కోర్టు వివాదాలు తీర్చే శ్రీలక్ష్మి నారసింహుడు ఎక్కడ ఉన్నారో తెలుసా..?

  • Published - 10:10 AM, Sun - 26 September 21
కోర్టు వివాదాలు తీర్చే శ్రీలక్ష్మి నారసింహుడు ఎక్కడ ఉన్నారో తెలుసా..?

క్రీస్తు పూర్వం 225 నాటికే మంగళగిరి ప్రాంతం ఉనికిలో ఉన్నట్లు చారిత్రిక ఆధారాలు ఉన్నాయి. ఆంధ్ర శాతవాహనుల రాజధానిగా ధాన్యకటకం ఉండేది. ఆ తర్వాత ఇక్ష్వాకులు, పల్లవులు, ఆనంద గోత్రజులు, విష్ణుకుండినులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు. ఆనంద గోత్రజుల నాలుగు తరాల రాజులు మంగళగిరికి సమీపంలోని కంతేరు ముఖ్య పట్టణంగా 100 ఏళ్ల పాటు పాలన సాగించారు.

మంగళగిరి నారసింహుడి క్షేత్రం..

కృష్ణా నదికి సమీపంలోని ఈ వైష్ణవక్షేత్రానికి ఎన్నో శతాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడ ముగ్గురు నరసింహస్వాములు పూజలందుకుంటున్నారు. దిగువ సన్నిధిన లక్ష్మీనరసింహస్వామి, ఎగువ సన్నిధిన పానకాల నరసింహస్వామి, కొండశిఖరాగ్రాన గండాల నరసింహస్వామి కొలువై ఉన్నారు. కొండపై అమ్మవారి ఆలయానికి పక్కన ఉన్న ఓ గుహ కృష్ణా నదీ తీరాన ఉండవల్లి వరకు ఉందనీ.. పూర్వం ఈ కొండపై తపస్సు చేసిన మునులు ఈ మార్గం గుండా కృష్ణానది వరకు రాకపోకలు సాగించేవారని స్థానిక కథనం ప్రచారంలో ఉంది. కొండ కూడా శయనిస్తున్న ఏనుగు ఆకారంలో ఉండటం కూడా విశేషం.

Also Read : తెనాలిని ఆంధ్రా ప్యారిస్ అని ఎందుకు అంటారు..?

కొండ అగ్ని పర్వతమా..?

తూర్పు కనుమల్లోని ఈ కొండ పురాణ ఇతిహాసిక ప్రాధాన్యతతో పాటు భౌగోళికంగానూ ప్రసిద్ధిగాంచింది. మంగళగిరి కొండ అగ్ని పర్వతమని, అందులో గంధకం ఉందనీ, అది పేలిపోకుండా ఉండేందుకు పానకం పోస్తుంటారని చెబుతుంటారు. ఈ నేపథ్యంలో భక్తులు స్వామివారికి బెల్లపు పానకం సమర్పిస్తుంటారని ప్రతీతి. అయితే, అగ్ని పర్వతాల సమీపంలో ఉండే భౌగోళిక లక్షణాలు ఇక్కడ లేవు. భూగర్భంలో హెచ్చు ఉష్ణోగత్రలు నమోదైనట్లు నిర్ధారణ కాలేదు.

పానకాల స్వామి….

ఎగువ సన్నిధిన పానకాల స్వామి కొలువై ఉన్నారు. కొండను తొలిచి ఆ ఆలయాన్ని నిర్మించారు. పురాణాల ప్రకారం పానకాల స్వామి స్వయం వ్యక్త రూపుడు. కోపంతో ఉన్న ఇత్తడి ముఖపు తొడుగు ఉంటుంది. నోరు మాత్రమే ఉంటుంది. పానకం పోసే ముఖద్వారం రాతిలో 15 సెంటీమీటర్ల వెడల్పు ఉంటుంది. ఆలయాన్ని మధ్యాహ్నం నాలుగు గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచుతారు. రాత్రుళ్లు దేవతలు పూజలు నిర్వహించేందుకు వస్తారని భక్తుల విశ్వాసం. స్వామి వారికి ఏ పాత్రలో పానకం నివేదించినా అందులో సగం మాత్రమే తీసుకుని మిగతాది భక్తులకు వదిలివేస్తారనే నమ్మకం కూడా ఉంది. కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవు నెయ్యిని, ద్వాపరయుగంలో ఆవు పాలను నివేదనగా స్వీకరించిన స్వామి.. కలియుగంలో పానకాన్ని సేవిస్తున్నారు.

Also Read : పరిటాల అనే స్వతంత్ర దేశం తెలుసా…?

అతిపెద్ద గాలిగోపురం..

కొండ దిగువన నరిసింహస్వామి మూలవిరాట్ ను పాండవుల అరణ్యవాస కాలమందు ధర్మరాజు ప్రతిష్టించారని చెప్తుంటారు. విజయనగర రాజుల పాలనలో ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేశారు. రాష్ట్రంలో అత్యంత ఎత్తైన (157 అడుగులు) 11 అంతస్తుల లక్ష్మీనరసింహస్వామి గాలిగోపురాన్ని 1807-09లో అప్పటి అమరావతి క్షేత్రపాలకుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు నిర్మించారు.

దక్షిణావృత శంఖం

దేవాలయంలో ఉన్న విశిష్ట సంపదలో దక్షిణావృత శంఖం ఒకటి. దీనిని తంజావూరు మహారాజు 1820 నవంబర్ 20న కానుకగా సమర్పించినట్లు చెబుతారు. బంగారు తొడుగు ఉన్న ఈ శంఖంతో ముక్కోటి ఏకదశి నాడు భక్తులకు తీర్థమందిస్తారు. స్వాతి నక్షత్రం, తులారాశిలో నరసింహ స్వామి జన్మించినందున.. కోర్టు వివాదాలున్నవారు స్వామి వారికి మొక్కుకుంటారు.

శాంత నరసింహస్వామి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లకు ఇక్కడ కళ్యాణం జరుపుతారు. ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ ముందు రోజైన చతుర్దశి నాటి రాత్రి నరసింహస్వామి కళ్యాణం జరగడం క్షేత్ర అనవాయితీ. కళ్యాణానికి ముందు చెంచులు తమ ఆడపడుచు చెంచులక్ష్మిని నరసింహస్వామి వివాహం చేసుకున్న గుర్తుగా చెంచులు గుడి ఆవరణలో ఉత్సవం నిర్వహిస్తారు.

Also Read : మహేష్‌బాబు మురారీ సినిమా షూటింగ్‌ జరిపిన రామచంద్రాపురం రాజుగారి కోట గురించి తెలుసా..?

కోర్టు తీర్పు..

లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణానికి మంగళగిరిలోని పద్మశాలీయులు లక్ష్మీదేవి అమ్మవారికి పుట్టింటివారిగా వ్యవహరించడం సంప్రదాయం. అయితే 1915లో ధర్మకర్త ఆ ఆచారాన్ని కాదని తానే అమ్మవారికి కానుకులు అందజేశారు. ఈ విషయంపై మంగళగిరికి చెందిన పద్మశాలీయులు గుంటూరు కోర్టును ఆశ్రయించారు. ‘తాము శ్రీవారికి అత్తింటివారమని.. శ్రీలక్ష్మి అమ్మవారికి పుట్టింటి వారమని’ వాదించారు. నాటి దేవస్థాన ఆచార్యుడు కందాళ రంగాచార్యులు కూడా వారి వాదనను సమర్థించారు. ఇరుపక్షాల వాదనలు విన్న గుంటూరు అడిషినల్ మునసబు పీసీ త్యాగరాజు అయ్యర్ అవర్ ఘళ్.. స్వామివారి కళ్యాణం సందర్భంగా మహాలక్ష్మి పుట్టింటి వారిగా కానుకలు సమర్పించే హక్కు పద్మశాలీయులకు స్థిరపరుస్తూ 1916 ఆగస్టు 8న తీర్పు చెప్పారు. భృగు వంశీయులైన పద్మశాలీయులు సిరికి పుట్టింటివారు అనడంలో సంశయం లేదని ఆ తీర్పులో పేర్కొన్నారు.

ఇక మంగళగిరి తిరునాళ్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి. స్వాతంత్రానికి ముందు నుంచే ఇక్కడ తిరునాళ్లు ఘనంగా నిర్వహిస్తున్నారు. రథోత్సవం ఇప్పటికీ ఓ సాంస్కృతిక మహోత్సవంలా సాగుతుంది. 1965లో నిర్మించిన ఆస్తులు-అంతస్తులు సినిమాలో ‘దులపరో బుల్లోడో..దుమ్ము దులపర బుల్లోడో‘ పాట మంగళగిరి తిరునాళ్ల రద్దీని తెలియజేసేలా సాగుతుంది.

Also Read : తెలుగోడి రాజసం..మన కొండపల్లి కోట..

Show comments