ఈటల భూ కబ్జా పర్వం సమాప్తం

తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌పై వచ్చిన భూ కబ్జా ఆరోపణల పర్వం పరిసమాప్తమైంది. సీఏం కేసీఆర్‌ సిఫార్సు మేరకు ఈటలను మంత్రివర్గం నుంచి బర్తఫర్‌ చేస్తూ గవర్నర్‌ తమిళసై ఉత్తర్వుల జారీ చేశారు. నిన్న ఈటెల నుంచి వైద్య ఆరోగ్యశాఖను తీసుకున్న కేసీఆర్‌.. ఈ రోజు ఆయన్ను ఏకంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయడం గమనార్హం.

మెదక్‌ జిల్లా మాసాపేట మండలం అచ్చంపేట వద్ద ఈటల రాజేందర్‌ ప్రభుత్వ భూములను ఆక్రమించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై విచారణ చేయాలని సీఎం కేసీఆర్‌ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం, టీఆర్‌ఎస్‌ సొంత ఛానెల్‌ టిన్యూస్‌లో రాజేందర్‌పై వ్యతిరేక కథనాలు రావడంతో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయనే సంకేతాలు వెలువడ్డాయి. భూ కబ్జా ఆరోపణలపై ఈ రోజు కలెక్టర్‌ ప్రాథమిక నివేదిక ఇచ్చారు. అందులో ఈటలపై వచ్చిన ఆరోపణలు వాస్తవమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం ఈటలను మంత్రివర్గం నుంచి తప్పిస్తూ కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు.

భూ కబ్జా ఆరోపణలు వచ్చిన తీరుతోనే.. మంత్రి పదవికి రాజీనామా చేయాలనే సంకేతాలను సీఎం కేసీఆర్‌ ఈటల రాజేందర్‌కు పంపారు. అయితే తానేమి తప్పు చేయలేదని, హైకోర్టు జడ్జితో విచారణ చేయించాలని ఈటల డిమాండ్‌ చేశారు. మంత్రి పదవి నుంచి తనకు తానే తప్పుకునేలా రాజేందర్‌ శాఖను కేసీఆర్‌ తీసుకున్నా.. ఈటల రాజీనామా చేయలేదు. తాను రాజీనామా చేయబోనని తేల్చి చెప్పారు. రాజీనామా చేస్తే ఆరోపణలకు బలం చేకూర్చినట్లుంటుందనే భావనలో రాజేందర్‌.. బర్తరఫ్‌ చేస్తే తనకు వ్యతిరేకత, రాజేందర్‌కు సానుభూతి వస్తుందని కేసీఆర్‌ భావించినట్లు పరిణామాల ద్వారా అర్థమవుతోంది. అయితే చివరకు బర్తరఫ్‌ ద్వారానే ఈటల కథను సీఎం కేసీఆర్‌ ముగించారు.

తనను మంత్రివర్గం నుంచి తొలగిస్తారని ముందే అంచనాకు వచ్చిన ఈటల రాజేందర్‌.. తన భవిష్యత్‌ కార్యచరణపై నియోజకవర్గ ప్రజలతో, తన అనుచరులతో చర్చిస్తానని నిన్ననే ప్రకటించారు. తాజాగా మంత్రివర్గం నుంచి తొలగించడంతో ఈటల పయనం ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది. టి.రాజయ్య మాదిరిగా.. ఎమ్మెల్యేగా ఉంటూ.. టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతారా..? లేదా..? ఎమ్మెల్యే పదవికి, టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళతారా..? కొత్త పార్టీ పెడతారా..? లేదా..? ఏదైనా పార్టీలో చేరతారా..? అనేది రాబోయే రోజుల్లో తేలిపోతుంది.

Also Read : ఈటెల మాజీ మంత్రి కాబోతున్నారా..?

Show comments