ఈటెల మాజీ మంత్రి కాబోతున్నారా..?

ఈటెల రాజేందర్‌… టీఆర్‌ఎస్‌లో ఆది నుంచి ఉన్న నేత. ఉద్యమంలోనూ, అసెంబ్లీలోనూ తెలంగాణవాణి బలంగా వినిపించిన నేత. కేసీఆర్‌కు కుడి భుజం లాంటి వారు. కేసీఆర్‌ తొలి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా, ఇప్పుడు వైద్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలోనూ, టీఆర్‌ఎస్‌ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలక పాత్ర పోషించిన ఈటెల ప్రస్థానం తుది దశకు వచ్చిందా..? ఆయనకు పొగ పెట్టి పంపబోతున్నారా..? అంటే జరుగుతున్న పరిణామాలు ద్వారా అవుననే సమాధానం వస్తోంది.

మంత్రి ఈటెల రాజేందర్‌ మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చం పేట గ్రామంలో 20 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించారని, 100 ఎకరాల దళితుల అసైన్మెంట్‌ భూములను బలవంతంగా కొనుగోలు చేసేంందుకు యత్నించారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. భార్య జమున, కుమారుడు నితిన్‌ పేరిట 100 ఎకరాల భూములను కొనుగోలు చేసేందుకు అనుచరుల ద్వారా దందా జరిపారని, ఆ భూములను రిజిస్ట్రేషన్‌ చేయాలని సబ్‌ రిజిస్ట్రార్‌పై ఒత్తిడి చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

తనకు వచ్చిన ఫిర్యాదుపై కేసీఆర్‌ స్పందించినట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఆరోపణలను నిగ్గుతేల్చాలని ఆయన సీఎస్‌ సోమేష్‌కుమార్‌ను ఆదేశించారు. కలెక్టర్‌ ద్వారా దర్యాప్తు జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరారు. అంతేకాకుండా విజిలెన్స్‌ డీజీ పూర్ణచంద్రరావును కూడా విచారణ జరపాల్సిందిగా కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు.

Also Read : నేడే నిర్ణయం : తెలంగాణలో రేపటి నుంచి పరిస్థితేంటి..?

ఈటెలకు చెందిన జామున హేచరీస్ కు పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి 20 ఎకరాలను తనకు కేటాయించాలని ఏడాదిన్నర క్రితం మెదక్‌ జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి, అడిషనల్‌ కలెక్టర్‌ నగేష్‌లపై ఒత్తిడి తెచ్చారు. నాటి కలెక్టర్‌ ధర్మారెడ్డి ప్రస్తుత ఉద్యోగ విరమణ చేశారు. నగేష్‌ మరో ప్రాంతంలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే వీరు నాడు ఈటెల తమతో జరిపిన సంభాషణను, చేసిన ఒత్తిడిని మీడియాకు వివరిస్తుండడంతోనే ఈటెల రాజేందర్‌ మంత్రి పదవికి ఎసరు వచ్చిందని తెలిసిపోతోంది. అచ్చెంపేటలోని బాధితుల ఆవేదనను, తాజా, మాజీ అధికారులు అభిప్రాయాలను ఇతర ఛానెళ్లతోపాటు టీఆర్‌ఎస్‌ సొంత ఛానెల్‌ టీన్యూస్‌లో ప్రముఖంగా ప్రసారం జరుగుతుండడం విశేషం. ఆరోగ్య మంత్రికి కబ్జా రోగం అంటూ టీ న్యూస్‌ ప్రత్యేక కథనాన్ని గంటల తరబడి ప్రసారం చేస్తుండడంతో ఈటెల పదవి ఊడడం ఖాయంగా కనిపిస్తోంది.

కొంత కాలంగా ఈటెల రాజేందర్‌కు, కేసీఆర్‌కు మధ్య కొంత గ్యాప్‌ వచ్చింది. పలు సందర్భాల్లో ఈటెల రాజేందర్‌ చేసిన వ్యాఖ్యలు కేసీఆర్‌తో ఉన్న గ్యాప్‌ను నిర్థారించాయి. తాను తెలంగాణ వాదినని, ఉద్యమ స్ఫూర్తి తనలో ఇంకా ఉందని, తన గొంతు ఎవరూ నొక్కలేరంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈటెల పార్టీ మారతారని, సొంతంగా పార్టీ పెడతారనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో గత కొంత కాలంగా జరుగుతోంది.

కారణాలు ఏమైనా.. ఈటెలను మాజీని చేయాలని గులాబీ దళపతి నిర్ణయించుకున్నట్లు తాజా పరిణామాలతో తెలుస్తోంది. అందుకే ఏడాదిన్నర క్రితం జరిగిన భూ భాగోతాన్ని ఇప్పుడు వెలుగులోకి తెచ్చారు. పైగా.. బాధితులతోపాటు అధికారులు కూడా మంత్రికి వ్యతిరేకంగా మాట్లాడడం ఇక్కడ గమనించాల్సిన విషయం. అవినీతి ఆరోపణలు వెలుగులోకి తెచ్చి.. ఈటెలను సాగనంపే ప్లాన్‌ నడిచిందనేది కాదలేని సత్యం.

గతంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన టి. రాజయ్యపై కూడా అవినీతి ఆరోపణలు రావడం. ఆ వెంటనే ఆయన్ను మంత్రి పదవి నుంచి తొలగించడం చకచకా జరిగిపోయాయి. రాజయ్యను రాజీనామా కోరని కేసీఆర్‌.. మంత్రి పదవి నుంచి తప్పించాలని గవర్నర్‌కు సిఫార్సు చేశారు. మరి ఈటెల రాజేందర్‌ను రాజీనామా కోరతారా..? లేక అవమానకరరీతిలో తప్పిస్తూ నిర్ణయం తీసుకుంటారా..? వేచి చూడాలి.

Also Read : ప్రైవేటీకరణ ఫలితమిది.. ఇకనైనా మేల్కొంటారా..?

Show comments