డిస్నీ హాట్ స్టార్ సూపర్ ప్లాన్

కార్పొరేట్ సంస్థలు ఓటిటి బిజినెస్ ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. కరోనా టైంలో వీటికి విపరీతమైన ఆదరణ పెరిగిపోయింది. జనం బాగా అలవాటు పడ్డారు. ఇప్పటికి లాక్ డౌన్ వల్ల ఎవరి పనుల్లో వారు బిజీ అయినా టైం దొరికినప్పుడంతా ప్రేక్షకులు ఫోన్ లోనో స్మార్ట్ టీవీలోనో వినోదాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇదో బంగారు బాతులా మారడం ఖాయమని విశ్లేషకుల అంచనా. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ ఈ రంగంలో ఆధిపత్యం చెలాయిస్తుండగా డిస్నీతో టై అప్ చేసుకున్న హాట్ స్టార్ భారీ ప్లాన్స్ తో మెగా కంటెంట్ వైపు దృష్టి పెడుతోంది. స్టార్ హీరోల సినిమాలను మతులు పోయే రేట్లకు కొంటూ షాక్ కు గురిచేస్తోంది. అంతే కాదు వెబ్ సిరీస్ లను సైతం అద్భుతమైన క్వాలిటీతో రూపొందిస్తూ బడ్జెట్ విషయంలో నో కాంప్రోమైజ్ అంటోంది.

తాజాగా ఒకే చోట ప్రొడక్షన్ ని కేంద్రీకరించే ఉద్దేశంతో హైదరాబాద్ లోని ఓ సుప్రసిద్ధ ఫిలిం సిటీని గంపగుత్తగా మూడేళ్ళకు లీజుకు తీసుకునే ప్రతిపాదనను సదరు మేనేజ్ మెంట్ ముందు ఉంచిందట. వందల ఎకరాల్లో విస్తరించబడిన ఫిలిం సిటీలో నిత్యం షూటింగులు జరుగుతూ ఉంటాయి. ఇకపై విదేశాల్లో షూట్ కష్టమవుతున్న నేపథ్యంలో ఎందరో నిర్మాతలు ముందుగానే తమకు కావాల్సిన టైంకి బుక్ చేసుకున్నారు కూడా. అయితే డిస్నీ స్టార్ నిజంగా అంత భారీ పెట్టుబడి పెట్టడం వెనుక కారణం మాత్రం అంతు చిక్కడం లేదు. ఇంటర్నేషనల్ ఆడియన్స్ కు సరిపోయే కంటెంట్ ని సైతం ఇక్కడే రూపొందిస్తే బాగానే వర్కవుట్ చేసుకోవచ్చు. ఒక్క సినిమాకే డిజిటల్ హక్కుల కోసం 150 కోట్ల డీల్ చేసుకున్న హాట్ స్టార్ కు ఇలా ఫిలిం సిటీలను లాంగ్ టైంకి అద్దెకు తీసుకోవడంలో ఆశ్చర్యం లేదు.

కాకపోతే ఇది నిజంగానే జరిగితే స్థానిక నిర్మాతలకు ఇబ్బందులు తప్పవు.చిన్నా పెద్ద తేడా లేకుండా అన్ని సినిమాల కార్యక్రమాలు ఇక్కడ నిత్యం జరుగుతూ ఉంటాయి. ఒకవేళ డిస్నీ అన్నంత పని చేస్తే సదరు ఫిలిం సిటీతో అవసరం ఉన్న వాళ్ళు హాట్ స్టార్ దగ్గరే ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా అధికారికంగా తెలిసింది కాకపోయినా టాక్ అయితే జోరుగా ఉంది. మొత్తానికి ఓటిటి రంగం రాబోయే కాలంలో సినిమాకు గట్టి పోటీ ఇచ్చేలా ఉంది. రవిబాబు లాంటి దర్శకులు సైతం ఓటిటి మద్దతుగా కామెంట్స్ చేయడం చూస్తే ఇకపై ఇష్టం వచ్చిన కథలతో తోచినట్టు సినిమాలు తీస్తామంటే కుదరదేమో. ఒకటికి పదిసార్లు శల్యపరీక్ష చేస్తే తప్ప సెట్ పైకి వెళ్లే పరిస్థితి ఉండకపోవచ్చు.

Show comments