23 నుంచి పుస్తక మహోత్సవం

పుస్తక ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే హైదరాబాద్ పుస్తక మహోత్సవం మరో పది రోజుల్లో మొదలవనుంది. దేశంలోనే నాలుగో అతిపెద్ద పుస్తక ప్రదర్శనగా ఖ్యాతికెక్కిన హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ ఈ నెల 23 నుంచి పది రోజుల పాటు జరగనుందని నిర్వాహకులు వెల్లడించారు. హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించే పుస్తక ప్రదర్శనలో ఈ ఏడాది 320 స్టాళ్లు, వాటిలో 160 వరకు అంగళ్లు కొలువుదీరనున్నట్లు చెప్పారు. రెండు లక్షల ఉచిత ప్రవేశ పాసులను పంపిణీ చేస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి కోయ చంద్రమోహన్‌, వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేశ్వరరావు తెలిపారు. విద్యార్థులకు ప్రవేశం ఉచితమని ప్రకటించారు.

పుస్తక మహోత్సవం ప్రాంగణానికి పీవీ నరసింహారావు పేరు పెట్టాలని నిర్వాహకులు భావిస్తున్నారు. ప్రతి ఏటా డిసెంబర్ లో ఈ బుక్ పెయిర్ నిర్వహిస్తున్నారు. దాదాపు పది లక్షల మంది ఈ ప్రదర్శనకు వస్తున్నారు. దేశ, విదేశ రచయతలు రాసిన పుస్తకాలు ఇక్కడ లభిస్తాయి. వివిధ రకాల పుస్తకాల ధరల పై రాయితీలు కూడా ఇస్తారు. అన్ని పుస్తకాలు ఒకే చోట దొరికే ఈ ప్రదర్శన లో పుస్తక ప్రియులు తమకు నచ్చిన పుస్తకాలను ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉంది. జనవరి 1 వరకు ఈ పుస్తక ప్రదర్శన కొనసాగనుంది.

Show comments