తూ.గో, ప.గో.లకు ‘అమావాస్య’ ఆందోళన..!

గోదావరి ఉగ్రరూపం ఒకవైపు, 19వ తేదీన అమావాస్య రావడం మరోవైపు ఉభయగోదావరి జిల్లాల వాసులకు ఆందోళన పెంచుతోంది. అమావాస్య, పౌర్ణమిల సమయంలో సముద్రానికి వచ్చే ఆటు, పోట్లు గోదావరి నది వరదను ప్రభావితం చేస్తాయి. సాధారణ రోజుల్లో ఎన్ని లక్షల క్యూసెక్కుల నీటినైనా సముద్రంలోకి వెళ్ళిపోతుంది.

అయితే అమావాస్య, పౌర్ణమిల సమయంలో అయితే నీటిని లాక్కోవడం ఆపేస్తుంది. దీంతో ఒక్కోసారి నది వెనక్కు తన్నిపడుతుంది. అప్పుడు మాత్రం ఏటి గట్లు తెగిపడే ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయని కోస్తావాసులు చెబుతారు. ఈ నెల 19వ తేదీన అమావాస్య ఉంది. దీంతో గతంలో ఎదురైన పరిస్థితులను గుర్తు చేసుకుని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ధవళేశ్వరం నుంచి సముద్రం వరకు ఉన్న దాదాపు 90 కిలోమీటర్ల దూరం కూడా గోదావరి నది వరద ఏటిగట్లు వద్దకు చేరుకుంది. అమావాస్య రోజున నది తన్నుపడితే ఏటిగట్టు అంచును కూడా తాకేందుకు అవకాశం ఉంటుందంటున్నారు.

ఎగువ ప్రాంతాల నుంచి ప్రమాదకర స్థాయికి మించి వరద ముంచుకొస్తోంది. ధవళేశ్వరం వద్ద ఇప్పటికే మూడో ప్రమాదహెచ్చరికను జారీ చేసారు. 17వ తేదీన 19,21,811 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేసారు. అంటే దాదాపు 175 టీయంలకు ఇది సమానం. పోలవరం ప్రాజెక్టు నిల్వ సామర్ధ్యం 194 టీయంసీలు. అంటే 24 గంటల్లో గోదావరిలోకి విడుదల చేసిన నీరు దాదాపు పోలవరం నీటి నిల్వ సామర్ధ్యానికి సమానమన్నమాట.

ఇది కాక ఎగువన ఉన్న గోదావరి క్యాచ్‌మెంట్‌ ఏరియా నుంచి భారీగానే ముంపునీరు గోదావరిలోకి చేరుతోంది. సాధారణ రోజుల్లో చేరే ఎన్ని లక్షల క్యూసెక్కుల నీటినైనా సముద్రుడు లాగేస్తాడు. అయితే వెనక్కు తన్నుపట్టిన సమయంలో ఈ నీరు మొత్తం తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని గట్ల మధ్యనే నిల్వ ఉంటుంది. నదికి దిగువన ఉన్న ప్రాంతం ఈ రెండు జిల్లాలే కావడంతో ఎగువ నుంచి వచ్చిపడే మొత్తం వరదనీటి ప్రవాహ ఒత్తిడి ఇక్కడే కేంద్రీకృతం అవుతుంది.

గోదావరి నది నీటిమట్టం పరిగణనలోకి తీసుకునేందుకు పేరూరును బేస్‌పాయింట్‌గా భావిస్తారు. ఇక్కడ నమోదైన నీటిమట్టం ధవళేశ్వరం చేరుకునేందుకు సుమారు 36 గంటల వరకు పడుతుందని ఇరిగేషన్‌ అధికారుల అంచనా. అలాగే దుమ్ముగూడెం నుంచి 24 గంటల్లో ఇక్కడికి వస్తుంది. భద్రాచలం నుంచి 18–20 గంటల్లో వస్తుంది. పోలవరం కాఫర్‌ డ్యాం నుంచి ధవళేశ్వరం చేరుకునేందుకు 6–8 గంటల సమయం పడుతుంది. అంటే ఎగువన ప్రకటిస్తున్న నీటి మట్టాలు ధవళేశ్వరం చేరుకునేందుకు ఈ సమయం పడుతుందని అంచనా. నదీ ప్రవాహ వేగాన్ని అనుసరించి గంటలోపు సమయమే వీటిలో తేడాలు ఉండొచ్చు.

ఇప్పటికే కోనసీమ ప్రాంతంలో పల్లపు ప్రాంతాలు, ఒక మోస్తరు మెరకల్లోకి గోదావరి నీరు చేరుకుంది. సముద్రపోటు సమయంలో నదిలోకి వచ్చి చేరుకునే వరద నీరు కూడా ముందుకు కదలకుండా ఉండిపోతే మెరకలపైకి కూడా నీరు చేరుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.

అధికారులు ఊహిస్తున్నట్లుగా అంతస్థాయిలోనే వరద వస్తే ఉభయగోదావరి జిల్లాల పరిధిలో ఉన్న ఏటిగట్లు ఎంత వరకు తట్టుకుంటాయి? అన్నదే ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్న. అయితే గతంలో కంటే గోదావరి గట్లను ఎంతో ఎత్తు చేసారు. గత ఏడేళ్ళుగా ఈ స్థాయి వరద రాలేదు. ఇప్పుడు కూడా ఉన్నపళంగానే వచ్చిపడుతోంది. దీంతో ఎప్పుడే ప్రమాదం ముంచుకొస్తుందోనని ఉభయగోదావరి జిల్లాల ప్రజలు ఆందోళనలో ఉన్నారు.

కాగా 19వ తేదీకిలోపు ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే ముంపునీరు తగ్గుముఖం పట్టి, నదీ గర్భంలో ఉన్న నీరు అమావాస్య ప్రభావానికంటే ముందే సముద్రాన్ని చేరితే ఎటువంటి ప్రమాదం ఉండకపోవచ్చునన్న ధీమా కూడా మరోవైపు వ్యక్తమవుతోంది.

Show comments