Idream media
Idream media
కాపులు, దళితులు, బీసీలను ఐక్యం చేసి రాజకీయపార్టీ ని ఏర్పాటు చేయాలనే తన ఆలోచనపై ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గబోనని ముద్రగడ పద్మనాభం మరోసారి స్పష్టం చేశారు. ఈ ప్రతిపాదన చేసిన తర్వాత.. ఆయనపై వస్తున్న విమర్శలకు ఈ రోజు పత్రికా ప్రకటన ద్వారా ఘాటుగా సమాధానం చెప్పిన ముద్రగడ.. అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది అనే అంశాన్ని కూడా వివరించారు. ప్రత్యామ్నాయ వేదిక విషయంలో దళిత, బీసీ నేతలతో మాట్లాడిన సమయంలో తాను చేసిన వ్యాఖ్యలను ఆ ప్రకటనలో ముద్రగడ పొందుపరిచారు. ముద్రగడ వ్యాఖ్యలు గమనిస్తే.. రాజకీయ పార్టీ ప్రారంభంలో కేవలం ఉభయగోదావరి జిల్లాలకే పరిమితం కాబోతోందన్న విషయం అర్థమవుతోంది.
ఇదీ ముద్రగడ ఆలోచన..
ఐదేళ్ల కిత్రం దళిత సామాజికవర్గ నేత డాక్టర్ ఆర్.ఎస్ రత్నాకర్ ముద్రగడ వద్దకు వచ్చి రెండుసార్లు మూడో ప్రత్యామ్నాయం గురించి మాట్లాడారు. రెండేళ్ల క్రితం ముద్రగడ అమలాపురంలోని బీసీ నేత కుడిపూడి సూర్యనారాయణ ఇంటికి వెళ్లినప్పుడు.. నిత్యం ఒకే బొమ్మ కాదు.. బొమ్మ తిరగేయాలని సూర్యనారాయణ ముద్రగడతో అన్నారు. ఇటీవల ఆర్‌ఎస్ రత్నాకర్ మరోమారు మూడో ప్రత్యామ్నాయం గురించి ముద్రగడ వద్ద ప్రస్తావించారు. ఆ తర్వాత ఈ విషయం గురించి కుడిపూడి సూర్యనారాయణతో ముద్రగడ మాట్లాడారు. ఇరువురు నాయకులతో ముద్రగడ ఇటీవల సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో.. ‘‘ప్రత్యామ్నాయం అన్నది చిన్న ప్రయత్నంగా మొదలుపెడదాం.. భారీ ఎత్తున చేయడానికి మనం సరిపోము’’ అని ముద్రగడ వారిద్దరితో అన్నారు. ఈ విషయాన్ని ఈ రోజు జారీ చేసిన పత్రికా ప్రకటనలో ముద్రగడ వెల్లడించారు.
చిన్న ప్రయత్నమంటే…?
ప్రత్యామ్నాయం అన్నది చిన్న ప్రయత్నంగా మొదలు పెడదాం.. భారీ ఎత్తున చేయడానికి మనం సరిపోము.. అని ముద్రగడ అనడంతోనే వారు ఏర్పాటు చేసే రాజకీయ పార్టీ కేవలం ఉభయ గోదావరి జిల్లాల వరకే పరిమితం కాబోతోందని స్పష్టంగా తెలుస్తోంది. గోదావరి జిల్లాలలో విజయవంతం అయితే ఆ తర్వాత మెల్లగా రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు విస్తరించే ఆలోచన చేయవచ్చు. ముద్రగడ అజెండా.. కాపులను, దళితులను, బీసీలను ఏకం చేయడం. ఈ మూడు సామాజికవర్గాలే ఉభయగోదావరి జిల్లాలలో అధికం. ప్రతి గ్రామంలో కాపులు, దళితులు, బీసీలు ఉంటారు. బీసీల్లో గౌడ, శెట్టిబలిజ సామాజికవర్గం జనాభానే అధికం. ఈ మూడు సామాజికవర్గాలను ఏకంచేసి రాజకీయ పార్టీ పెడితే.. గోదావరి జిల్లాలలో విజయం సాధించేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయనేది ముద్రగడ ఆలోచన కావచ్చు.
Also Read : తగ్గేదేలే.. నేలకు కొట్టిన బంతిలా పైకిలేస్తా – ముద్రగడ
కులముద్ర.. విజయం అంత సులువు కాదు..
కాపు సామాజికవర్గానికి చెందిన సినీ నటులు చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు రాజకీయ పార్టీలు పెట్టి విఫలం అయ్యారు. వారు కుల ప్రస్తావన తేకపోయినా ఆశించిన ఫలితం దక్కలేదు. అయితే వారికి భిన్నంగా ముద్రగడ పద్మనాభం వెళుతున్నారు. నేరుగా ఆయనే కులాన్ని ప్రస్తావిస్తున్నారు. కాపులు, దళితులు, బీసీల ఐక్యం.. అంటున్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో ఇతర అగ్రవర్ణాలైన రెడ్లు, కమ్మలు చాలా తక్కువ. వారి ప్రాబల్యం నామమాత్రమే. అగ్రవర్ణాల్లో కాపులదే గోదావరి జిల్లాలలో అధిక ప్రాబల్యం. రాజకీయంగా కాపులకు, గౌడ, శెట్టిబలిజలు మధ్య పోటీ ఉంటుంది. కాపులు, దళితుల మధ్య కూడా సామాజిక, రాజకీయ వైరం ఉంది. ఈ మూడు కులాల మధ్య ఉన్న ఈ పరిస్థితిని ముద్రగడ మార్చగలిగితే.. ఆయన అనుకున్న ఆలోచన సఫలం అవుతుంది.
ఆంధ్రప్రదేశ్‌లో ఉభయగోదావరి జిల్లాలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత కలిగినవి. పశ్చిమ గోదావరిలో 15, తూర్పు గోదావరి జిల్లాలో 19 వెరసి.. గోదావరి జిల్లాల్లో 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న మొత్తం నియోజకవర్గాలు 175తో పోల్చుకుంటే.. ఉభయ గోదావరి జిల్లాల్లోని నియోజకవర్గాలు దాదాపు 20 శాతం. గోదావరి జిల్లాల నియోజకవర్గాలు మినహాయిస్తే.. మిగతా 11 జిల్లాలలో ఉండే నియోజకవర్గాలు 141. ఏపీలో ఏదైనా ఓ రాజకీయ పార్టీకి అధికారం దక్కాలంటే 88 సీట్లు గెలవాలి. ఉభయ గోదావరి జిల్లాలను మినహాయించి మిగిలిన జిల్లాల్లోని 141 సీట్లలో 88 సీట్లు గెలుచుకోవడం ఏ పార్టీకైనా కత్తిమీద సాములాంటిదే. ఉభయ గోదావరి జిల్లాలలో అత్యధిక సీట్లు గెలుచుకున్న పార్టీనే.. ఏపీలో అధికారంలోకి వస్తుందని 2014, 2019 ఎన్నికల్లో రుజువైంది.
ఇలాంటి రాజకీయ సమీకరణాలు ఉన్న ఏపీలో.. ముద్రగడ పద్మనాభం రాజకీయపార్టీ పెట్టి.. ఉభయ గోదావరి జిల్లాల్లో విజయవంతం అయితే.. ప్రభుత్వ ఏర్పాటులో ఆ పార్టీ కీలక భూమిక పోషిస్తుంది. కింగ్ మేకర్‌గా నిలుస్తుంది. అన్ని పరిస్థితులు అనుకూలిస్తే.. కింగ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. రాజకీయాల్లో సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదని.. కర్ణాటకలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు నిరూపిస్తున్నాయి. 224 సీట్లు ఉన్న కర్ణాటకలో 37 సీట్లు సాధించిన జేడీఎస్ అధినేత కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. మరి ముద్రగడ ఆలోచనలు కార్యరూపం దాల్చి, అవి విఫలం అవుతాయా..? సఫలం అవుతాయా..? కాలమే తేల్చాలి.
Also Read : బ్లూ ప్రింట్ తయారు చేద్దాం.. అధికారం సాధిద్దాం.. ముద్రగడ సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభం