టీడీపీకి బీజేపీ భయం పట్టుకుందా..?

తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భయం పట్టుకుందా..? తమ స్థానం బీజేపీ లాక్కుంటుందేమోనన్న భయం టీడీపీ నేతలను వెంటాడుతోందా..? అంటే అవుననేలా టీడీపీ తీరు ఉంది. ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు బీజేపీ ప్రణాళికలు రచించింది. ఈ క్రమంలోనే ఆర్‌ఎస్‌ఎస్‌ వాది అయిన సోము వీర్రాజును పార్టీ అధ్యక్షుడుగా నియమించింది. బీజేపీలోకి వెళ్లిన టీడీపీ నేతల నోళ్లు సోము రాకతో మూతపడ్డాయి. నిన్న మొన్నటి వరకు బీజేపీని తన తోక పార్టీగా పెట్టుకున్న తెలుగుదేశం పార్టీకి బీజేపీ సొంతంగా ఎదగడం ఏ మాత్రం రుచించడంలేదు. ఈ పరిణామం తమ కొంప ముంచుతుందని టీడీపీ నేతలు ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలోనే బీజేపీని లక్ష్యంగా చేసుకున్నారని తాజాగా కమలం పార్టీ నేతలు చేసిన ఫిర్యాదుతో తెలుస్తోంది.

టీడీపీ నేతలు తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు విజయవాడ క్రైం బ్రాంచి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిషన్‌ ఆంధ్రప్రదేశ్‌ అనే వాట్స్‌ప్‌ గ్రూపు ద్వారా టీడీపీ నేతలు తమ పార్టీకి నష్టం చేకూర్చేలా పోస్టులు రాస్తున్నారని బీజేపీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి పాలూరి శ్రీనివాసుల రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్‌ మీడియాలో తరచూ తమ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆయన పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటనతో తెలుగుదేశం పార్టీ నేతలు బీజేపీ పట్ల ఎలా వ్యవహరిస్తున్నారన్నది స్పష్టమవుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లో 2009లో మినహా మిగతా అన్ని ఎన్నికల్లోనూ ద్విముఖ పోటీనే నడిచింది. బీజేపీ ఆది నుంచి ఏపీలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. ఈ క్రమంలో బీజేపీ బలం టీడీపీకి మేలు చేసింది. బీజేపీ వల్ల లాభం ఉందనుకున్నప్పడు మాత్రమే టీడీపీ ఆ పార్టీతో కలసి ఎన్నికలకు వెళ్లింది. నష్టం జరుగుతుందని భావించిన సమయంలో పొత్తు తెంచేసుకుంది. అయితే మోడీ, అమిత్‌ షా ద్వయంలోకి బీజేపీ పగ్గాలు వచ్చిన తర్వాత ఆ పార్టీ పనితీరు, లక్ష్యాలు మారిపోయాయి. దక్షిణ భారత దేశంలోనూ పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో కొన్నేళ్లుగా మోడీ, షా ద్వయం ప్రణాళికలు రచిస్తోంది. సరైన సమయం కోసం వేచి చూస్తున్నారు.

గడిచిన ఎన్నికల్లో ఏపీలో టీడీపీ ఘోర ఓటమి పాలవ్వడంతో బీజేపీ పెద్దలు తమ వ్యూహాన్ని ఏపీలో అమలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే సోము వీర్రాజును పార్టీ అధ్యక్షుడుగా నియమించారు. నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అందులో టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన వారు, టీడీపీ లైన్‌కు అనుగుణంగా మాట్లాడేవారికి చోటు కల్పించకపోవడం బీజేపీ తీరుకు అద్దం పడుతోంది. బీజేపీ నేతలు కూడా.. ఏపీలోతమ లక్ష్యాలు ఏమిటో బహిరంగంగా ప్రకటించారు. ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని, దాన్ని బీజేపీ భర్తి చేస్తుందని, 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ప్రకటించారు. ఈ ప్రకటనలే టీడీపీ నేతలకు వణుకుపుట్టిస్తున్నాయి. అందుకే బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

Show comments