పశ్చిమగోదావరి జిల్లా గుంటుపల్లిలో పురాతన బౌద్ధరామాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. అశోకుని కాలంలోనే గుంటుపల్లిలో బౌద్ధం వెలిసినట్లు ఆధారాలు ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా కామవరపుకోట మండలం జీలకర్రగూడెం గ్రామం గుంటుపల్లి వద్ద క్రీస్తుపూర్వం 3 వ శతాభ్ధంలో బౌద్ధరామాన్ని నిర్మించారు. రాతి కొండను తొలచి ఈ క్షేత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో బౌద్ధ స్థూపాలు చైత్యాలు, కట్టడాలు అనేకం ఉన్నాయి. బౌద్ధ సన్యాసులు ఆశీనులయ్యేందుకు నిర్మించిన కట్టడాలు,ధ్యానం చేసేందుకు కట్టిన గదులు నేటికి చెక్కు చెదరకుండా ఉన్నాయి. ఇక్కడొక విద్యాలయం ఉండేదని ప్రపంచం నలుమూలల నుంచి విద్యార్థులు ఇక్కడకు వచ్చేవారని, ఆచార్య నాగార్జునుడు దీన్ని నిర్వహించేవాడని చరిత్రకారులు చెబుతారు .
మౌర్య చక్రవర్తి అశోకుని కాలంలో బుద్ధ గయలో నిర్మించిన బరాబర గుహలకు గుంటుపల్లిలో గుహలకు పోలికలు ఉన్నాయి. అశోకుని కాలంలోనే ఈ బౌద్ధరామం ఏర్పాటు చేసినట్లు శాసనాలు కట్టడాలు ద్వారా తెలుస్తోంది.. ఈ బౌద్ధరామంలో అనేక రాతి గుహలు ఉన్నాయి వాటిలో బౌద్ధ సన్యాసులు నివసించేవారు.ఆ చిన్ని గదుల్లో కొండపై నుండి వచ్చే వర్షపు నీటి పారుదల కోసం రాతిని చెక్కి ఏర్పాటు చేసిన చిన్న డ్రైనేజి వ్యవస్థ ఔరా అనిపిస్తాయి. ఈ క్షేత్రంలో శిథిలమండపం మొక్కుబడి స్తూపాలు అద్భుతంగా నిర్మించారు.1880లో పురావస్తు శాస్త్రవేత్తలు అలెగ్జాండర్, రాబర్ట్ స్టీవెన్ ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఇక్కడ దొరికిన ఆధారాలు, శిలాకృతులు, శాసనాల ఆధారంగా అనేక పరిశోధనలు చేశారు. ఫలితంగా గుంటుపల్లి బౌద్ధ క్షేత్రం వెలుగులోకి వచ్చింది. అనంతరం భారత ప్రభుత్వం గుంటుపల్లిని గుర్తించింది. గుంటుపల్లి బౌద్ధరామాల సంరక్షణ బాధ్యతలను పురావస్తుశాఖ చేపట్టింది.
ఈ కొండను పాండవుల గట్టు అని కూడా అంటారు. అరణ్యవాసం సమయంలో పాండవులు ఇక్కడ నివసించారని అందుకు సాక్ష్యంగా భీముడి పాదముద్ర కూడా ఉందని స్థానికులు విశ్వసిస్తారు. పాదముద్ర ఆకారంలో కొండమీద ఉన్న సాక్ష్యం ఆ వాదనని బలపరుస్తుంది. సరైన రవాణా సౌకర్యం లేకపోవడం వల్ల, ఈ బౌద్ధ క్షేత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదని స్థానికులు అంటున్నారు.
కార్తీకమాసంలో కళకళ – మిగిలిన రోజుల్లో వెలవెల
కార్తీక మాసంలో వచ్చే నాలుగు సోమవారాల్లో ఇక్కడ తిరణాళ్లు జరుగుతాయి. కార్తీకమాస సోమవారాల్లో గుంటుపల్లి సందర్శకులతో కళకళలాడుతూ ఉంటుంది. మిగిలిన రోజుల్లో వెలవెలబోతుంది. ఇంత విశిష్టత ఉన్న ఈ గుంటుపల్లిని పురావస్తు శాఖ ఎందుకో నిర్లక్ష్యం చేస్తుంది. ఇక్కడికి చేరుకోవడానికి సరైన రవాణాసౌకర్యాలు ఉండవు, ఉండటానికి సరైన వసతి కూడా ఉండదు. ఈ ప్రాంత చరిత్రని వివరించడానికి కనీసం గైడ్ ని కూడా ప్రభుత్వం నియమించలేదు. అందుకే ఎంతో గొప్ప చరిత్ర ఉన్న గుంటుపల్లి బౌద్ధరామం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. చరిత్రలో గొప్పగా విరాజిల్లిన ఈ గుంటుపల్లి అభివృద్ధికి పురావస్తు శాఖ కృషి చేయాల్సిన అవసరం ఉందని చరిత్రకారులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
కార్తీకమాస సోమవారాల్లో ఈ బౌద్ధ గుహలు సందర్శకులతో నిండిపోతాయి. ఎవరైనా అక్కడకి చేరుకోవాలంటే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుంచి జంగారెడ్డిగూడెం వెళ్లేదారిలో కామవరపుకోట అనే గ్రామం ఉంటుంది. అక్కడ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న జీలకర్రగూడెం వెళ్తే కొండపైన ఉన్న ఈ గుహలకు వెళ్లొచ్చు.