వ్యాక్సిన్‌ పాలసీపై పునరాలోచించండి.. ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ

కోవిడ్‌ వ్యాక్సిన్‌ పాలసీలో ఉన్న లోపాలు, దాని వల్ల కలిగే నష్టాలపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి మరో లేఖ రాశారు. ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్‌లో 50 శాతం ప్రైవేటుకు విక్రయించేలా తీసుకున్న నిర్ణయం వల్ల ప్రస్తుత కోరత సమయంలో బ్లాక్‌ మార్కెట్‌ పెరగడంతోపాటు ధరలు విపరీతంగా పెంచుతారని పేర్కొన్నారు. ఓ పక్క వ్యాక్సిన్‌ కొరత అంటూనే ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్‌ వేసేందుకు అనుమతి ఇవ్వడం సరికాదన్నారు. వ్యాక్సిన్‌ కొరత కారణంగానే తాము 18 –44 ఏళ్ల వయస్సు వారికి వ్యాక్సిన్‌ వేయలేకపోతున్నామని తెలిపిన సీఎం వైఎస్‌ జగన్‌.. 45 ఏళ్ల వయస్సు వారికే వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమం చేపడుతున్నామని ఆ లేఖలో వివరించారు.

ప్రైవేటు ఆస్పత్రులలో ఒక డోసు 2 వేల రూపాయల నుంచి 25 వేల రూపాయల వరకు విక్రయిస్తున్నారని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. బ్లాక్‌ మార్కెట్‌ పెరగడం వల్ల దాన్ని నియంత్రించడం ప్రభుత్వాలకు కష్టతరంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉచితంగా లేదా నామమాత్రపు ధరలకు వ్యాక్సిన్‌ ఇవ్వాలని కోరారు. తమ రాష్ట్ర ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వాలనేది తమ విధానమని పేర్కొన్నారు. ప్రైవేటు ఆస్పత్రులకు వ్యాక్సిన్‌ వేసే అవకాశం ఇవ్వడం వల్ల పేదలకు వ్యాక్సిన్‌ అందే పరిస్థితి ఉండదన్నారు. సాధారణ ప్రజల నుంచి విమర్శలు వస్తున్నాయని గుర్తు చేశారు.

వ్యాక్సిన్‌ సరఫరా డిమాండ్‌కు మించి ఉన్నప్పుడు ప్రభుత్వంతోపాటు పైవేటు రంగంలోనూ వ్యాక్సిన్‌ అందించడం వల్ల సమస్య రాదని సీఎం జగన్‌ తన లేఖలో వివరించారు. తగినంత వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్నప్పుడు ధరలు ఎక్కువగా ఉండబోవన్నారు. ఈ సమయంలో ప్రజలు తమ ఆర్థిక పరిస్థితిని బట్టీ ఎక్కడ వ్యాక్సిన్‌ తీసుకోవాలనేది నిర్ణయించుకుంటారని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే చేపట్టాలని సీఎం జగన్‌ కోరారు. ఉత్పత్తి అయ్యే మొత్తం వ్యాక్సిన్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని సూచించారు. ఫలితంగా.. వ్యాక్సిన్‌ మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వారికి టీకా అందే అవకాశం ఉంటుందని ఆ లేఖలో సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు. కోవిడ్‌పై చేస్తున్న ఉమ్మడిపోరాటంలో రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి అందుతున్న సాయంపై సీఎం జగన్‌ ప్రధాని మోదీకి ధన్యావాదాలు తెలిపారు.

Also Read : పరిషత్‌ ఎన్నికలు మళ్లీ జరిగితే.. టీడీపీ పోటీ చేస్తదా..?

Show comments