జగన్ లేఖపై వివాదం.. ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ కి రాజీనామాలు

ఏపీ ముఖ్యమంత్రి రాసిన లేఖ ప్రభావం న్యాయనిపుణుల్లో కొత్త వివాదానికి తెరలేచింది. ఏపీలో న్యాయవాద సంఘాల్లో తీవ్ర చర్చకు ఆస్కారమిచ్చింది. చివరకు ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ కి సీనియర్లు దూరం కావడానికి దోహదం చేసింది. తాజాగా ఐఎల్ఏ గౌరవాధ్యక్ష పదవి నుంచి కే రామజోగేశ్వర రావు తప్పుకున్నారు. తాను రాజీనామా చేసినట్టు ఆయన ప్రకటించారు.

సుప్రీంకోర్ట్ జస్టిస్ ఎన్ వి రమణ, ఏపీ హైకోర్టులో కొందరు న్యాయమూర్తుల వ్యవహారానికి సంబంధించి సీఎం జగన్ తన అభ్యంతరాలను సీజేకి తెలిపారు. వాటి వివరాలను ప్రభుత్వ సలహాదారు మీడియా సమావేశంలో వెల్లడించారు. దేశమంతటా దానిపై చర్చకు ఆస్కారం ఏర్పడింది. అదే సమయంలో ఐఎల్ఏ ప్రధాన కార్యదర్శి హోదాలో చలసాని అజయ్ కుమార్ రాసిన ఓ లేఖ ఆ సంఘంలో విబేధాలాకు తావిచ్చింది. ముఖ్యమంత్రి లేఖను తప్పుబడుతూ ఐఎల్ఏ ప్రకటన ఉండడాన్ని గౌరవాధ్యక్షుడు నిరసించారు. ఈ ధోరణి సరికాదన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరపాలని కోరకుండా, ఫిర్యాదు చేసినందుకు నిందించడం తగదన్నారు. దాంతో వ్యవహారం ముదిరింది.

ప్రస్తుతం ఏపీ బార్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడిగా ఉన్న కే రామజోగేశ్వర రావు తన అభ్యంతరాలను తొలుత సంఘం నేతల దృష్టికి తీసుకెళ్లారు. తర్వాత బహిరంగ ప్రకటన చేశారు. అయినా ఉపసంహరించుకోకపోవడంతో తాను ఐఎల్ఏలో కొనసాగలేనని స్పష్టం చేసేశారు. ఓవర్గానికి కొమ్ముచేసేలా ఈ వ్యవహారం ఉందని, అది తనను మానసికంగా గాయపరిచిందని ఆయన పేర్కొన్నారు.

వాస్తవానికి ఇదే రీతిలో ఢిల్లీ, సుప్రీంకోర్ట్ న్యాయవాద వర్గాల్లో కూడా భిన్నవాదనలు వినిపించాయి. జగన్ లేఖను పలువురు సమర్ధించారు. అయినా లాయర్ల అసోసియేషన్ లో ఉన్న కొందరి ప్రోత్సాహంతో వచ్చిన ప్రకటనలను అత్యధికులకు రుచించడం లేదు. దానికి తగ్గట్టుగానే ఏపీలో కూడా ఐఎల్ఏలో వివాదం ఆసక్తిగా మారింది. జగన్ పట్ల న్యాయవాద వర్గాల్లో వ్యతిరేకత పెంచే ప్రయత్నాలకు అడ్డుకట్టపడుతున్నట్టుగానే కనిపిస్తోంది.

Show comments