చీమ చిటుక్కుమ‌న్నా జ‌గ‌న్ ప‌నే..!

అధికార ప‌క్షం, విప‌క్షం.. ఏ రాష్ట్రంలోనైనా ఎప్పుడూ ఉంటాయి. స‌ర్కారు చేసే త‌ప్పుల‌ను ఎత్తి చూపుతూ విప‌క్షం రాద్దాంతం చేస్తూనే ఉంటుంది. ప్ర‌జ‌ల త‌ర‌ఫున పోరాడుతుంటుంది. ఆందోళ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ ఉంటుంది. ముఖ్య‌మంత్రి త‌ప్పు చేసే నిల‌దీస్తూ ఉంటుంది. నిల‌దీయాలి కూడా. గ‌తంలోనూ, వ‌ర్త‌మానంలోను ఎక్క‌డైనా అదే జ‌రిగింది. జ‌రుగుతుంటుంది. కానీ ఏపీలో న‌యా రాజ‌కీయాలు మొద‌ల‌వుతున్నాయి. ఇదిలో పులి.. అంటే అదిగో వాత అన్న చందంగా.. ప్ర‌తిప‌క్షం తీరు ఉంటోంది. ప్ర‌స్తుతం ప్ర‌తిప‌క్షంలో ఉన్న టీడీపీ గ‌తంలో కూడా ఆ పాత్ర పోషించింది. అయితే, ఎన్న‌డూ లేని రీతిలో ఈ ద‌ఫా పాలిటిక్స్ చేస్తోంది. రాష్ట్రంలో ఎక్క‌డ ఏ ఘ‌ట‌న జ‌రిగినా అది ముఖ్య‌మంత్రి జ‌గ‌నే ద‌గ్గ‌రుండి చేయించిన‌ట్లుగా, ఒక్కోసారి అయితే ఆయ‌నే చేసిన‌ట్లుగా మాట్లాడేస్తుంటుంది.

స‌ర్కారుపైన‌, ముఖ్య‌మంత్రిపైనా ప్ర‌తిప‌క్షం విమ‌ర్శ‌లు చేయ‌డం మామూలే కానీ.. ఇలా చీమ చిటుక్కుమ‌న్నా జ‌గ‌నే చేశారని ఆపాదిస్తుండ‌డం టీడీపీ అల‌వాటుగా మారిపోయింద‌నే అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ఒక‌రు కాదు.. ఇద్ద‌రు కాదు.. అధినేత నుంచి చోటా మోటా నేత‌ల వ‌ర‌కూ అలాగే వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం వెనుక పార్టీ ప్ర‌ణాళిక దాగి ఉంద‌నే విష‌యం అర్థ‌మ‌వుతోంది. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల‌ను విమ‌ర్శిస్తే జ‌నం హ‌ర్షించ‌డం లేద‌నే కార‌ణంగానే.. మ‌తోన్మాద‌, హ‌త్యా రాజ‌కీయాల‌ను ఎంచుకుంటున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఊ.. అంటే పోలీసుల‌ను కూడా విమ‌ర్శించ‌డం ద్వారా బెదిరింపు ధోర‌ణి దాగి ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

ఇప్పుడు తాజాగా గుంటూరు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో టీడీపీకి చెందిన చంద్రయ్య హ‌త్య ఘ‌ట‌న‌పై కూడా టీడీపీ అదే ఎజెండాను అమ‌లు చేస్తోంది. చంద్రయ్య హత్యపై టీడీపీ జాతీయ ప్రధాని కార్యదర్శి లోకేష్ ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ హత్యా రాజకీయాలకు వారసుడు అంటూ జగన్ పై ముద్ర వేసేశారు. ఆయ‌న సీఎం కావ‌డం వ‌ల్లే ప్రజలకు, ప్రతిపక్షాలకు రక్షణ లేకుండా పోయిందట‌. ప్రశ్నించే వారిపై దాడులు, పోరాడే వారిని అంతమొందించడం అలవాటుగా మారిందని ఆయన ఆరోపించారు.
అంతేకాకుండా పాలనతో ప్రజల్ని మెప్పించలేక ప్రభుత్వాన్ని ఎండగడుతున్న వారిని చంపి ప్రతిపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన‌డం ద్వారా ఎక్క‌డ ఎవ‌రు చ‌నిపోయినా అది ప్ర‌భుత్వ‌మే చేయించింద‌న్న‌ట్లుగా మాట్లాడుతున్నారు.

ఇక వైసీపీ అరాచకాల్ని సహించం, ఇప్పటి నుంచి రాష్ట్రంలో ఎక్కడైనా మరో టీడీపీ కార్యకర్తపై చేయి వేస్తే పరిణామాలు వేరేగా ఉంటాయంటూ టీడీపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కూడా అదే విధంగా స్పందించారు. రాష్ట్రంలో జగన్ హ‌త్యా రాజకీయాల్ని పెంచి పోషిస్తున్నారని అచ్చెన్న కూడా అదే పాట అందుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పల్నాడులో అరాచకాలు, హత్య రాజకీయాలు ఎక్కువయ్యాయని ప్ర‌చారం చేస్తున్నారు. ఇక అధినేత చంద్ర‌బాబు రాజ‌కీయాలు అయితే.. ఈ రెండేళ్ల‌లో ఎంతో మార్పు క‌నిపిస్తోంది. ప్ర‌తీ అంశంపైనా లాజిక‌ల్ గా, పాయింట్ల వారీగా మాట్లాడే ఆయ‌న కూడా జ‌గ‌న్ పై అస‌హ‌నం త‌ప్పా.. వాస్త‌వాలు మాట్లాడుతున్న‌ట్లు క‌నిపించ‌డం లేదు.

Show comments