మళ్ళీ స్థానిక రగడ!

  • Published - 02:28 AM, Sat - 9 January 21
మళ్ళీ స్థానిక రగడ!

నో డౌట్…ఎన్నికల నిర్వహణ బాధ్యత ఎస్ఈసీదే..అదే నండి నిమ్మగడ్డదే.. అందుకు సహకరించాల్సిన బాధ్యత జగన్ సర్కార్ ది.. ఇది రెండు రాజ్యాంగ వ్యవస్థలు అంటే రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ మధ్య సామరస్యంగా సాగాల్సిన వ్యవహారం.. అలాంటి ఏపీలో మాత్రం దేశంలో ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య రగడ సాగుతోంది. అది చిలికి చిలికి గాలివానై కోర్టుమెట్లెక్కింది.. ఎందుకు? ఆ విషయం అందరికి తెలిసిందే.. కేవలం ఎస్ ఈసీ నిమ్మగడ్డ గత ఏడాది మార్చిలో స్థానిక నోటిఫికేషన్ విడుదల చేసి,నామినేషన్ల పర్వం ముగిసి,ఏక గ్రీవాలు అధికంగా అదికార పార్టీ ఖాతాలో పడ్డ తర్వాత కరోనా సాకుతో స్థానికి ఎన్నికలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే.అదుగో అక్కడ మొదలైంది అటు నిమ్మగడ్డకు,ఇటు ఏపీ సర్కార్ కు మధ్య రగడ. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ మరో సారి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను తిరిగి ప్రారంభించాలన్న సుప్రీంకోర్టు తీర్పును తోసిరాజని గ్రామ పంచాయతీ ఎన్నికలను నాలుగు దశల్లో నిర్వహించేందుకు షెడ్యూల్‌ జారీ చేశారు.

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ సంచలనాత్మక రీతిలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు.

హైకోర్టు సూచనల మేరకు రాష్ట్ర సీఎస్ ఆదిత్యనాథ్, ఇతర అధికారులు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో జరిపిన చర్చలు ఏమాత్రం ఫలప్రదం కాలేదు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేమని సీఎస్ స్పష్టం చేసినప్పటికీ నిమ్మగడ్డ వాటిని పరిగణనలోకి తీసుకున్న దాఖలాలు లేవు. నిమ్మగడ్డ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు ఉంటాయి. ఈ నెల 23, 27, 31, ఫిబ్రవరి 4వ తేదీన వరుసగా ఒక్కో దశకు సంబంధించి నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. ఆపై, ఫిబ్రవరి 5, 7, 9, 17న దశల వారీగా ఎన్నికలు నిర్వహిస్తారు. చివరి దశ పోలింగ్ రోజునే సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది.

మరోవైపు.. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకాల మేరకు కరోనా మహమ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు భారీ ఎత్తున వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని చేపట్టామని, వైద్యారోగ్యశాఖ, పంచాయతీరాజ్‌ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని, ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకూ పంచాయతీ ఎన్నికలను వాయిదా వేయాలని విప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.రాష్ట్రంలో కేవలం ఒకే ఒక్క కోవిడ్‌ కేసు నమోదైనప్పుడు దాన్ని కారణంగా చూపించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏమాత్రం సంప్రదించకుండా ఎంపీటీసీ, జడ్పీటీసీ, పురపాలక ఎన్నికల ప్రక్రియను అర్ధాంతరంగా నిలిపివేస్తూ గతేడాది మార్చి 15న ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసిన నిమ్మగడ్డ తాజాగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాల్లో అధికార యంత్రాంగం అంతా తీరిక లేకుండా ఉన్న తరుణంలో పంచాయితీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేయడం సర్కార్ తో కయ్యానికి కాలు దువ్వడమే కదా?

ఇంకోవైపు.. కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు అధికార యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంలో అటు కేంద్రం.. ఇటు రాష్ట్ర ప్రభుత్వం నిమగ్నమయ్యాయి. దీనిపై ఈనెల 9న కేంద్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఈనెల 11న సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ వ్యాక్సినేషన్‌పై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 13 వరకూ ఉన్నతాధికారులు వ్యాక్సినేషన్‌ సన్నద్ధత కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటారు, అప్పటివరకూ సమావేశాన్ని వాయిదా వేయాలని ఎస్‌ఈసీని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరినట్లు సమాచారం. కానీ దీన్ని పరిగణలోకి తీసుకోకుండా సంప్రదింపులకు హాజరు కావాలని, లేదంటే తదుపరి నిర్ణయాన్ని తీసుకుంటానని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఏకపక్షంగా తన విధానాన్ని వెల్లడించిట్లు తెలుస్తోంది. అయితే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు ఆదేశాలకు భిన్నంగా ఏకపక్షంగా పంచాయతీ ఎన్నికల షెడ్యూలు జారీ చేయడం గమనార్హం.

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఘట్టం ముగిశాక, పురపాలక ఎన్నికల్లో నామినేషన్‌ స్వీకరణ ప్రక్రియ ముగిశాక కరోనా సాకుతో మార్చి 15న అర్ధాంతరంగా ఆ ఎన్నికలను నిమ్మగడ్డ వాయిదా వేశారు. ఆ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయకుండా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు షెడ్యూలు విడుదల చేయడం గమనార్హం. అంటే ఏదో విధంగా సర్కార్ పై తనదే పైచేయి అని నిరూపించుకోవాలన్న ఆలోచన తప్ప మరోటి కాదని పరిశీలకులు వ్యాక్యానిస్తున్నారు.

మరోవైపు..నోటిఫికేషన్ విడుదలచేసిన సందర్భంగా ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాట్లాడుతూ, కరోనా సెకండ్ వేవ్ ను సాకుగా చూపుతూ రాష్ట్ర సర్కారు స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలనుకుంటోందని, కరోనాతో తీవ్రస్థాయిలో ప్రభావితమైన అమెరికాలోనే ఎన్నికలు నిర్వహించారని ఆయన గుర్తు చేశారు. మన రాష్ట్రంలో అంతటి దారుణమైన పరిస్థితులు లేవని నిమ్మగడ్డ స్పష్టం చేశారు. అంటే అమెరికాలో కరోనా తీవ్ర ప్రభావితైనా అమెరికాలో ఎన్నికల నిర్వహిస్తే..మనదగ్గర ఎందుకు నిర్వహించకూడదనేది నిమ్మగడ్డ వాదన. అదే నిమ్మగడ్డ ఉద్దేశ్యమైతే గత మార్చిలో ఎందుకు ఎన్నికలను వాయిదా వేసినట్లు..అందుకు కరోనాను ఎందుకు సాకుగా చూపినట్లు..అదీ ఏకగ్రీవాలు అధికార పార్టీకి ఎక్కువగా లభించాయన్న రిజల్టు వచ్చిన తర్వాత…అంటే అందులో నిమ్మగడ్డకు ఇంకేదో ప్రయోజనం ఉన్నట్లేకదా..ఇప్పడు రాష్ట్రంలో విగ్రహాల విధ్వంసం రగడ సాగుతోంది.. ప్రతిపక్షాలు ఆందోలనలు చేపడుతున్నాయి.. అలాంటి సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలను కోవడం అంటే ప్రతిపక్షాలకు మేలు చేయాలనే ఉద్దేశ్యం నిమ్మగడ్డకు ఉన్నట్లే కదా?

Show comments