బ్రిటీష్ పెత్తందారీని ఎదిరించిన నూజివీడు సంస్థాన చరిత్ర తెలుసా..?

  • Published - 05:16 AM, Wed - 29 September 21
బ్రిటీష్ పెత్తందారీని ఎదిరించిన నూజివీడు సంస్థాన చరిత్ర తెలుసా..?

మొఘల్ సామ్రాజ్యం నుంచి నిజాం స్వతంత్రం ప్రకటించుకున్న తర్వాత కోస్తాంధ్ర ప్రాంతం వారి పాలనలోనే ఉండేది. అప్పట్లో రూపాంతరం చెందిన వ్యవస్థే జమీందారి పాలన. 17 వ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీతో నిజాం రాజులకు కుదిరిన ఒప్పందం మేరకు బ్రిటీష్ వారికి కోస్తాంధ్ర పై అధికారం లభించింది. ఫ్రెంచ్, బ్రిటిష్ వారు పాలించిన జిల్లాలనే సర్కార్ జిల్లాలు అంటారు.

పన్నుల వసూళ్లు స్థానిక భూస్వాములతోనే సాధ్యమని భావించిన బ్రిటీష్ వారు, వారికే ఆ అధికారం కట్టబెట్టారు. దీంతో భూస్వాములు రాజభోగాలు అనుభవిస్తూ బ్రిటీషు వారు చెప్పినట్లు వినేవారు. మరోవైపు బ్రిటీషువారిని ఇబ్బందిపెట్టిన జమీందారులు ఉండగా.. అందులో నూజివీడు సంస్థానదీశులు కూడా ఉన్నారు. కృష్ణా జిల్లాలో ఉన్న సంస్థానాలల్లో నూజివీడు జమీందార్ల పౌరుష, పరాక్రమాలకు చరిత్రలో ప్రత్యేక స్థానముంది. విదేశీపాలకులపై మొదటతిరుగుబాటు చేసినవారిగా వీరికి పేరుంది. సంస్థానంలో18 పరగణాలు మేర విస్తరించింది. సంస్థాన పరిధిలో231 గ్రామాలు ఉండేవి. 1802లో సంస్థాన వార్షిక ఆదాయం 5 లక్షల రూపాయాలు ఉండేది.

అప్పటి సంస్థాన కట్టడాలలో కొన్నింటిని ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలుగా, విద్యాసంస్థల నిర్వహణకు ఉపయోగిస్తున్నారు. అప్పటి సంస్థాన పాలనకు గుర్తుగా ప్రస్తుతం గుర్రాల గేటు, కుక్కల గేటు నిర్మాణాలు ఇప్పటికీ ఉన్నాయి.

Also Read : కోర్టు వివాదాలు తీర్చే శ్రీలక్ష్మి నారసింహుడు ఎక్కడ ఉన్నారో తెలుసా..?

శౌర్యానికి ప్రతికగా ‘మేకా’ ఇంటిపేరు..

సంస్థాన మూలపురుషుడిగా పేరున్న బసవన్న వరంగల్ నుంచి వచ్చి స్థిరపడ్డారు. కాకతీయుల సైన్యంలో ఆయన సైన్యాధిపతిగా ఉండేవారు. కాకతీయ సామ్రాజ్య పతనం తర్వాత గొల్లపల్లి వచ్చి పాటిమన్నుతో నివాసం ఏర్పరుచుకున్నారు. ప్రతాపరుద్రుడి మరణం తర్వాత ఓరుగల్లు కాకతీయ సామ్రాజ్యం పతనమైంది. అనంతరం ప్రతాపరుద్రుడి సైన్యాధిపతులుగా ఉన్న వెలమరాజులు, వేరు వేరు ప్రాంతాలకు వలసవెళ్లారు. కొందరు బొబ్బిలికి వైపు వెళ్లగా.. విప్పర్ల గోత్రజులైన వెలమరాజులు కొందరు కృష్ణా జిల్లా గొల్లపల్లిలో ఆవాసం ఏర్పరుచుకున్నారు. అక్కడ ఓ పొలంలో తోడేలును తరముతున్న మేకను చూసి ఆశ్చర్యపోయారు. ఈ భూమిలో పౌరుషం ఉందని భావించి సంస్థానం ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రదేశం నువ్వులచేల ప్రదేశం కావున నూజేలవీడుగా పేరుపెట్టారు. కాలక్రమేణా అది నూజివీడుగా మారింది. సంస్థానం స్థాపించడానికి శౌర్యంగల మేక కారణం కనుక ఈ వెలమరాజుల ఇంటి పేరు మేకా గా స్థిరపడినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది. కోట నిర్మాణం కోసం అక్కడ తవ్వకాలు జరుపుతుండగా రాజగోపాల స్వామి విగ్రహం బయటపడగా అక్కడ దేవాలయం కట్టించారని చారిత్రిక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

Also Read : తెలుగోడి రాజసం..మన కొండపల్లి కోట..

వంశనామం అప్పారావు..

బసవన్న కుమారుడు తిమ్మన్న.. తిమ్మన కుమారుడు బాపన్న.. బాపన్న పుత్రుడు కోనప్ప. కోనప్పయే అనేక గ్రామాలతో కూడిన పరగణాకు ప్రభువు. కోనప్ప కుమారుడు వెంకటాద్రి, వెంకటాద్రి పుత్రుడు అప్పన్న.. నూజివీడు పాలకులలో ఇతనే ప్రఖ్యాతుడు. ఇతని పాలనా దక్షతను మెచ్చి రావు బహుదుర్ బిరుదును నిజాం నవాబు… ఇచ్చారు. అప్పటి నుంచి అప్పారావుగా పేరుగాంచారు. ఈయన కాలం నుంచే నూజివీడు పాలకులు అప్పారావు అను బిరుదును పేరు చివర చేర్చుకుంటారు. విజయ అప్పారావు అనే బిరుదు కూడా ఇతనికి కలదు. విజయ అప్పారావు కుమారుడు వెంకటాద్రి అప్పారావు, ఆయనకు నరసింహ అప్పారావు, సుబ్బన్న అను ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకటాద్రి అప్పారావు కాలంలో సర్కార్ జిల్లాలు ఈస్ట్ ఇండియా కంపెనీకి కౌలుకు ఇవ్వబడ్డాయి. 1772లో వెంకటాద్రి అప్పారావు మరణించిన తర్వాత ఆయన సోదరుడు నారయణ అప్పారావు సంస్థానాన్ని పాలించారు.

రెబల్ అప్పారావు..

ఈ వంశంలో రెబెల్ అప్పారావుగా నారాయణ అప్పారావు(నారయ్య అప్పారావు)ను భావిస్తారు. బ్రిటిష్ వారితో గెరిల్లా పోరాటం చేసి వారిపై విజయం సాధించి ధీశాలి. ‘దండంగార్డెన్స్’ ప్రాంతం వద్ద ఫిరంగుల యుద్ధం జరగగా ఆ పేరుతోనే ఆ ప్రాంతాన్ని పిలుస్తారు. కప్పం చెల్లించే విషయంలో నారయ్య అప్పారావు బ్రిటీషు వారితో యుద్ధం చేయగా కోట నేలమట్టమైంది. తర్వాత నారయ్య అప్పారావు భద్రాచలం అడువుల్లోకి పారిపోయాడు.

Also Read : తెనాలిని ఆంధ్రా ప్యారిస్ అని ఎందుకు అంటారు..?

ఆరు ముక్కలుగా నూజివీడు సంస్థానం…

బ్రిటీషు వారు సంస్థానాన్ని ఆక్రమించుకుని నారయ్య పెద్దభార్య కుమారుడైన వెంకట నరసింహఅప్పారావుకు సంస్థాన బాధ్యతలు అప్పగించారు. 1793 వరకు ఆయన పాలించారు. అయితే అడువుల్లో ఉన్న నారయ్య అప్పారావు, కుమారుడి సంస్థానంపై దాడి చేసి అలజడి సృష్టించినట్లుగా తెలుస్తోంది. తన రెండో భార్య కమారులకు సంస్థానంలో వాటా కోసం కోట్లాడాడు. రెండో భార్య కుమారులు రామచంద్ర అప్పారావు, నరసింహ అప్పారావు. తర్వాత రామచంద్ర అప్పారావు, వెంకట నరసింహ అప్పారావు మధ్య వైరం పెరిగి సంస్థానం నూజివీడు, నిడదవోలుగా విడిపోయింది. నిడదవోలు జమీ వెంకట నరసింహ అప్పారావు కిందకు వచ్చినంది. నూజివీడు సంస్థానం రామచంద్ర అప్పారావు పాలనలో ఉండేది. ఇతని కుమారుడే శోభనాద్రి అప్పారావు. శోభనాద్రి అప్పారావు పాలన తర్వాత తలెత్తిన వారసత్వ తగాదాలతో సంస్థానం 1882లో ఆరు జమీందారీలుగా విడిపోయింది. ఈ సంస్థానం నుంచి విడిపోయిన జమీందారీలు వెంట్రప్రగడ, వయ్యూరు, మీర్జాపురం, కపిలేశ్వరపురం, తెల్లప్రోలు, మేడూరు.

నూజివీడు నియోజకవర్గం 1952లో ఏర్పడగా,, ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరగగా,, కాంగ్రెస్ 8 సార్లు, టీడీపీ 4 సార్లు , వైసీపీ రెండు సార్లు, ఇండిపెండింట్ ఒకసారి గెలిచాయి. ప్రస్తుతం నూజివీడు ఎమ్మెల్యేగా మేకా వెంకటప్రతాప్ అప్పారావు ఉన్నారు. ఆయన 2014, 2019లో వైసీపీ నుంచి విజయం సాధించారు. రెండు సార్లూ టీడీపీ అభ్యర్థులపై విజయం సాధించారు.

Also Read : పరిటాల అనే స్వతంత్ర దేశం తెలుసా…?

Show comments