కొండను తవ్వి ఎలుకను పట్టి.. ఏనుగును పట్టానని ఐటీ చెప్పిందంటారా..? దేవినేని ఉమా..

  • Published - 11:36 AM, Fri - 14 February 20
కొండను తవ్వి ఎలుకను పట్టి.. ఏనుగును పట్టానని ఐటీ చెప్పిందంటారా..? దేవినేని ఉమా..

మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ వ్యక్తిగతకార్యదర్శి(పీఎస్‌) ఇంట్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించి రెండు వేల కోట్ల రూపాయల అవినీతి, అక్రమాలు జరిగిందని, అందుకు సంబంధించిన ఆధారాలు సేకరించామని ఐటీ శాఖ చేసిన ప్రకటనకు భిన్నంగా తెలుగుదేశం పార్టీ నేత, ఇరిగేషన్‌ శాఖ మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు కొత్త లెక్కలు చెప్పారు. సోదాలు అనంతరం ఐటీ శాఖ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తమ పార్టీని కానీ, తమ పార్టీ అధినేత చంద్రబాబు గానీ ఎక్కడైనా ప్రస్తావించిందా..? అంటూ మీడియా సమావేశంలో ప్రశ్నించారు.

చంద్రబాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో రెండు లక్షల నగదు, 12 తులాల బంగారం మాత్రమే ఐటీ అధికారులు గుర్తించారని దేవినేని ఉమా చెప్పుకొచ్చారు. ఐటీ శాఖ స్వయంగా విడుదల చేసిన ప్రకటనలో.. 85 లక్షల రూపాయల నగదు, 71 లక్షల రూపాయల విలువైన బంగారం సీజ్‌ చేశామని తెలిపింది. కానీ దేవినేని ఉమా మాత్రం అందుకు భిన్నంగా చెబుతుండడంతో ఐటీ శాఖ ఆరు రోజుల పాటు 24 గంటలూ సోదాలు చేసి గుర్తించింది ఇంతేనా..? అన్న సందేహం కలుగుతోంది. కొండను తవ్వి ఎలుకను పట్టిందన్న చందంగా.. ఐటీ శాఖ ఆరు రోజులపాటు ఏదో కాలక్షేపానికి సెంట్రల్‌ రిజర్వ్‌ ఫోర్స్‌ భద్రతతో శ్రీనివాస్‌ ఇంట్లో సోదాలు నిర్వహించినట్లుగా దేవినేని మాటల్లో అర్థమవుతోంది.

ఇక ఐటీ శాఖ ప్రకటనలో తమ పార్టీ పేరుగానీ, తమ నాయకుడు చంద్రబాబు పేరు గానీ లేకుండా వారిపై దుష్ప్రచారం ఎలా చేస్తారంటూ మండిపడ్డారు. ఐటీ శాఖ తన ప్రకటనలో.. ప్రముఖ వ్యక్తి మాజీ పర్సనల్‌ సెక్రటరీ (పీఎస్‌) అన్ని స్పష్టంగా రాసింది. చంద్రబాబుకు పీఎస్‌గా శ్రీనివాస్‌ పని చేశారనీ దేవినేని కూడా చెబుతున్నారు. అయినా తమ పార్టీ అధినేత చంద్రబాబుకు ఈ సోదాలకు ఏంటి సంబంధం అంటూ చిర్రుబుర్రులాడుతున్నారు. పైగా చంద్రబాబు పేరు లేదు కదా.. అంటూ దేవినేని ఉమా వేసిన తర్కానికి రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. 

Show comments