బీఎన్‌రెడ్డి ఎవ‌ర్‌గ్రీన్ క్లాసిక్ భాగ్య‌రేఖ‌

సిండ‌రెల్లా క‌థంటే అంద‌రికీ ఇష్ట‌మే. చిన్న‌ప్పుడు క‌ష్టాల ప‌డిన ఒక‌మ్మాయి , రాజ‌కుమారుడిని పెళ్లి చేసుకుంటే ఆనంద‌ప‌డ‌తాం. క‌ష్టం త‌ర్వాత సుఖం వ‌స్తుంద‌నే ఒక ఆశ‌, మ‌నుషుల్ని బ‌తికిస్తూ ఉంటుంది. ఇదే క‌థ‌ని బీఎన్‌రెడ్డి భాగ్య‌రేఖ అనే సినిమా తీస్తే సూప‌ర్‌హిట్‌. అంత‌కు ముందు బంగారుపాప తీసి ఆయ‌న చేతులు కాల్చుకున్నారు. అందుక‌ని సేఫ్ స‌బ్జెక్ట్‌గా భాగ్య‌రేఖ‌ని ఎంచుకున్నారు.

బీఎన్ ఎంత గొప్ప క‌ళాకారుడంటే , ఆయ‌న సినిమాల్లో న‌టులే గొప్ప‌గా న‌టిస్తారా? గొప్ప న‌టుల్నే ఆయ‌న తీసుకుంటారా? అనేది అర్థం కాదు. ప్ర‌తి ఫ్రేమ్‌ని గొప్ప‌గా తీయ‌డ‌మే బీఎన్ ప్ర‌త్యేక‌త‌.

బ్లాక్ అండ్ వైట్‌లో అద్భుతాన్ని సృష్టిస్తారు. ఆయ‌న త‌మ్ముడు బీఎన్ కొండారెడ్డి కెమెరా ప‌నిత‌నం సినిమా అంత‌టా క‌నిపిస్తుంది. ఈ కొండారెడ్డి చివ‌రి రోజుల్లో అనంత‌పురంలో ఉన్నారు. దొర‌ల టోపీతో , చేతిలో స్టిక్‌తో ఠీవిగా న‌డుస్తూ సుభాష్‌రోడ్డులో క‌నిపించేవారు. ఆయ‌న ఎవ‌రో తెలియ‌క ఆశ్చ‌ర్యంగా చూసేవాన్ని. ఒక‌రోజు స్నేహితుడి ఇంట్లో ఆయ‌న‌తో మాట్లాడే అదృష్టం క‌లిగింది. అప్పుడు నాకు 14 ఏళ్ల వ‌యస్సు. కెమెరా చూసి జ‌మున ఎంత భ‌య‌ప‌డేదో చెబుతూ ఉంటే ఆశ్చ‌ర్యంగా విన్నాను.

బీఎన్ కోస‌మే పొన్న‌లూరి బ్ర‌ద‌ర్స్ నిర్మాత‌ల‌గా మారి తీసిన సినిమా భాగ్య‌రేఖ‌. వాస్త‌వానికి ఈ క‌థ‌లో జ‌మునే హీరో. ఎన్టీఆర్‌కి పాత్ర‌లేదు. అయితే బీఎన్ మీదున్న గౌర‌వంతో ఎన్టీఆర్ ఒప్పుకున్నాడ‌ట‌.

గోవింద‌రాజుల సుబ్బారావు ఒక చిన్న పాత్ర వేశాడు. ముస‌ల‌య్య పాత్ర‌లో యోగిలా క‌నిపిస్తాడు. ఈయ‌నేనా క‌న్యాశుల్కంలో లుబ్ధావ‌దానులుగా న‌టించింది అని అనుమానం వ‌స్తుంది. మారుత‌ల్లిగా సూర్య‌కాంతం గురించి చెప్ప‌క్క‌ర్లేదు. మ‌హాత‌ల్లి, ఎంత ప్ర‌తిభావంతురాలంటే తెలుగు వాళ్లు సూర్య‌కాంతం అని పేరు పెట్టుకోడానికే జ‌డుసుకునేలా చేసింది.

క‌న్నింగ్ విల‌న్‌గా ర‌మ‌ణారెడ్డి, ఒక చిన్న వేషంలో అల్లు రామలింగ‌య్య న‌టించారు. తిరుమ‌ల‌లో కూడా ఆ రోజుల్లో షూటింగ్ జరిగేది. కాలుష్యం, ర‌ద్దీ లేని తిరుమ‌ల 1957లో ఎలా ఉండేదో ఈ సినిమాలో చూడొచ్చు.

పెండ్యాల నాగేశ్వ‌ర‌రావు సంగీతంలో “నువ్వుండేది ఆ కొండ‌పై” ఆల్‌టైమ్ హిట్‌. నాగిన్ లోని త‌న్‌డోలే , మ‌క్‌డోలేకి అనుక‌ర‌ణ‌గా “మ‌న‌సూగే, స‌ఖాత‌నువూగే” పాట ఉంది. బీఎన్ ఒక పాట‌ల ర‌చ‌యిత‌ని (ఎరమాకుల ఆదిశేషారెడ్డి) ప‌రిచ‌యం చేసినా త‌రువాతి రోజుల్లో ఆయ‌న క‌నుమ‌రుగై పోయారు.

నాలుగు కేంద్రాల్లో 100 రోజులు ఆడిన భాగ్య‌రేఖ‌కి ప్రాంతీయ చిత్రాల కేట‌గిరీలో నేష‌న‌ల్ అవార్డు ల‌భించింది.

Show comments