నేవీ డే – ఘాజీ

అది 1971.. డిసెంబర్‌ 4వ తేదీ.. అందరి అంచనాల్ని తలక్రిందులు చేస్తూ ఇండియన్‌ నేవీ పాకిస్తాన్‌ లోని కరాచీ పోర్టుపై మెరుపు దాడి చేసి నాలుగు యుద్ధ నౌకలను ధ్వంసం చేసింది. వెంటనే బంగాళాఖాతంలోని జల ప్రాంతాలన్నిటినీ భారత నావికా దళం తన అధీనంలోకి తెచ్చుకుంది. మరోవైపు భారత వైమానికదళం దాదాపుగా 4వేల యుద్ధ వాహనాలతో పాకిస్తాన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ పై దాడిచేసి కలావికలం చేసింది. భారత నేవీ సైన్యం ముందు పాకిస్తాన్ వేసిన ఎత్తులు నిలవలేదు. డిశంబర్ నాలుగు నుంచి 16 కల్లా అంటే మొత్తం 15రోజుల్లోనే పాకిస్తాన్‌ నేవీ పూర్తిగా భారత దళాలకు లొంగిపోయింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్‌ షిప్‌ (పిఎన్‌ఎస్‌) ఘాజీని విశాఖ తూర్పు నౌకాదళం సమీపంలో మన నేవీ సిబ్బంది ముంచేసారు. అది భారత ఉపఖండానికి చెందిన సముద్ర జలాల్లో మొదటి జలాంతర్గామి.

ఈ సబ్ మెరైన్ ఘాజీపై దాడి ఓవైపు, మరోవైపు ఆపరేషన్‌ ట్రైడెంట్‌ పేరుతో భారత నావికాదళం చేపట్టిన కరాచీ ఓడరేవు పై దాడి విజయవంతం అయ్యింది. ఈ క్రమంలోనే డిసెంబర్‌ 4వ తేదీ రాత్రి నాలుగు పాకిస్తానీ డిస్ట్రోయర్‌ నౌకలు దెబ్బతిని సముద్ర గర్భంలో మునిగిపోయాయి. ఇవి భారత నావికా దళ వ్యూహాత్మక విజయానికి ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలిచాయి. ఈ జల యుద్ధంలో 720మంది పాకిస్తానీ నేవీ సైన్యం మరణించగా పాక్ కు ఎంతో ఆర్ధికనష్టం జరిగింది. అలాగే ఇండియాకూ నష్టం వాటిల్లింది. అరేబియా మహాసముద్రంలో ఇండియన్ ఫ్రిగేడ్‌ ఐఎన్‌ఎస్‌ ఖుక్రీ నౌకను ముంచినప్పుడు 18మంది అధికారులు, 176 మంది నేవీ సైన్యాన్నీ భారత్‌ నష్టపోయింది. ఈ జల యుద్ధంలో భారత నావికాదళానికి ఈ స్థాయిలో మాత్రమే నష్టం జరగగా.. పాకిస్తాన్‌ కు మాత్రం మూడోవంతు నావికా దళ బలగాన్ని కోల్పోయింది. పాక్ యుద్ధఖైదీలు సుమారు 90 వేల మంది పట్టుబడగా, 3ఇండియన్‌ నేవీ మిసైల్‌ బోట్లు ఐఎన్‌ఎస్‌ వీర్‌, ఐఎన్‌ఎస్‌ నిర్ఘాట్‌, ఐఎన్‌ఎస్‌ నిపాట్‌ ఈ ఆపరేషన్స్‌లో క్రియాశీల పాత్ర పోషించాయి. ఇదీ ఘాజీ చరిత్ర..

2017లో ఘాజీ ఎటాక్‌ సినిమాలో కూడా ఈ చరిత్రను ఇండియన్‌ నేవీ కీర్తిపై స్ఫూర్తిదాయకంగా చూపించారు. భారత్ – పాకిస్తాన్ ఇప్పటివరూ నాలుగు యుద్ధాల్లో తలపడ్డాయి.. కానీ అందరికీ తెలియని మరో పోరాటం విశాఖపట్నం తీరంలో జరిగింది. ఈ సన్నివేశాలతో ఘాజీ సినిమా వచ్చింది. 1971లో జరిగిన ఇండియా – పాకిస్తాన్‌ యుద్ధంలో పాకిస్తాన్‌ సబ్‌మెరైన్‌ ఘాజీపై పై ఇండియన్‌ నేవీ దాడి చేసింది.. ఈ ఘటనలను సినిమాలో వివరంగా చూపించారు. అప్పటినుంచి విశాఖ తీరంలో నేవీ డే ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పాక్‌పై భారత్‌ నావికాదళ విజయానికి గుర్తుగా ప్రతిఏటా ఈ రోజునే నేవీ డేగా దేశంలోని నావికాదళ కమాండ్స్‌ అన్నీ నిర్వహిస్తున్నాయి. రక్షణదళంలోని త్రివిధ దళాల కీర్తిని ఇనుమడింపజేసే కార్యక్రమాలతో ఉత్సవాలను చేపడుతున్నారు. క్రమేపీ నేవీపాత్ర తీర భద్రతలో కీలకంగా పెరుగుతోంది. సముద్ర తీర సరిహద్దులను కాపాడుకోవడం, అంతర్జాతీయ సంబంధాలను విస్తరింపజేయడం, సైనిక, ద్వైపాక్షిక విన్యాసాలను నిర్వహించడంతోపాటు ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడానికి నావికాదళ సైన్యం చేస్తున్న సేవలు అభినందనీయం..

నేవీ డే విజయానికి గుర్తుగా నేవీ విన్యాసాలతోపాటు బ్యాండ్‌ బృందాల సాంస్కృతిక ఉత్సవాలు ఘనంగా విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో జరగుతుంటాయి. ఈ ఏడాది కూడా నేవీ బ్యాండ్‌ మేళా ఏర్పాటు చేశారు. ప్రజలంతా తిలకించేలా నేవీ ఏర్పాట్లుచేసింది. ప్రజలు ఉచితంగానే వీటిని తిలకించవచ్చు. ఆర్కే బీచ్‌లో ఎయిర్‌ క్రాఫ్ట్‌లు, యుద్ధవిమానాలు భారీ శబ్దాలు చేసుకుంటూ జనంపై నుండి దూసుకుపోవడం, హెలీకాప్టర్ల నుంచి నావికాదళాలకు చెందిన సైనికులు తాళ్ల సహాయంతో సముద్రంలో దిగడం వంటి సాహసాలు ఆశ్చర్యపరుస్తాయి. నేవీ నౌకలు సముద్రంపై వెళ్తూ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తాయి. విమానాలు తలపై నుండి దూసుకు పోతుండడంతో ఆ ప్రాంతంలోనివారంతా సంభ్రమాశ్చర్యాలకు గురవుతుంటాం. ఇప్పటికే నేవీడే వేడుకలకు నగరం సిద్ధమైంది. ఇప్పటికే తూర్పు నౌకాదళం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచంద్, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈసారి వేడుకలకు హాజరు కానున్నారు.

Show comments