Idream media
Idream media
స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలు ప్రజలకు అర్థం కావాలనే తాము మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని, ఎన్నికలంటే భయపడో, చేతగాకో కాదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పార్టీ నేతలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్థులందరితోనూ మాట్లాడిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎస్‌ఈసీ నీలం సాహ్ని ఆధ్వర్యంలో తమకు న్యాయం జరగదనే ఈ కఠిన నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు.
ఎన్నికలను బహిష్కరించేందుకు గల కారణాలను చంద్రబాబు సుదీర్ఘంగా వివరించారు. బాబు చెప్పిన కారణాలు విన్న వారికి ఆశ్చర్యం కలగకమానదు. పరిషత్ నోటిపికేషన్ వచ్చి ఏడాది 13 రోజులు అవుతోందని, ఈ మధ్యలో 100 మంది అభ్యర్థులు చనిపోయారని చెప్పారు. అలాంటప్పుడు అ నోటిఫికేషన్ ఎలా చెల్లుతుందని ప్రశ్నించిన చంద్రబాబు.. అదే సమయంలో వచ్చిన నోటిఫికేషన్ ఆధారంగానే మున్సిపల్ ఎన్నికలు జరిగాయన్న విషయం మరిచిపోయినట్లున్నారు.
కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్న గత ఏడాది అక్టోబర్‌లోనూ, వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభమైన ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఎన్నికలు నిర్వహించాలని పట్టుబట్టిన చంద్రబాబు.. ఇప్పుడు కరోనా సెకెండ్ వేవ్‌లో పరిషత్ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఏముందంటూ ప్రశ్నించి తన రెండు కళ్ల సిద్ధాంతాన్ని మరోసారి బయటపెట్టారు. ఆరు రోజుల్లో పూర్తయే పరిషత్ ఎన్నికల తర్వాత.. గ్రామాల్లోనూ వ్యాక్సిన్ వేయాలనే ప్రభుత్వ లక్ష్యం బహుసా చంద్రబాబు దృష్టికి చేరనట్లుంది.
తిరుపతి ఎన్నికలు జరుగుతుండగా పరిషత్ ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని కూడా చంద్రబాబు ప్రశ్నించారు. తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్‌కు ముందే ఈ నెల 10వ తేదీకే పరిషత్ పోరు ముగుస్తుందనే విషయం చంద్రబాబు మరచిపోయినట్లుంది. ఓ పక్క ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని పలు కారణాలను చెబుతున్న చంద్రబాబు.. అదే సమయంలో.. ఎన్నికలు నిర్వహించే అధికారం ఎస్‌ఈసీకి ఉందా..? అంటూ ప్రశ్నించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మళ్లీ మరు నిమిషంలోనే కొత్త నోటిఫికేషన్ ఇస్తే.. పోటీ చేస్తామంటూ చంద్రబాబు చెప్పడం నిలకడలేని ఆయన వ్యవహార శైలికి అద్ధం పడుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికలను, ఉప ఎన్నికలను జయలలిత, జ్యోతి బసులు కూడా బహిష్కరించారని గుర్తు చేసిన చంద్రబాబు.. తాను చేసింది తప్పు కాదని చెప్పుకునేందుకు తంటాలు పడ్డారు. అయితే జయలలిత, జ్యోతిబసులు నోటిఫికేషన్ రాక ముందే ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసి.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు నామినేషన్లు వేసిన టీడీపీ.. ఇప్పుడు తుది సమయంలో బహిష్కరిస్తున్నామని చెప్పుకుంటూ జయలలిత, జ్యోతిబసులతో తనను తాను చంద్రబాబు పోల్చుకుంటుండడంతో అందరూ ముక్కునవేలేసుకుంటున్నారు.
Also Read : టీడీపీ అస్త్రసన్యాసం దేనికి సంకేతం..
మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ స్వతంత్రంగా వ్యవహరించారని చెబుతూనే.. స్థానిక సంస్థల్లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబు చెప్పుకొస్తున్నారు. నిమ్మగడ్డ ఉన్నప్పుడే పరిషత్ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడం, నామినేషన్లు స్వీకరణ, ఉపసంహరణ, తుది జాబితాను ప్రకటించిన విషయం చంద్రబాబు ప్రస్తావించకపోడం గమనార్హం. టీడీపీ, ఇతర పార్టీలు కోరినట్లుగానే ఏకగ్రీవాలపై విచారణ, బెదిరింపుల వల్ల నామినేషన్లు వేయలేని వారికి మళ్లీ అవకాశం ఇచ్చేందుకు నిమ్మగడ్డ చేసిన ప్రయత్నాలకు కోర్టుల్లో బ్రేకులు పడ్డాయి. అయినా పాడిందే పాటరా.. అన్నట్లుగా మళ్లీ అదే డిమాండ్ చేస్తూ చంద్రబాబు అండ్ కో యాగీ చేయడం వెనుక కారణం ఏమిటో ఇట్టే అర్థమవుతోంది.
కోర్టుల్లో కేసులు ఉండగానే నోటిఫికేషన్ ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్న చంద్రబాబు.. నిమ్మగడ్డ ఎస్‌ఈసీగా ఉన్న సమయంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఎలా వచ్చిందో ప్రజలకు గుర్తుంది. వ్యాక్సినేషన్ ప్రారంభం అవుతున్న సమయంలో మరికొద్ది రోజులు ఎన్నికలను వాయిదా వేసేలా ఎస్‌ఈసీని ఆదేశించాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కోర్టుల్లో విచారణలో ఉండగానే.. అవేమీ పట్టించుకోకుండా నిమ్మగడ్డ నోటిఫికేషన్ విడుదల చేశారు.
పంచాయతీ ఎన్నికలు నాలుగు దశల్లో జరిగితే.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఒకే దశలో నిర్వహించాల్సిన తొందరేమొచ్చిందంటూ కూడా చంద్రబాబు ప్రశ్నించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను, మున్సిపల్ ఎన్నికలను ఒకే దశలో నిర్వహించాలని నోటిఫికేషన్ జారీ చేసింది.. తాము స్వతంత్రంగా పని చేశారని చెబుతున్న నిమ్మగడ్డ రమేష్‌కుమారే అన్న విషయం చంద్రబాబు ఇక్కడ మరిచిపోయినట్లున్నారు.
ఈ తరహాలో హాస్యాస్పదమైన, తర్కంలేని కారణాలను చెప్పిన చంద్రబాబు.. పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయకుండా.. ప్రజా క్షేత్రంలో అధికార వైసీపీని దోషిగా నిలబెడతామంటూ చెప్పడం కొసమెరుపు. టీడీపీ ప్రభుత్వ సమయంలో మైక్ ఇవ్వకుండా ప్రతిపక్ష గొంతు నొక్కుతున్నారంటూ వైఎస్ జగన్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించి.. ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామని బయటకు వస్తే.. ప్రజా స్వామ్యం అంటే జగన్‌కు గౌరవం లేదు.. భయపడి పారిపోయారు అంటూ హేళనగా మాట్లాడిన చంద్రబాబు, టీడీపీ నేతలు.. ఇప్పుడు ఆ మాటలను, అవహేళనలను ఎదుర్కొనే పరిస్థితికి వచ్చారు. అందుకే అంటారు కాలం అన్నింటికీ సమాధానం చెబుతుందీ అని.
Also Read : టీడీపీ పరిషత్ ఎన్నికల బహిష్కరణ ఎందుకు..?