ప్రయాణికులకు అలర్ట్.. ఓఆర్ఆర్ పై ఎగ్జిట్ 2, 7 మూసివేత!

ప్రయాణికులకు అలర్ట్.. ఓఆర్ఆర్ పై ఎగ్జిట్ 2, 7 మూసివేత!

ఇటీవల కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచి కొడుతున్నాయి. దీంతో ఎక్కడ చూసిన నీరే కనిపిస్తుంది. పలు ప్రాంతాలు నదులను, చెరువులను తలపిస్తున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాలు అయితే నీట మునిగాయి. ఇక భారీ వరదల కారణంగా రహదారులపైకి కూడా నీరు వచ్చి చేరింది.  హైదరాబాద్ కూడా కుండపోతగా వర్షం కురుస్తోంది. నగరంలోని వాగులు, వంకలు, కుంటలు, చెరువులు, నదులు పొంగి పొర్లుతున్నాయి.  ఈ భారీ వానల కారణంగా ఔటర్ రింగ్ రోడ్డుపైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో  సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు.

హైదరాబాద్ చుట్టూ ఉన్న ఔటర్ రింగ్ రోడ్డుపై నుంచి నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి.  అయితే ఇటీవల కురుస్తున్న వానల ధాటికి రింగ్ రోడ్డు పరిసరాల్లోని పలు చోట్ల రహదారులపైకి నీరు వచ్చి చేరింది. దీంతో  ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణించే వారికి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం చేశారు. శంషాబాద్, మేడ్చల్  పరిధిలోని ఓఆర్ఆర్ పై ఎగ్జిట్ నెం 2,7లను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. ఎగ్జిట్ నెం.2 బదులుగా.. ఎగ్జిట్  నం.1,3 మీదుగా బయటకు వెళ్లాలని సూచించారు.

అలాగే ఎగ్జిట్ నం.7కు బదులుగా ఎగ్జిట్ నం.6,8 మీదుగా వెళ్లాలని కోరారు. ఇదే విషయాన్ని ఔటరింగ్ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు గమనించాలని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ అందమైన  ఓఆర్ఆర్ బురదమయంగా మారింది. భారీ వాహనాలు వెళ్లే 3,4 లైన్లలో అడుగడుగునా గుంతలు దర్శనమిస్తున్నాయి. దీంతో  ఆటోలు వెళ్లే 1వ, 2వ లైన్లలోకి ఆ భారీ వాహనాలు రావడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  భారీ వర్షాల కారణంగా ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల్లోని రోడ్డు ఎక్కడికక్కడ దెబ్బతింది.

కోకాపేట నుంచి గచ్చిబౌలి, కొల్లూరు  నుంచి పటాన్ చెరు, ఘట్ కేసర్ నుంచి పెద్ద అంబర్ పేట, కండ్లకోయ నుంచి పటాన్ చెరు వరకు  గుంతలమయ్యాం అయ్యాయి. బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. మాదాపుర్ పోలిస్ స్టేషన్ సమీపంలో ప్రధాన రహదారులపై వరద నీరు చేరడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షాల కారణంగా రోడ్లన్నీ గుంతలమయం అయ్యాయి. దీంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఈ క్రమంలోనే ఓఆర్ఆర్ పై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఈ కీలక ప్రకటన చేశారు.


ఇదీ చదవండి: రానున్న రెండు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలి: డీజీపీ

Show comments