iDreamPost
iDreamPost
మనకు విజయ సంస్థ అనగానే ఠక్కున గుర్తొచ్చే సినిమాలు మాయ బజార్, గుండమ్మ కథ, మిస్సమ్మ, అప్పుడు చేసి పప్పు కూడు లాంటి ఎవర్ గ్రీన్ బ్లాక్ అండ్ వైట్ క్లాసిక్స్. నలుపు తెలుగు కాలంలో తిరుగులేని ఆణిముత్యాలు అందించిన ఈ సంస్థ కలర్ జమానా మొదలయ్యాక నిర్మాణాలు తగ్గించారు కానీ పూర్తిగా మానేయలేదు. కమర్షియల్ చిత్రాలు రాజ్యమేలుతున్న టైంలోనూ గంగ మంగ, శ్రీ రాజరాజేశ్వరీ విలాస్ కాఫీ క్లబ్ లాంటి మాస్టర్ పీసులను ప్రేక్షకులకు అందించారు. తర్వాత కొంత నెమ్మదించినా 90 దశకంలో కేవలం విలువలను కూడిన కథలకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు తీశారు. అందులో ఓ మేలి ముత్యమే బృందావనం.
టైటిల్ వినగానే జూనియర్ ఎన్టీఆర్ సినిమా అనుకునేరు. 1992లో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ హీరోగా ఇదే పేరుతో వచ్చిన ఆల్ టైం ఎంటర్ టైనర్ బృందావనం. సింగీతం శ్రీనివాస రావు రచనా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో రమ్యకృష్ణ హీరోయిన్ కాగా మధురమైన స్వరాలు అందించిన మాధవపెద్ది సురేష్ సంగీత దర్శకులు. ఇదే బ్యానర్ లో ఆయన భైరవ ద్వీపం, శ్రీ కృష్ణార్జున విజయం సినిమాలు చేశారు. డివి నరసరాజు సంభాషణలు సమకూర్చారు. సత్యనారాయణ, శుభలేఖ సుధాకర్, రాళ్ళపల్లి, నగేష్, రంగనాథ్, గుమ్మడి, అంజలి దేవి, శ్రీలక్ష్మి, రాధాకుమారి, రావికొండలరావు తదితరులు ఇతర తారాగణం.
బృందావనం పేరుతో తన తండ్రి నిర్మించుకున్న కలల ఇంటిని అన్యాయంగా ఆక్రమించుకుని నాన్నమ్మను ఒంటరి దాన్ని చేసిన పానకాలు(సత్యనారాయణ)కు బుద్ధి చెప్పే రవి(రాజేంద్రప్రసాద్)అనే యువకుడి కథే ఈ సినిమా. అతనికి సాయంగా పానకాలు కూతురే (రమ్యకృష్ణ)సహాయపడటం మరో ట్విస్ట్. వినడానికి సీరియస్ గా అనిపించే లైన్ ని మొదటి నుంచి చివరి దాకా హాయిగా నవ్వుకునేలా సింగీతం వారు తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఓహో బుల్లి పావురమా. మధురమే సుధాగానం. ఆ రోజు నా రాజు చిరునవ్వు చూసి పాటలు మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకున్నాయి. 1992 నవంబర్ 27వ తేదీ నరేష్ ఏంటి బావా మరీనూకి పోటీగా విడుదలైన బృందావనం ఘన విజయం సాధించింది. టీవీలో వచ్చిన ప్రతిసారి చక్కని వినోదానికి చిరునామాగా నిలుస్తోంది
Also Read : Orey Rickshaw : రాజకీయ కుళ్ళుని ప్రశ్నించిన రిక్షావాలా – Nostalgia