సినిమా ప్రేమికులకు పండగ కానుకలు

మొత్తానికి సెకండ్ లాక్ డౌన్ తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ మెల్లగా కుదుటపడుతోంది. మన ప్రేక్షకులు ఇచ్చిన భరోసాతో నిర్మాతలు ధైర్యం చేసి తమ చిత్రాలను విడుదలకు సిద్ధం చేస్తున్నారు. లవ్ స్టోరీకి వస్తున్న కలెక్షన్లు ఆ నమ్మకాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఎస్ఆర్ కళ్యాణ మండపంతో మొదలైన ఈ పాజిటివ్ ట్రెండ్ ఇకపై కూడా కొనసాగుతుందనే నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు పెట్టుబడులు సిద్ధం చేసుకుంటున్నారు. ఏపిలో ఇప్పుడున్న నిబంధనలు అక్టోబర్ 1 నుంచి పూర్తిగా సడలిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాబోయే వాటికి మంచి వసూళ్లు వస్తాయనే ధీమా వాళ్లలో కనిపిస్తోంది. దసరా పండగ మాత్రం పసందుగా ఉండబోతోంది.

ముందుగా 8న వస్తున్న వైష్ణవ్ తేజ్ ‘కొండపొలం’ మీద అంచనాలు బాగానే ఉన్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ కావడం, క్రిష్ దర్శకత్వం, గొప్ప నవలను సినిమా రూపంలో తీసుకురావడం లాంటి కారణాలు హైప్ కి దోహదం చేస్తున్నాయి. గతంలో అదే డేట్ కి ఫిక్స్ అయిన అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ తాజాగా కొత్త డేట్ 15కి ఫిక్స్ అయ్యింది. ఈసారైనా మాట మీద ఉండాలని ఫ్యాన్స్ కోరిక. 9న శివ కార్తికేయన్ నటించిన ‘వరుణ్ డాక్టర్’ని తెస్తున్నారు. 13న విశాల్ ‘ఎనిమి’ని లాక్ చేశారు. ఈ రెండు డబ్బింగే అయినప్పటికీ మాస్ ఆడియన్స్ లో ఆసక్తి రేగే అవకాశాలు ఉన్నాయి. పోటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది

ఇక 14న శర్వానంద్ సిద్దార్థ్ ల ‘మహా సముద్రం’ రాబోతోంది. ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగిపోయాయి. ఆరెక్స్ 100 దర్శకుడి మూవీ కావడంతో బిజినెస్ కూడా క్రేజీగా ఉంది. 15న నాగ శౌర్య ‘వరుడు కావలెను’ రూపంలో వస్తున్నాడు. తమన్ మ్యూజిక్ ఇప్పటికే చార్ట్ బస్టర్ కాగా బడ్జెట్ కూడా భారీగా కేటాయించి మరీ తీశారు. ఇవి కాక మరో రెండు మూడు సినిమాలు వచ్చే అవకాశాలు కొట్టిపారేయలేం. మాములుగా ఈ రేంజ్ హడావిడి మనకు సంక్రాంతికి ఉంటుంది. కానీ ఈసారి ఆర్ఆర్ఆర్ తప్పుకోవడంతో ఇలా మీడియం రేంజ్ సినిమాలనీ కాంపిటీషన్ కు సిద్ధపడుతున్నాయి. మూవీ లవర్స్ కి ఇంతకన్నా పండగ ఏముంటుంది

Also Read : హిందీ సినిమాలకు రెక్కలు వచ్చేశాయి

Show comments