పార్టీ మారనని బాండ్‌ రాసిస్తే టిక్కెట్‌ – జాతీయ పార్టీ సరికొత్త విధానం

పార్టీ ఫిరాయింపుల బాధిత పార్టీ అనేది దేశంలో ఏదీ లేదంటే అతిశయోక్తి కాదు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, ప్రాంతీయ పార్టీలైన ఎన్‌సీపీ, ఎస్‌పీ, వైఎస్సార్‌సీపీ, టీడీపీ, టీఆర్‌ఎస్, టీఎంసీ.. ఇలా చెప్పుకుంటే పోతే దేశంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ కనీసం ఒక్కసారైనా ఫిరాయింపులను చవిచూసింది. ఈ ఫిరాయింపుల వల్ల కొన్ని పార్టీల ఉనికే ప్రశ్నార్థకంగా మారిన సందర్భాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కీలక భూమి పోషించిన తెలుగుదేశం పార్టీ ఈ ఫిరాయింపుల వల్ల తెలంగాణలో తన ఉనికినే కోల్పోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం తాము ఉన్నామంటూ ఎదో హడావుడి చేయాల్సిన పరిస్థితి టీడీపీకి పట్టింది.

ప్రతిపక్ష పార్టీలు తమ ప్రజా ప్రతినిధులను అధికార పార్టీలోకి వెళ్లకుండా నిరోధించేందుకు ప్రస్తుతం ఉన్న ఫిరాయింపుల చట్టం ఏ మాత్రం ఉపయోగపడడంలేదు. నేతలు కూడా భారీగా ఖర్చు చేసి ఎన్నికల్లో గెలుస్తుండడంతో తిరిగి సంపాధించుకోవడానికి అధికార పార్టీలోకి జంప్‌ చేస్తున్నారు. దీనికి అభివృద్ధి కోసం అంటూ ట్యాగ్‌ లైన్‌ తగిలిస్తున్నారు. ఇది ప్రజల అభివృద్ధా..? నేతల అభివృద్ధా..? అనేది అందరికీ తెలిసిన విషయమే.

ప్రస్తుతం తెలంగాణాలో పురపాలక ఎన్నికల హాడావుడి మొదలైంది. రిజర్వేషన్లు ఖరారు కావాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయితే ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్‌ రావచ్చని భావిస్తున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఏఐఎంఐఎం తదితర పార్టీలు ఎన్నికల రంగంలోకి దూకాయి. పార్టీ కార్యాకర్తలో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాయి. కౌన్సిలర్, కార్పొరేటర్‌ సీట్ల కోసం అన్ని పార్టీల్లోనూ పోటీ ఎక్కువగా ఉంది. నేతలు తమ సొంత బలంతో గెలవచ్చని ధీమాతో పార్టీ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్రంలో 13 కార్పొరేషన్లు, 128 మున్సిపాలిటీలున్నాయి. వీటిల్లో వీలైనంత మేర పాగా వేయాలని ఆయా పార్టీలు ప్లాన్లు వేస్తున్నాయి. ఇందులో భాగంగా బలమైన అభ్యర్థులకు టికెట్లు కేటాయించడంతోపాటు గెలిచిన తర్వాత వారిని కాపాడుకునేందుకు కూడా సరికొత్త పంథాను అవలింభిస్తున్నాయి.

తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ నుంచి ఎన్నికల అనంతరం తమ పార్టీ నుంచి గెలిచిన వారిని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ నూతన విధానం అమలు చేయాలని నిర్ణయించింది. పార్టీ టిక్కెట్‌ కావాలనుకునేవారు బీఫాం తీసుకునే సమయంలో గెలిచిన తర్వాత పార్టీ మారబోనని ప్రమానపత్రం రాసి ఇవ్వాలి. అంతేకాదు ప్రామిసరీ నోటు, స్టాంప్‌ పేపర్‌పై ప్రమాణం చేస్తూ పార్టీ మారితే తన సభ్యత్వం కూడా పోయినట్లుగా నిర్థారిస్తూ రాసి ఇవ్వాలి. ఇలా ఇచ్చిన వారికే టికెట్లు ఇస్తామని కాంగ్రెస్‌ పార్టీ చెప్పింది.

కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయానికి ఆ పార్టీ కార్యకర్తల నుంచి మద్దతు లభిస్తుండగా సీటు కోసం పోటీ పడే అభ్యర్థులను మాత్రం సందిగ్ధంలో పడేసింది. ఎన్నికల్లో పోటీ అంటే ఖర్చుతో కూడుకున్నది. తాము గెలిచినా సంబంధిత మున్సిపాలిటీ, కార్పొరేషన్‌లో పార్టీ అధికారంలోకి రాకపోతే ఐదేళ్లపాటు ఆకాశంవైపు చూడాలి తప్పా తమకు ఒక్క పని కూడా కాదని వారు ఆలోచనలో ఉన్నారు. అలాంటప్పుడు పార్టీలోనే ఉండాలని రూలు పెడితే తమ పరిస్థితి ఏంటని వారు తమ అనునూయల వద్ద మథన పడుతున్నారు.

కాగా, 134 ఏళ్ల ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ తన ఉనికిని కాపాడుకునేందుకు అభ్యర్థుల నుంచి బాండ్లు, ప్రామిసరీ నోట్లు రాయించుకోవడంపై సర్వత్రా చర్చకు దారితీసింది. కాంగ్రెస్‌ అవలంభిస్తున్న ఈ విధానం ఫిరాయింపులను నిలువరిస్తుందా..? అన్నది ఎన్నికలు ముగిసిన వెంటనే తేలనుంది.

Show comments