సబ్బం హరి ఆక్రమణలపై కొరడా

విశాఖలో మాజీ ఎంపీ సబ్బం హరి ఆక్రమణలు బయటపడ్డాయి. ఆయన ఇంటి నిర్మాణం కోసం ఏకంగా 11 అడుగుల స్థలం ఆక్రమించడంతో అదికారులు సీరియస్ అయ్యారు. పలుమార్లు వాటిని తొలగించాలని చెప్పినా విస్మరించడంతో నేరుగా ఆక్రమణల తొలగింపు చేపట్టారు. అయితే ఆక్రమణలు వాస్తవమేనని సబ్బం హరి కూడా అంగీకరిస్తున్నారు. కానీ తనకు నోటీసులు ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ముందుగా చెప్పి ఉంటే తానే తొలగించేవాడినని ఆయన అంగీకరించడం విశేషంగా మారింది.

విశాఖలోని ఖరీదైన ప్రాంతంగా చెప్పుకునే సీతమ్మధారలో సబ్బం హరి నివాసం ఉంటుంది. ఆ ప్రాంతంలో తన ఇంటిని ఆనుకుని ఉన్న విలువైన స్థలాన్ని సబ్బం హరి ఆక్రమించారు. దాని చుట్టూ గోడ కూడా నిర్మించారు. దాంతో జీవీఎంసీ అధికారులు రంగంలో దిగారు. ఉదయాన్నే ఆ ప్రాంతానికి చేరుకుని ఆక్రమణలు తొలగించారు. గోడను కూల్చారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణను సహించేది లేదని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు. గతంలో పలుమార్లు ఆక్రమణల అంశం మాజీ ఎంపీ దృష్టికి తీసుకెళ్లినట్టు అధికారులు చెబుతున్నారు.

దిగ్గజ విశ్లేషకుడు అంటూ సబ్బం హరిని చిత్రీకరించేందుకు ఓ వర్గం మీడియా చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. కానీ వాస్తవానికి ఆయన మీద పలు ఆరోపణలున్నాయి. చివరకు ప్రస్తుతం రోడ్డు స్థలాన్ని కూడా ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టిన తీరు విస్మయకరంగా మారింది. కానీ ఆయన మాత్రం తాను కొనుగోలు చేసిన స్థలంలో ఆక్రమణలుంటే తానే తొలగించేవాడినని చెబుతున్నారు. తన మీద కక్ష సాధింపు ధోరణితోనే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

విశాఖ నగర మేయర్ గా రాజకీయ ఆరంగేట్రం చేసి, ఆతర్వాత వైఎస్సార్ హయంలో ఆయన అనకాపల్లి నుంచి పార్లమెంట్ కి ఎన్నికయ్యారు. అదే ఆయన రాజకీయ జీవితాన్ని మలుపుతిప్పింది. రాష్ట్ర స్థాయి నేతగా గుర్తింపు రావడానికి దోహదపడింది. దానికి ప్రతిఫలంగా తొలుత జగన్ వెంట నడిచేందుకు సిద్ధపడిన సబ్బం హరి హఠాత్తుగా మనసు మార్చుకున్నారు. చివరకు విశాఖలో వైఎస్ విజయమ్మ ఓటమికి కారణమవుతూ ఆఖరి నిమిషంలో టీడీపీకి మద్ధతు పలికారు. సమైక్యాంధ్ర పార్టీ తరుపున బరిలో ఉన్న అభ్యర్థి అయినప్పటికీ ఓటింగ్ కి ముందు టీడీపీ కూటమికి అండగా నిలిచారు. ఆ తర్వాత పలుమార్లు జగన్ మీద వివిధ రూపాల్లో నిరాధార ఆరోపణలు గుప్పించారు. మొన్నటి ఎన్నికల్లో కూడా భీమిలి నుంచి టీడీపీ తరుపున బరిలో దిగి ప్రస్తుత మంత్రి అవంతి శ్రీనివాస్ చేతిలో ఓటమి పాలయ్యారు.

Show comments