్ని సినిమాలలో కామన్ పాయింట్ ఏమిటంటే మొదటి ఫ్యాక్షన్ తర్వాత కామన్ పాయింట్ జయప్రకాష్ రెడ్డి.
తూర్పు జయప్రకాష్ రెడ్డి అనగానే గంభీరమైన రూపం, ఎర్రటి జీరలతో కళ్ళు కనిపిస్తాయి. రాయలసీమ పౌరుషానికి పంచ కట్టు కడితే జయప్రకాష్ రెడ్డి లాగానే కనిపిస్తాడు ఏమో అనేంతగా ఆయన ఆ విలన్ పాత్రలలో నటించమంటే జీవించాడు. నిజానికి ఆయన స్వతహాగా రాయలసీమ ప్రాంతానికి చెందిన వాడే. కర్నూలు జిల్లాలో పుట్టిన జయప్రకాష్ రెడ్డి తండ్రి పోలీసు ఇన్స్పెక్టర్ కావడంతో ఆయన ఉద్యోగరీత్యా తిరిగిన దాదాపు అన్ని ప్రదేశాలకు వెళ్లాల్సి వచ్చింది.
Also Read: బ్రహ్మపుత్రుడితో మాస్ ఇమేజ్ – Nostalgia
పుట్టింది కర్నూలు జిల్లాలో అయినా పెరిగింది దాదాపు నెల్లూరు జిల్లా అని చెప్పవచ్చు, ఇక ఆయన తండ్రి డి.ఎస్.పి హోదాలో నల్గొండలో రిటైర్ అయ్యే నాటికి జయప్రకాష్ రెడ్డి గుంటూరులో ఏసీ కాలేజీలో చదువుకుంటూ ఉండేవారు. కాలేజీలో నాటకాల పరిచయంతో ఆయన తనలో కూడా ఒక నటుడు ఉన్నాడనే విషయం తెలుసుకుని ఎక్కడ తగ్గకుండా పదుల సంఖ్యలో నాటకాల్లో నటిస్తూ ఉండేవాడు. అలా నల్గొండలో ఒక నాటకం వేస్తున్న సమయంలో దాసరి నారాయణరావును ముఖ్య అతిథిగా పిలిచారు, అప్పటికే దాసరి నారాయణరావు ఉదయం పత్రిక బిజీలో ఉంటూనే దర్శకత్వం చేసే పనిలో కూడా పడ్డారు. జయప్రకాష్ రెడ్డి చెప్పిన ఒక్క మాటకు కట్టుబడి నాటకం ఆసాంతం చూసిన దాసరి నారాయణరావు తర్వాత హైదరాబాద్ పిలుచుకు వెళ్ళి రామానాయుడు కుటుంబ సభ్యుల ముందు కూడా అదే నాటకం వేయించారు. అలా నాటక రంగం నుంచి ఆయనకు సినిమారంగంలోకి ఎంటర్ అయ్యే అవకాశం లభించింది.
Also Read: వినోదం సందేశం కలగలిసిన ‘జయం మనదేరా’ – Nostalgia
వెంకటేష్ హీరోగా 1988లో విడుదలైన బ్రహ్మపుత్రుడు అనే సినిమాలో జయప్రకాష్ రెడ్డి తెరంగ్రేటం చేశారు. మొదటి సినిమా అవకాశంతో సుమారు నాలుగేళ్ల పాటు దాదాపు ఒక ఇరవై ఐదు సినిమాల్లో పలు పాత్రల్లో నటించినా అనుకున్నంత బ్రేక్ అయితే దక్కలేదు. కుటుంబాన్ని పోషించుకునే ఉద్దేశంతో ఆయన సినిమాలకు బ్రేక్ ఇచ్చి గుంటూరు వెళ్లి స్కూల్లో టీచర్ గా తన జీవితం ప్రారంభించారు. అయినా సరే కళాకారుడి కాలు ఒక్క చోట ఉండదు కదా, ఒకసారి పని మీద హైదరాబాద్ వచ్చిన తరుణంలో రామానాయుడుని కలిస్తే అనుకోకుండా ప్రేమించుకుందాం రా సినిమాలో విలన్ పాత్ర దక్కింది. ఆ సినిమాలో వెంకటేష్, అంజలా జావేరి ప్రేమలో పడగా ఆ ప్రేమకు అడ్డుగా నిలిచే పాత్రలో అంటే అంజలా తండ్రి వీరభద్రయ్య పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమాలో ఆయన పండించిన విలనిజం నచ్చడంతో వరుసగా ఫ్యాక్షన్ సినిమాలలో ఆయనకు అవకాశాలు దక్కాయి. అలా బాలకృష్ణ హీరోగా నటించిన నరసింహనాయుడు, సమరసింహారెడ్డి, వెంకటేష్ హీరోగా వచ్చిన జయం మనదేరా వంటి ఫ్యాక్షన్ సినిమాల్లో నటించి రాయలసీమ పౌరుషానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచి సీమ పౌరుషం అంటే ఇలాగే ఉంటుందేమో అని జయప్రకాష్ రెడ్డి నట విశ్వరూపాన్ని చూపించాడు.
Also Read: మనసులు గెలిచిన ‘ప్రేమించుకుందాం..రా’
ఇక తరువాత తరువాత జయప్రకాష్ రెడ్డి విలనిజం పండిస్తూనే కామెడీ పాత్రలు కూడా ఒప్పుకోవడం మొదలుపెట్టాడు అలా కామెడీ చేస్తూ తెలుగు ప్రేక్షక లోకాన్ని మరింత మెప్పిస్తూ వచ్చాడు. అలా కబడ్డీ కబడ్డీ, ఎవడి గోల వాడిదే, రెడీ, కిక్, సౌఖ్యం లాంటి సినిమాలలో తనదైన కామెడీ టైమింగ్ తో అలరించాడు. చివరిగా విజయ్ దేవరకొండ – క్రాంతి మాధవ్ కాంబినేషన్ లో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించిన జయ ప్రకాష్ రెడ్డి ఆ తర్వాత కరోనా కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. గుంటూరులో స్థిరనివాసం ఏర్పరచుకున్న జయప్రకాశ్ రెడ్డి కరోనా కాస్త తగ్గాక హైదరాబాద్ రావాలి అనుకున్నా కానీ సెప్టెంబర్ ఎనిమిదో తారీకు 2020వ సంవత్సరంలో ఆయన తన స్వగృహంలో గుండెపోటుతో మరణించారు. అలా తెలుగు పరిశ్రమ ఒక అద్భుతమైన నటుడిని దూరం చేసుకుంది. తూర్పు జయప్రకాష్ రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఇవే మా నివాళులు.
Also Read: పెద్ద సినిమాల కళ్ళు గోపిచంద్ మీదే