Idream media
Idream media
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు విధించిన లాక్ డౌన్ వల్ల దేశ ఆర్థిక వృద్ధి తిరోగమనంలో పట్టకుండా ఆర్బిఐ ఉద్దీపన చర్యలు ప్రకటించింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల వద్ద నగదు నిల్వలు ఎక్కువగా ఉండేటట్లు పలు చర్యలు చేపట్టింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం ఆర్.బి.ఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఉద్దీపన చర్యలను వెల్లడించారు.
రివర్స్ రెపో రేటును మరోసారి తగ్గించారు. ప్రస్తుతమున్న నాలుగు శాతం నుంచి 3.75 శాతానికి తగ్గించింది. నాబార్డు 25 వేల కోట్ల రూపాయలు, సూక్ష్మ ఆర్థిక సంస్థలకు 50 వేల కోట్లు, జాతీయ హౌసింగ్ బ్యాంకు 10 వేల కోట్ల రూపాయలను కేటాయించింది. బ్యాంకుల వద్ద నగదు నిల్వలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొంది. విపత్కర కాలంలో బ్యాంకు సేవలు హర్షణీయమని కొనియాడింది. దేశవ్యాప్తంగా 91 శాతం ఏటీఎంలు పనిచేస్తున్నాయని వెల్లడించింది.
ఈ ఆర్థిక ఏడాదిలో భారత వృద్ధిరేటు 1.9 శాతం మేర ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసిందని ఆర్బీఐ తెలిపింది. వచ్చే ఆర్థిక ఏడాది 2021 – 22 లో భారత వృద్ధిరేటు 7.4 శాతం ఉంటుందని అంచనా వేసింది. కరోనా వైరస్ వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు 9 ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపింది. దేశ జి.డి.పి లో 3.2 శాతం మేర ద్రవ్య నిల్వలను మార్కెట్లోకి తెచ్చినట్లు పేర్కొంది. దేశ వ్యాప్తంగా విద్యుత్ వినియోగం భారీగా పడిపోయిందని తెలిపింది. లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటి నుంచి 1.2 లక్షల కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది.
ప్రపంచ మానవాళి అతిపెద్ద మహమ్మరిని ఎదుర్కొంటోందని ఆర్బీఐ పేర్కొంది. వ్యాపార, వాణిజ్య సేవలన్నీ నిలిచిపోయాయని తెలిపింది. ఖరీఫ్ లో ధాన్యం ఉత్పత్తి 36 శాతం మేర పెరిగిందని ఆర్.బి.ఐ తెలిపింది. సెప్టెంబర్ 30 వరకు మారటోరియం అమలవుతుందని అమలులో ఉంటుందని పేర్కొంది. జి- 20 దేశాల్లో భారత్ వృద్ధి ఆశాజనకంగా ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ని ఎప్పటికప్పుడు సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.