Idream media
Idream media
నాయకులంతా స్లో మోషన్‌లో బయటకు వెళుతుంటే చంద్రబాబు ఒక శాలువా కప్పుకుని “ఎవరి కోసం ఎవరున్నారు! పోండిరా పోండి! మీ కాలం ఖర్మం కలిసొస్తేనే రండిరా రండి” అని పాత సినిమా పాట ఎత్తుకున్నాడు.
“పాట పాడితే , మారిపోయి తిరిగి రావడానికి ఇదేం మీ మామ ఎన్టీఆర్ సినిమా కాదు అన్నాడు” పీఏ.
“కాలం ఖర్మం కలిసొస్తేనే…”అని మళ్లీ సాంగ్ స్టార్ట్ చేశాడు బాబు. “వాళ్లకీ కాలం కలిసొచ్చింది, మీ ఖర్మ కాలింది అందుకే వెళ్లిపోయారు” అన్నాడు పీఏ.
“ఇది అన్యాయం కాదా?” అన్నాడు బాబు.
“కాంగ్రెస్ పార్టీ 1983లో కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు వదిలి వెళ్లలేదా”
“వెళ్లాను కాబట్టే సీఎం అయ్యాను”
“మామని పొడవడం వల్ల అయ్యారు. వెన్నుపోటు మీ పాస్‌వర్డ్ కదా”
“వెన్నుపోటు పొడిస్తేనే రాజకీయాల్లో పాస్ అయ్యేది” అన్నాడు బాబు.
“మీరు చేస్తే రాజకీయం. ఎదుటి వాడు చేస్తే ద్రోహం” అన్నాడు పీఏ.
“పార్టీని వాళ్లెందుకు వదిలిపోయారు”
“భవిష్యత్ లేదు కాబట్టి”
“నేనున్నాను కదా”
“మీరున్నారు కాబట్టే భవిష్యత్ లేదు”
“లోకేశ్ ఉన్నాడు కదా”
“తానే గెలవలేదు, రేపు వీళ్లని ఏం గెలిపిస్తాడు. అసలు మన పార్టీలో నాయకుల్ని మీరు ఎదగనిచ్చారా? లోకేశ్‌ని మంత్రి చేసి పెత్తనం ఇచ్చారు. తెలుగుకి తెగులుకి తేడా తెలియదు అతనికి. పార్టీని ముందుకు నడిపించే వాడు కావాలి కానీ, వెనక్కి నడిపించేవాడు దేనికి?”
“మళ్లీ మన టైం వస్తుంది. చూస్తూ ఉండు” ధీమాగా అన్నాడు బాబు.
“మీరు కొత్త వాచీ కొనుక్కున్నా టైం రాదు. టైం రావాలంటే జనంలో ఉండాలి. మీరు ఎప్పుడూ న్యూస్‌లో ఉంటారు. పేపర్లను నమ్ముకుని , అబద్ధాలతో రాజకీయాలు ఇంత కాలం చేశారు. ఇప్పుడు జనం మీ మాస్క్‌ని గుర్తు పట్టి మీరు పేపర్ టైగర్ అని కనిపెట్టారు. మీరు కరోనా వైరస్ లాంటి వారు. దగ్గినా, తుమ్మినా మీకు దూరంగా ఉండాలి. దాంట్లో కూడా రాజకీయం వెతకగలరు” అన్నాడు పీఏ.
“ఇంతకీ మనం స్థానిక ఎన్నికల్లో గెలుస్తామా? “
“గుర్రం ఎగురుతుందని వార్త రాయించవచ్చు కానీ, నిజంగా ఎగిరించలేం”
“జగన్‌తో రౌడీ రాజ్యం వస్తుంది”
“జగన్ ఎమ్మెల్యేలు ఎవరూ , మహిళా ఎమ్మార్వోని పట్టుకుని తన్నలేదు కాబట్టి మీరు చెప్పినా జనం నమ్మరు”
“పార్టీ మొత్తం ఖాళీ అయిపోయేలా ఉంది” దిగులుగా అన్నాడు బాబు.
“చేర్చుకుంటే మీరు కూడా వెళ్లిపోయేలా ఉన్నారే?” అన్నాడు పీఏ.
బాబు ఈ సారి “ఎవరి కోసం, ఎవరి కోసం?” అని పాట స్టార్ట్ చేశాడు.