రాజ్యసభ ఎన్నికలకు ముహూర్తం ఖరారు

కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడ్డ రాజ్యసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ముహూర్తం ఖరారు చేసింది. ఎన్నికలు అనివార్యమైన 18 స్థానాలకు ఈ నెల 19వ తేదీన ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల సంఘం నిర్ణయించింది. 19వ తేదీ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఓటింగ్‌ పక్రియ జరిపి, ఆ వెంటనే కౌంటింగ్‌ కూడా చేపట్టనున్నారు.

మార్చి 6వ తేదీన రాజ్యసభలో ఖాళీ అయ్యే 55 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నెల 16వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరించింది. మార్చి 26వ తేదీన ఎన్నికలు జరపాలని నిర్ణయించింది. అయితే కరోనా వైరస్‌ కట్టడి కోసం మార్చి 25వ తేదీ నుంచి దేశంలో లాక్‌డౌన్‌ విధించడంతో ఆ పక్రియ పోలింగ్‌ వద్ద ఆగిపోయింది.

55 స్థానాలకు గాను 37 స్థానాలు ఏకగ్రీవం కాగా మరో 18 స్థానాలకు పోటీ నెలకొని ఉండడంతో పోలింగ్‌ అనివార్యమైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్‌లలో 4 చొప్పున, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో మూడు చొప్పున స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఝార్ఖాండ్‌లో రెండు సీట్టు, మణిపూర్, మేఘాలయాల్లో ఒక్కొక్కటి చొప్పున రాజ్యసభ స్థానాలకు ఈ నెల 19వ తేదీన పోలింగ్‌ జరగనుంది.

Show comments