Idream media
Idream media
వ్యవస్థలో మార్పు తీసుకురావాలనే బలమైన సంకల్పం ఉంటే చాలు మార్పు తప్పకుండా వస్తుందని ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను చూస్తే అర్థం అవుతోంది. గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేసిన సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఏడాదిలోనే అనుకున్న లక్ష్యం సాధించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రజల చెంతకు తీసుకెళ్లిన సీఎం వైఎస్ జగన్ ఏడాదిలోనే సచివాలయాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో సఫలీకృతులయ్యారు.
పెయింటింగ్‌లేని, పెచ్చులూడి.. శిథిలమైన పంచాయతీ భవనాలు నిన్నమొన్నటి వరకూ ఆంధ్రప్రదేశ్‌లో కనిపించాయి. ఇప్పుడు వాటి స్థానంలో కార్పొరేట్ హంగులతో నూతన సచివాలయాలు అందుబాటులోకి వచ్చాయి. గత ఏడాది అక్టోబర్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 15,003 గ్రామ, వార్డు సచివాలయాలను సీఎం జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అవన్నీ గ్రామ పంచాయతీ భవనాల్లోనో, పట్టణాల్లోనైతే ప్రభుత్వ కమ్యూనిటీ భవనాల్లో కొనసాగుతున్నాయి. వీటన్నింటికి నూతన భవనాలు నిర్మించేందుకు ఆరు నెలల క్రితం జగన్ సర్కార్ పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుతం అన్ని సచివాలయాలకు నూతన భవనాల నిర్మాణాలు ప్రారంభం అయ్యాయి. ఇందులో కొన్ని పూర్తయి, సిబ్బందికి, ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి.
పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలతో సహా నీటి వసతిని కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లో కల్పిస్తున్నారు. మూడు వేల చదరపు అడుగుల స్థలంలో జీ ప్లస్ 1 తరహాలో 40 లక్షల రూపాయల వ్యయంతో ఒక్కొక్క సచివాలయం నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ప్రజలు వేచిఉండేందుకు హాల్, మూడు రూములు, స్టోరేజీ రూం నిర్మించారు. పై ఫ్లోర్‌లో నాలుగు రూములు, మూడు మూత్రశాలలు/మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. భవనం చుట్టూ ప్రహరిని నిర్మించారు. సచివాలయ ప్రాంగణంలోనే నీటి సౌకర్యం కోసం బోరు వేసి మోటారు బిగించారు. అన్ని రూముల్లో ఫ్యాన్లు, టైల్స్‌తో ఫ్లోర్‌ను అద్దంలా తీర్చిదిద్దారు. తమ కళ్ల ముందే శిథిలమైన పంచాయతీ భవనాల స్థానంలో ఆధునిక హంగులతో నూతన భవనాలు అందుబాటులోకి రావడం ప్రజలను ఆశ్చర్యకితులను చేస్తోంది.