Idream media
Idream media
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికుల విమానాల రాకపోకలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో విదేశాలలో భారతీయులు చిక్కుబడి పోయారు.దేశంలో వివిధ ప్రాంతాలలో చిక్కుకున్న వలస కూలీల తరలింపుకు అనుమతించిన కేంద్రం,తాజాగా విదేశాలలోని భారతీయులను స్వదేశానికి తీసుకురావడంపై దృష్టి పెట్టింది.విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకువచ్చే ప్రక్రియ మే 7న మొదలవుతుందని కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించింది.
విదేశాల నుంచి భారతీయుల తరలింపు ప్రక్రియ దశలవారీగా సాగుతుందని కేంద్రం తెలిపింది.ఈ సేవను ఉపయోగించుకునేవారు ప్రయాణ ఖర్చులను చెల్లించాల్సి ఉంటుందని హోంశాఖ ప్రకటనలో తెలిపింది.విదేశాలనుంచి భారతీయులను విమానాలు,నౌకల ద్వారా తరలించనున్నట్లు పేర్కొంది.ఇలా తీసుకురావాల్సిన వ్యక్తుల జాబితాలను భారత హైకమిషన్లు,దౌత్య కార్యాలయాలు రూపొందిస్తున్నాయని కేంద్రం వివరించింది. ముందుగా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి కరోనావైరస్ లక్షణాలు లేనివారినే ప్రయాణానికి అనుమతిస్తామని,భారత్‌కు వచ్చిన తర్వాత 14 రోజుల పాటు వారు క్వారంటీన్‌లో ఉండాల్సి ఉంటుందని హోంశాఖ స్పష్టంచేసింది.
క్వారంటీన్ గడువు ముగిశాక వారికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, కరోనా వైరస్ లేదని నిర్ధారణైతే వారిని ఇంటికి వెళ్లేందుకు అనుమతిస్తామని హోంశాఖ పేర్కొంది. విదేశాల నుండి తమ స్వస్థలాలకు చేరుకున్న వారంతా ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని తెలపింది. విదేశాల నుంచి వచ్చే వారి కోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా పరీక్షల నిర్వహణకు, క్వారంటైన్‌కు సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.