Idream media
Idream media
అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలడంతో కృష్ణా జిల్లా గొల్లపూడిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మంత్రి కొడాలి నాని, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుల మధ్య జరిగిన సవాళ్లు, ప్రతి సవాళ్లతో గొల్లపూడిలో ఈ రోజు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్టీ రామారావు విగ్రహం వద్ద దీక్ష చేసేందుకు టీడీపీ, వైసీపీ నేతలు సిద్ధం కావడంతో ఈ రోజు ఉదయం నుంచి గొల్లపూడిలో సెక్షన్ 144, సెక్షన్ 30ని అమలు చేశారు. దీక్షలకు అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు.
దేవినేని అరెస్ట్..
సీఎం వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే.. తన చేతిలో దెబ్బలు తప్పవని మంత్రి కొడాలి నాని మాజీ మంత్రి దేవినేని ఉమాను ఉద్దేశించి సోమవారం గొల్లపూడిలో వ్యాఖ్యానించారు. కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా.. ఈ రోజు గొల్లపూడిలోని ఎన్‌టీఆర్ విగ్రహం వద్ద దీక్ష చేస్తానని దేవినేని ఉమా ప్రకటించారు. ఇరు వర్గాలు పోటాపోటీగా దీక్షలకు దిగితే శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని భావించిన పోలీసులు అనుమతి నిరాకరించారు. దేవినేని ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినా.. దేవినేని ఉమా తలకు క్యాప్, మొహానికి మాస్క్ పెట్టుకుని బయటకు వచ్చారు. పోలీసుల కళ్లుగప్పి ఎన్‌టీఆర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు. గుర్తుపట్టిన పోలీసులు దేవినేని అదుపులోకి తీసుకున్నారు. పోటా పోటీగా ఇరు పార్టీలు దీక్షలకు దిగడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు, దేవినేని అక్కడ నుంచి తరలించే సమయంలో టీడీపీ మహిళా కార్యర్తలు పోలీసు వాహనానికి అడ్డుపడి హంగామా సృష్టించారు.
ఉమా కౌంటర్.. కొడాలి ఎన్‌కౌంటర్..
ప్రభుత్వంపై, సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తూ దేవినేని ఉమా మహేశ్వరరావు నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. సంక్షేమ పథకమైనా, అభివృద్ధి పని అయినా.. ఉమా విమర్శలు సర్వసాధారణంగా సాగుతున్నాయి. సాధారణంగానే దూకుడుగా ఉండే మంత్రి కొడాలి నానికి దేవినేని ఉమా వైఖరి మరింత చిర్రెత్తేలా చేసింది. సీఎం జగన్‌ను ఉద్దేశించి దేవినేని ఉమా విమర్శలు, అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతిసారి విమర్శలపై చర్చకు రావాలంటూ సదరు మాజీ మంత్రికి, కొడాలి ఫోన్ చేస్తున్నా స్పందన కరువైంది. ఈ క్రమంలోనే నిన్న దేవినేని సొంత గ్రామంలో గట్టి కౌంటర్‌ను కొడాలి ఇచ్చారు. దేవినేని దీక్ష చేస్తానని చెప్పిన తర్వాత ఓ టీవీ ఛానెల్‌తో కొడాలి నాని మాట్లాడుతూ..పోలీసులు అనుమతి ఇవ్వరని తెలిసే ఉమా దీక్ష పేరుతో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు ఎవరు,.? ఎంత మేర అమలు చేశారో టీవీ ఛానెల్ వేదికగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. సదరు న్యూస్ ఛానెల్‌తో మాట్లాడుతూనే.. దేవినేని ఉమాకు ఫోన్ చేశారు. కానీ దేవినేని స్పందించలేదు. ఇది మొదటి సారి కాదని, తమ ప్రభుత్వరం, సీఎం జగన్‌పై దేవినేని ఉమా అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రతి సారి కాల్ చేశానని, కానీ తీయడంలేదని కొడాలి అసలు విషయం చెప్పారు. దేవినేనికి కాల్ చేస్తున్న విషయం కొడాలి బహిరంగంగా చెప్పడం, లైవ్‌లోనే కాల్ చేయడం, దేవినేని కాల్ లిఫ్ట్ చేయకపోవడం వంటి పరిణామాలు.. దేవినేని ఉమా ఇమేజ్‌ను సవాల్ చేసేలా ఉండడంతో తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయనే టాక్ నడుస్తోంది.