iDreamPost
iDreamPost
రైల్వే రిజర్వేషన్ లో RAC వచ్చిందా ఇక అంతే సంగతులు! చివరి నిముషం వరకు ఎవరి సీట్ క్యాన్సిల్ అవుతుందో, ఎక్కడ సీటొస్తుందో, అసలు వస్తుందో రాదో అన్న టెన్షన్ లో టీసీల చుట్టూ తిరుగుతుంటారు ప్రయాణికులు. రిజర్వేషన్ వివరాలు, క్యాన్సిలేషన్ వివరాలు టీసీలకు తప్ప మిగతా వాళ్ళకు తెలిసే అవకాశముండదు. వాళ్ళ కేటాయింపులే ఫైనల్. ముందు నుంచి లిస్టులో ఉన్నవాళ్ళను పక్కనపెట్టేసి డబ్బిచ్చిన వాళ్ళకు సీట్లిచ్చినా అడిగేవాళ్ళుండరు.
ఇకపై ఇలాంటి అవకతవకలకు తావుండదు. కారణం- దక్షిణ మధ్య రైల్వే (South Central Railway, SCR) 16 రైళ్ళలో టీసీలకు Hand Held Terminals (HHTs) ఇస్తోంది. వీటి వల్ల బెర్త్ కేటాయింపులు పక్కాగా, పారదర్శకంగా జరుగుతాయి. ఈ HHTలను డిజిటలైజేషన్ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళే సాధనాలుగా కూడా SCR భావిస్తోంది. ఇంతవరకు చార్టులు పట్టుకుని పెన్నుతో హడావుడిగా రాసుకుంటూ కనిపించే టీసీలు ఇప్పుడు HHTల్లోనే రిజర్వేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఏ బెర్తులు ఖాళీగా ఉన్నాయి, ఏవి క్యాన్సిల్? వాటిని ఎవరికి కేటాయించాలన్నది ఇకపై పారదర్శకంగా జరిగే వీలుంటుంది. 2019 నుంచే రాజధాని, శతాబ్ది రైళ్ళలో టీసీలు HHTలను వాడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించినంత వరకు సికింద్రాబాద్-పుణె- సికింద్రాబాద్ శతాబ్ది ఎక్స్ ప్రెస్ లో ఇవి వాడుకలో ఉన్నాయి. ఇక నుంచి విజయవాడ డివిజన్ లోని 16 రైళ్ళలో కూడా HHTలు కనిపిస్తాయి. ఈ మేరకు టీసీలకు శిక్షణ కూడా పూర్తయింది.