జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తీసుకుంటారు.. పార్టీ పరిస్థితి మళ్లీ మెరుగుపడుతుందని గంపెడాశలు పెట్టుకున్న టీడీపీ అభిమానులకు ఇది నిజంగా నిరాశ కలిగించే వార్తే. జూనియర్ ఎన్టీఆర్ తాను రాజకీయాల్లోకి వచ్చే విషయంలో పూర్తి క్లారిటీ తో ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఏదీ ఆయన చేయడం లేదని స్పష్టం చేయడం సగటు టీడీపీ అభిమానులకు నిస్తేజంలోకి నెట్టేసింది. మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోమో లాంచింగ్ సమయంలో శనివారం విలేకరులు రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు అంటూ అడిగిన ప్రశ్నకు దాటవేత సమాధానం ఇచ్చారు. ఖచ్చితంగా రాజకీయాల మీద తాను మాట్లాడబోనని చెప్పలేదు కానీ, ఇప్పుడు సమయం కాదు అని చెప్పడం ద్వారా ఆయనకు భవిష్యత్తు మీద రాజకీయాల్లోకి రావడం మీద ఓ ప్రణాళిక ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే ఇప్పటికిప్పుడు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఆయనకు లేదని తెలుస్తోంది.
అది అభిమానుల ఆశ!
జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. ఇటీవల చంద్రబాబు కుప్పం వెళ్లిన సమయంలో సైతం అభిమానులు పదేపదే జూనియర్ ఎన్టీఆర్ రావాలంటూ నినాదాలు చేశారు. అయితే దీని మీద చంద్రబాబు కు ఎలాంటి సమాచారం లేదు. జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు తో మాట్లాడి సైతం చాలా రోజులు అయింది. దింతో ఆ సమయంలో చంద్రబాబు టీడీపీ కార్యకర్తలకు ఏ సమాధానం చెప్పలేకపోయారు. అసలు దానిమీద మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. దింతో అసలు జూనియర్ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా లేదా అన్న చర్చ జరిగింది.
ఇప్పుడు వద్దని చెప్పారా?
జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టాలని కొందరు ఆయన సామాజికవర్గ పెద్దలు, నాయకులు, పారిశ్రామికవేత్తలు ఒక రాయబారాన్ని ఎప్పుడో తారక్ ముందు ఉంచారు అనే ప్రచారం ఉంది. అయితే ఆయన దీనిపై సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ప్రస్తుతం తాను కెరీర్ మీద దృష్టి పెట్టానని, రాజకీయాల్లోకి వస్తే అది పూర్తిగా పాడవుతుందని వారితో చెప్పినట్లు సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. దింతోనే తారక్ ఎలాంటి రాజకీయ సమావేశాలకు సదస్సులకు కూడా హాజరు కాకుండా ఉన్నారు.
మళ్ళీ రాలేదు…
2009 ఎన్నికల్లో టిడిపి తరఫున బలంగా ప్రచారం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ను టిడిపి అభిమానులు అమితంగా ఆదరించారు. ఆయన ప్రసంగాలకు బ్రహ్మరథం పట్టారు. ఆ ఎన్నికల తర్వాత చంద్రబాబు జూనియర్ ను తన కొడుక్కి వారసత్వ ప్రమాదం అని గ్రహించి జూనియర్ ను పక్కన పెట్టారు. ముఖ్యంగా లోకేష్ కోసం తారక్ ను పార్టీకి దూరం చేశారని, అలాగే ఆయన నాన్న హరికృష్ణ సైతం చంద్రబాబు సరైన ప్రాధాన్యం ఇవ్వకుండా అవమానించారు అన్నది జూనియర్ క్యాంపు నుంచి వచ్చే విమర్శ. దీంతోనే తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో తన కుటుంబం నుంచి అక్క సుహాసిని కి చంద్రబాబు టికెట్ ఇచ్చినా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ప్రచారం సైతం చేయలేదు. సుహాసిని ఓడిపోతామని తెలిసి చంద్రబాబు బరిలోకి దించారు అన్నది కూడా జూనియర్ ఎన్టీఆర్ వర్గం నుంచి వచ్చిన విమర్శ. దీంతో సన్నిహితులు కొందరు రాజకీయ విశ్లేషకులు జూనియర్ ఎన్టీఆర్ కు తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టడానికి ప్రచారం చేయడానికి ఇది సరైన సమయం కాదని, సినిమాలు చేసుకుని ప్రస్తుతం సైలెంట్గా ఉండాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం లేనట్టే!
సరైన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టి, పార్టీకి మళ్లీ పునరుత్తేజం తీసుకువస్తారని ప్రస్తుత పరిస్థితుల్లో అది అత్యవసరమని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ను ఎదుర్కోలేక, ఆయన మాస్ ఇమేజ్ ను తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ నానాటికీ పతనమవుతోంది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీడీపీ పరిస్థితి దిగజారి పోయినట్లు స్పష్టంగా కనిపించింది. ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ వచ్చి పార్టీని టేక్ అప్ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుందని, ఆయన ఇమేజ్, ప్రసంగాలకు మంచి స్పందన వస్తుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. అయితే దీని మీద జూనియర్ ఎన్టీఆర్ శనివారం ఒక స్పష్టత ఇచ్చి నట్లే ఆయన మాటల్లో అర్థమయింది. ఇప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు గానీ రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని లేదని చెప్పకనే చెప్పారు. ఈ మాటతో వారంతం దిగలుగా తెలుగు తమ్ముళ్లను పలకరించి నట్టు అయింది.
Also Read : రాజకీయాల్లోకి రాక.. క్లారిటీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్